మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర స్థానిక సం స్థల ఎన్నికల నిర్వహణపై కీలక పరిణామాలు చో టుచేసుకుంటున్నాయి. తాజాగా హైకోర్టులో మ రో పిటిషన్ దాఖలైంది. స్థానిక ఎన్నికలపై రీ నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని సురేంద ర్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న సిజె జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ధర్మాసనం ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌ను ప్రశ్నించింది. దీంతో బిసి రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపై ప్రభుత్వానికి లేఖ రాశామని రాష్ట్ర ఎన్నికల సంఘం తరపున న్యాయవాది విద్యాసాగర్ హైకోర్టుకు తెలిపారు. ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చిన తర్వాత తదుపరి చర్యలు చేపడతామన్నారు. ఈ క్రమంలో ఎన్నికలు నిర్వహణపై స మాధానం చెప్పేందుకు ధర్మాసనం రెండు వారాల సమయం ఇచ్చింది. అనంతరం విచారణను 2 వా రాలకు వాయిదా వేసింది. విచారణ సందర్భంగా పిటిషనర్ వాదనలు
వినిపిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరారు. పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని గత విచారణ సందర్భంగా ఆదేశించినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని కోర్టు తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఇటీవల విడుదల చేసిన స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ను నిలుపుదల చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. ప్రభుత్వం మరోసారి రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉందన్నారు.
ఈ క్రమంలో సుప్రీంకోర్టు సైతం ఎన్నికలకు వెళ్లాలని సూచించింది కదా అని ధర్మాసనం గుర్తు చేసింది. దీంతో సుప్రీం కోర్టు మౌకికంగా చెప్పిందని, ఎక్కడా ఉత్తర్వుల్లో పేర్కొనలేదని ఇసి తరపు న్యాయవాది కొర్టుకు చెప్పారు. ప్రభుత్వ నిర్ణయం చెప్పడానికి మూడు వారాల సమయం కావాలని ప్రభుత్వ తరపు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి రెండు వారాల గడువు ఇచ్చి కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించి, తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. స్థానిక ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెంబర్ 9 జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ జీఓ ప్రకారమే ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే హైకోర్టు ఈ జీఓని రద్దు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టకుండానే అత్యున్నత న్యాయస్థానం సైతం రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేయడంతో రిజర్వేషన్ల పంచాయితీ అగమ్యగోచరంగా మారింది. దీంతో స్థానిక ఎన్నికల ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. అటు ప్రభుత్వం నుంచి ఆర్డర్స్ రాకపోతే పార్టీ పరంగా బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే.