హైదరాబాద్: రైతుల కష్టాలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, మళ్లీ బిఆర్‌ఎస్ ప్రభుత్వం రావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారన్నారు. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సమక్షంలో ఆ పార్టీలో పలువురు నేతలు చేరారు. రాజేంద్రనియోజకవర్గానికి చెందిన మాజీ డిసిఎంఎస్ చైర్మన్, మాజీ ఎంపిపి చెక్కల ఎల్లయ్య ముదిరాజ్, పెద్దషాపూర్ మాజీ సర్పంచ్ చెక్కల చంద్రశేఖర్, పాశం యాదగిరి కూతురు పాశం పల్లవి, అల్లుడు అంజిబాబు, తదితరలు బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. కెటిఆర్ గులాబీ కండువా కప్పి వారిని పార్టీలో ఆహ్వానించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ పాలనలో రియల్ ఎస్టేట్ నాశనమైందని, తెలంగాణలో భూముల ధరలు భారీగా పడిపోయాయని, తెలంగాణ ప్రజల ఆస్తి కరిగిపోయిందన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కోటీ మందిని కోటీశ్వరులు చేయడం కాదు మహిళల పుస్తెలు ఎత్తుకోకపోతే చాలు అని చురకలంటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇస్తానన్న తులం బంగారం ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. అరాచక పాలనతో ఎవరు సంతోషంగా లేరని, ఆక్రమణల పేరుతో పేదలు ఇండ్లు కూలగొడుతున్నారని కానీ పెద్దల ఇండ్లు ఎందుకు కూలగొడుతలేరని ప్రశ్నించారు. పేదల స్థలాలు మాత్రమే కనిపిస్తున్నాయి?, పెద్దల స్థలాలు కనిపించడం లేదా? అని హైడ్రాను నిలదీశారు. ఆరు గ్యారెంటీలె ఇంకెప్పుడు అమలు చేస్తారని అడిగారు. ప్రతి మహిళకు 2500 ఇస్తామన్నారు, ఎప్పుడు ఇస్తారని, కోటీ 67 లక్షల మంది ఆడబిడ్డలు ఎదురుచూస్తున్నారన్నారు. మూసీగా అడ్డంగా కడుతున్న వారిని ఎందుకు పట్టించుకోవడంలేదన్నారు. పేదల వద్ద పత్రాలు ఉన్న రాత్రికి రాత్రే కూలగొడుతున్నారని దుయ్యబట్టారు. పాలించడానికి కండకాదు, గుండె కావాలని, రేవంత్‌కు పాలన చేతగాక మాజీ సిఎం కెసిఆర్ అప్పు చేశారని మాట్లాడుతున్నారని, నెలకు పది వేల కోట్లు రేవంత్ అప్పు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇందరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కట్టడం కాదు ఇండ్లు కూలగొట్టడం అని ఎద్దేవా చేశారు.