మహారాష్ట్రలోని నందూర్భార్ జిల్లాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. చాంద్సైలి ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న వాహనం అదుపు తప్పి లోయలో పడిపోయింది. అక్కడికక్కడే ఆరుగురు చనిపోగా, ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో 28 మంది గాయపడ్డారు. వీరిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉంది. మూల మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. బాధితులంతా దడ్గావ్ తాలూకా లోని అస్లి వద్ద అష్టంబ (అశ్వత్థామ ) రుషి తీర్థయాత్రకు వెళ్లి తిరిగి వస్తున్నసమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ఏటా దీపావళి సందర్భంగా ఈ తీర్థయాత్ర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పోలీసులు, సహాయక బృందాలు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని సమీపం లోని ఆస్పత్రులకు తరలించారు. మృతుల్లో ఐదుగురు నందూర్బార్ తాలూకా లోని ఘోటానే నివాసితులుగా సమాచారం.