సైబర్ నేరాలు విచ్చలవిడిగా సాగుతుండడం, లక్షలు, కోట్ల రూపాయలు దోపిడీ కావడం ప్రభుత్వానికి, కేంద్ర దర్యాప్తు సంస్థలకు తీరని సమస్యగా పరిణమిస్తోంది. అనేక రూపాల్లో ఇవి చాపకిందనీరులా సాగుతున్నాయి. అంతా జరిగిపోయాకనే బాధితులకు వీటి మోసం బయటపడుతోంది. ఈ పరిణామాలకు కొందరు బాధితులు ఆర్థికంగా, మానసికంగా కృశించి వ్యాధిగ్రస్థులు కావడమేకాక, కొందరు ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు జరిగాయి. ఇటీవల కొన్ని నెలలుగా ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో సైబర్ నేరాలు బాధితులను భయకంపితులు చేస్తున్నాయి. ఇడి, సిబిఐ, ఆర్‌బిఐ సంస్థల పేర్లనే కాదు చివరికి సుప్రీం కోర్టు పేరు చెప్పి కూడా నకిలీ అరెస్టు వారెంట్లు బాధితులకు పంపుతున్నారు. ఈ సమస్యపై సుప్రీం కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. సుమోటోగా తీసుకున్న ఓ డిజిటల్ అరెస్టు కేసు విచారణ సందర్భంగా కేంద్రం, సిబిఐలకు తమ స్పందన తెలపాలని ఆదేశించింది. హర్యానా లోని అంబాలాకు చెందిన 73 ఏళ్ల ఓ మహిళ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్‌కి సైబర్ నేరగాళ్ల బెదిరింపులపై ఫిర్యాదు చేసింది. తనను ‘డిజిటల్ అరెస్టు’ చేయాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసినట్టు ఉన్న ఒక పత్రాన్ని నేరగాళ్లు తనకు చూపించారని ఆమె పేర్కొంది. రూ. కోటి ఇస్తే ఈ అరెస్టు నుంచి బయటపడవచ్చని బెదిరించారని వివరించింది. సాక్షాత్తు సుప్రీం కోర్టే ఆదేశాలు జారీ చేసినట్టు నకిలీ పత్రాలు సృష్టించి నేరగాళ్లు బెదిరిస్తుండడం సుప్రీంకోర్టు ధర్మాసనానికి మింగుడు పడడం లేదు. శుక్రవారం (17.10. 2025) దీనిపై ధర్మాసనం విచారణ నిర్వహించడం గమనార్హం. దీనివల్ల ప్రజలకు న్యాయవ్యవస్థపై విశ్వాసం దెబ్బతింటుందని ధర్మాసనం ఆందోళన వెలిబుచ్చింది. ఇవి సాధారణ మోసాలుగా భావించకూడదని, వీటిని బయటపెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర పోలీసుల మధ్య సమన్వయం అవసరమని అభిప్రాయపడింది. ఈ ఏడాది జూన్‌లో డిజిటల్ పేమెంట్స్ అవార్డ్ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డిజిటల్ అరెస్టుల మోసాలను అరికట్టేందుకు సరైన పరిష్కారాలతో ముందుకు రావాలని ఫిన్‌టెక్, స్టార్టప్‌లకు పిలుపునిచ్చారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ వృద్ధురాలిని మోసగించి రూ. 35 లక్షలు కాజేసిన సంఘటనపై శుక్రవారం (అక్టోబర్ 17) సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు అందడం గమనార్హం. లండన్ ఎయిర్ పోర్టులో మీ అబ్బాయికి ప్రమాదంలో తలకు పెద్ద గాయాలయ్యాయని, ఆస్పత్రిలో చికిత్స కోసం అర్జెంట్‌గా చేర్చాలని నమ్మించి ఆమె దగ్గరనుంచి డాక్టరు పేరుతో ఓ వ్యక్తి రూ. 