హైదరాబాద్: నిందితుడికి మంత్రి కొండా సురేఖ ఆశ్రయం ఇవ్వడం సరైందేనా? అని బిఆర్ఎస్ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. కొండా సురేఖ ఇంట్లో నిందితుడు ఎందుకు ఉన్నారు? అని అడిగారు. కొండా సురేఖ ఇంటిపైకి వెళ్లేందుకు పోలీసులకు ఎవరు ఆదేశాలు ఇచ్చారు? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ మహిళా నేతల సమావేశంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నిందితుడిని కొండా సురేఖ కారులో తీసుకెళ్తే పోలీసులు చర్యలు తీసుకోరా? అని, ఈ అంశంలో అసలేం జరిగిందని ఎక్కడ సెంటిమెంట్ జరిగింది? అని నిలదీశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే స్వయంగా ఓఎస్ డికి గన్ ఇచ్చి సిమెంట్ కంపెనీ డైరెక్టర్ టేబుల్ పై గన్ పెట్టి బెదిరించారని ఆరోపణలు చేశారు.
అసలు ఈ గన్ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చిందని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? అని నిలదీశారు. అసలు ఈ సెటిల్ మెంట్ పై పోలీసులు విచారించారా లేదా? అని మంత్రి కుమార్తె ఏకంగా సిఎంపై ఆరోపణలు చేస్తే వివరణ ఎందుకు ఇవ్వలేదు? అని సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. సదరు సిమెంట్ కంపెనీ డైరెక్టర్ స్టేట్ మెంట్ పోలీసులు తీసుకున్నారా? తీసుకుంటే అది ప్రజల ముందు ఉంచాలన్నారు. రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితుడే ఈ సెటిల్‌మెంట్‌లో కూర్చున్నారని, అంటే కచ్చితంగా సిఎం ఇందులో హస్తం ఉందని సబితా ఆరోపణలు చేశారు.