‘ఎప్పటికెయ్యది ప్రస్తుతమప్పటికా మాటలాడి అన్యుల మనము నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు’ అన్నాడు సుమతీ శతకకారుడు ఎప్పుడో. ఈ మాటను ప్రస్తుత మన రాజకీయ నాయకులు తమకు అనుకూలంగా అన్వయించుకుంటూ ఉంటారు. అటువంటి రాజకీయ నాయకులలో అందెవేసిన చెయ్యి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుది. రాజకీయాల్లో బాగా రాటుదేలిన వ్యక్తి ఆయన. ఒకటా రెండా.. దాదాపు 50 సంవత్సరాలుగా రాజకీయాల్లోనే మునిగి తేలుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం నుండి దిగిపోయాక ఇంకో మాట మాట్లాడితే తప్పులేదని సుమతీ శతకకారుడే చెప్పాడు కదా అనుకుంటారేమో ఆయన. చరిత్ర రీలు వెనక్కు తిప్పితే చంద్రబాబునాయుడు రాజకీయాల్లో ‘ఎప్పటికామాటలాడి’ అన్నవిధంగా అనేక సందర్భాల్లో, అనేక విషయాల్లో ప్లేటు ఫిరాయించి చెప్పిందొకటి చేసింది ఒకటి అన్నవిధంగా వ్యవహరించిన విషయం జగద్విదితం.
మిగతా విషయాలు ఎలా ఉన్నా మద్యం విషయంలో ఆయన తీసుకున్న యూటర్న్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మద్యం ఒక పెద్ద చర్చనీయాంశంగా తయారైంది. 201419 కాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్యం విధానానికి సంబంధించి అక్రమాలు జరిగాయంటూ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన కేసులో ఆయన బెయిల్ పై ఉన్నారు. 2024లో మళ్ళీ అధికారంలోకి రాగానే వైయస్సార్ కాంగ్రెస్ కు సంబంధించిన నాయకులను, ఆ పార్టీ ప్రభుత్వ హయాంలో పనిచేసిన కొందరు అధికారులను మద్యానికి సంబంధించిన కుంభకోణం జరిగిందనే ఒక కేసు పెట్టి జైలుకు పంపించారు.
ఈ రభస ఇలా జరుగుతున్న సమయంలోనే ఆంధ్రప్రదేశ్ లో పెద్దయెత్తున కల్తీ మద్యం చలామణిలో ఉన్న విషయాలు బయటపడుతున్నాయి. ఇది కేవలం అక్కసుతో ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలు కాదు. ఎక్సైజ్ పోలీసులే స్వయానా కేసులు పెడుతున్నారు. ఇలా కల్తీ మద్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెలరేగిపోతున్నదని, ప్రజారోగ్యం ఆందోళనలో పడిందని, కొందరు మరణించారని తాము సేకరించిన సమాచారంతో కొన్ని మీడియా సంస్థలు వార్తలు రాస్తే అందులో ఒక మీడియా సంస్థ సంపాదకుడిమీద, ఒకరిద్దరు విలేకరుల మీద ఆధారాలు చూపండని కేసులు పెడుతున్నారు. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చర్చ అంతా మద్యం చుట్టూ తిరుగుతున్నది. కాబట్టే చంద్రబాబు నాయుడు ఇతర అంశాల్లో కూడా తాను చెప్పిన దానికి భిన్నంగా వ్యవహరించిన సందర్భాలు అనేకం ఉన్నప్పటికీ ప్రస్తుతం మద్యం గురించి మాత్రమే మాట్లాడుకోవాలి. మద్యాన్ని నిషేధించాలని చాలాకాలంగా అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదట మద్యాన్ని నిషేధించింది, తమకు పట్టుగల ప్రాంతాల్లో పకడ్బందీగా అమలు చేసింది అప్పటి పీపుల్స్ వార్ పార్టీ.