35.23 లక్షలు కాజేశాడు. ఆమె నేరుగా తన కుమారుడితోనే మాట్లాడడంతో అసలు మోసం బయటపడింది. హైదరాబాద్‌లోనే గత ఏడాది నవంబర్‌లో 48 ఏళ్ల మహిళను లక్షంగా చేసుకుని డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టి మోసాలకు పాల్పడిన ముఠాలోని కీలక వ్యక్తిని ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. పోలీస్ అధికారులుగా నటించి మనీలాండరింగ్‌తో సంబంధాలు ఉన్నాయని, ఆమె ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బంగారు రుణాలు, తదితర వ్యక్తిగత రుణాల నుండి పెద్ద మొత్తంలో డబ్బు పంపాలని ఈ ముఠా ఒత్తిడి తెచ్చింది. ఆధార్, ఇతర వ్యక్తిగత వివరాలు సేకరించి డిజిటల్ అరెస్టుకు పాల్పడ్డారు. చివరకు బాధితురాలి ఫిర్యాదుతో మొత్తం ఐదుగురు నిందితులను సైబర్‌క్రైమ్ యూనిట్ అరెస్టు చేయగలిగింది.ఈ ఏడాది సెప్టెంబరులో హైదరాబాద్ మధురానగర్‌కు చెందిన 76 ఏళ్ల మహిళను బెంగళూరు పోలీసుల వేషంలో నేరగాళ్లు మానవ అక్రమ రవాణా కేసు నమోదైందని బెదిరించారు. సుప్రీం కోర్టు జారీ చేసినట్టు నకిలీ పత్రాలను చూపించి డిజిటల్ అరెస్టు చట్రంలో బంధించారు. దీంతో బాధితురాలు సెప్టెంబర్ 6న తన బ్యాంకు ఖాతాలో ఉన్న రూ. 6.6 లక్షలను సైబర్ నేరగాళ్ల ఖాతాలోకి జమ చేసింది. అంతటితో సైబర్ నేరగాళ్లు ఆగలేదు. డిజిటల్ అరెస్టు పేరుతో వేధించేసరికి ఆమె గుండెపోటుతో మృతి చెందింది. ఆ తరువాత ఈ మోసం కుటుంబీకులకు తెలిసింది. ఈ ఏడాది మార్చిలో ముంబైకి చెందిన 86 ఏళ్ల మహిళ సైబర్ నేరగాళ్ల మోసం వల్లనే ఏకంగా రూ. 20 కోట్లు పోగొట్టుకుంది. ఇంతవరకు దేశంలో ఎక్కడా లేని విధంగా అతిపెద్ద డిజిటల్ అరెస్ట్ స్కామ్ ఢిల్లీలో జరిగింది. సౌత్ ఢిల్లీకి చెందిన రిటైర్డ్ బ్యాంకర్ నరేష్ మల్హోత్రా అనే 75 ఏళ్ల వృద్ధుడు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడ్డాడు. తన ల్యాండ్‌లైన్ నెంబర్ హ్యాక్ అయిందని, ఆధార్ నెంబర్ ఉపయోగించి బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేశారని బెదిరించారు. ఈ ఖాతాల ద్వారా పుల్వామా కేసులో ఉగ్రవాదులకు రూ. 1300 కోట్ల నిధులు సమకూర్చారని, అందుకని ఎన్‌ఐఎ అరెస్టు తప్పదని బెదిరించారు. ఇడి, సిబిఐ, సుప్రీం కోర్టు పేరులు చెప్పి ఆ వృద్ధుడిని నెలరోజుల పాటు డిజిటల్ అరెస్టు చేసి, రూ. 23 కోట్లు కాజేశారు. దీనిపై పోలీసులు రంగం లోకి దిగి ఈ డబ్బు విదేశాలకు వెళ్లినట్టు గుర్తించారు. ఇందులో రూ. 12.11 కోట్లను సీజ్ చేయగలిగారు. డిజిటల్ అరెస్ట్ సైబర్ మోసం కేసులో దేశంలోనే మొట్టమొదటిసారిగా పశ్చిమబెంగాల్‌లో 9 మందికి యావజ్జీవ శిక్షలు విధిస్తూ ఈ ఏడాది జులైలో తీర్పు వెలువడడం సంచలనాత్మకం. పార్థకుమార్ ముఖర్జీ అనే రిటైర్డు సైంటిస్టును ఆర్థిక నేరాల పేరుతో సైబర్ నేరగాళ్లు బెదిరించి, డిజిటల్ అరెస్టు చూపించి ఏకంగా రూ. కోటి గుంజారు. దీనిపై 2024 అక్టోబర్‌లో ఫిర్యాదు అందగా, కేవలం నాలుగున్నర నెలల్లోనే పోలీసులు నిందితులు 13 మందిని పట్టుకోగలగడం విశేషం. వీరిలో తొమ్మిది మందిపై ఫోర్జరీ, కుట్ర తదితర కేసులు నమోదయ్యాయి. వీరికి యావజ్జీవ శిక్షవిధిస్తూ నడియా జిల్లా కల్యాణి కోర్టు తీర్పు చెప్పడం మైలురాయిగా నిలిచిపోయింది.