1994 కు ముందు కోట్ల విజయభాస్కర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఒక్క చుక్క మద్యం కూడా అమ్మకుండా పీపుల్స్ వార్ కట్టడి చేస్తే, అప్పటి కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు జువ్వాడి చొక్కారావు దానికి మద్దతు పలికారు. ఆయన గాంధేయవాది. జీవితాంతం మద్యపానాన్ని వ్యతిరేకించినవారు. అయితే చిత్రంగా విజయభాస్కర రెడ్డి ప్రభుత్వం నక్సలైట్ల మధ్య నిషేధ కార్యక్రమాన్ని తూట్లు పొడిచేందుకు ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని పోలీస్ స్టేషన్లో పోలీసుల పహరాలో మద్యం అమ్మకాలు సాగించింది. మద్యంనుండి లభించే ఆదాయం అటువంటిది మరి. అప్పుడే ప్రతిపక్షంలో ఉన్న ఎన్టీ రామారావు మద్యనిషేధాన్ని తన ఎన్నికల ప్రచారాస్త్రంగా వాడుకొని, గెలిచిన వెంటనే మాట నిలుపుకొని సంపూర్ణ మధ్య నిషేధం విధించారు. ఆరోగ్యరీత్యా వైద్యులు నిర్ణయిస్తే కొద్ది మోతాదులో మద్యం సేవించేందుకు పర్మిట్లను అనుమతించారు. కొన్ని మాసాలకే ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు మధ్య నిషేధంపట్ల తాను మరింత కఠినంగా ఉంటానని చెప్పుకునేందుకు ఆ హెల్త్ పర్మిట్లను కూడా రద్దు చేశారు. అంతేకాదు, హైదరాబాద్ పాతబస్తీలోని కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక విశాలమైన పార్కులో అప్పటి మద్య నిషేధ శాఖ స్వాధీనపరుచుకున్న అక్రమ మద్యాన్ని తానే రోడ్డు రోలర్ నడిపిస్తూ వాటిని ధ్వంసం చేసి, పత్రికల్లో ఫోటోలు వేయించుకున్నారు. అప్పుడది అవసరం, అందుకే అది చేశారు.
కొద్ది నెలల్లోనే మద్య నిషేధాన్ని సంపూర్ణంగా ఎత్తేశారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన వెంటనే ఆయన చేసిన తొలి సంతకాలలో బెల్ట్ షాపుల ఎత్తివేత కూడా ప్రధానమైనది. బెల్ట్ షాపులు అధికారికంగా ఏర్పాటు చేసేవి కాదు. వాటిని ఎత్తివేస్తామని ఒక ముఖ్యమంత్రి అధికారికంగా సంతకం చేయడమేమిటి? అది ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ బాధ్యత కదా అని ముక్కున వేలేసుకున్నవాళ్ళు కూడా ఉన్నారు. ఎక్సైజ్ శాఖ బాధ్యత అక్రమ మద్యం ఉత్పత్తిని నిరోధించడం, కల్తీ మద్యం పంపిణీ ఆపడం, అనధికారికంగా ఏర్పాటయే మద్యం దుకాణాలను అంటే బెల్ట్ షాపులను నిర్మూలించడం. అది అధికారులు సహజంగా చేసుకోవాల్సిన పని. సంతకం అయితే చేసారు కానీ, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఆ ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెల్ట్ షాపులు ఏ రీతిలో విచ్చలవిడిగా పెరుగుతూపోయాయో ఆంధ్రప్రదేశ్ లో ఏ గ్రామానికి వెళ్లి ప్రజలు అడిగినా చెబుతారు. 2019లో ఆయన ఓడిపోయి వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాను పాదయాత్ర సందర్భంగా కానీ, ఇతరత్రా కానీ చెప్పిన సంపూర్ణ మద్య నిషేధానికి బాటలు వేస్తూ మద్యం విధానాల్లో పలు మార్పులు తీసుకొచ్చారు. మద్యం విక్రయాలు ప్రైవేట్ వారి చేతుల్లో లేకుండా చేశారు.
దుకాణాల సంఖ్య బాగా తగ్గించి ప్రభుత్వ ఉద్యోగుల ద్వారానే, ప్రభుత్వం ఆధ్వర్యంలోనే అమ్మకాలు సాగించారు. ప్రభుత్వ కార్యాలయాల పనివేళల మాదిరిగానే అవి ఉదయం తెరిస్తే సాయంత్రం మూసివేసేవారు. అదేవిధంగా, మద్యం ధరలు విపరీతంగా పెంచేశారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అనుమతి ఇచ్చిన బ్రాండ్లనే ఈ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్మినా ధరలు మాత్రం బాగా పెంచారు. రాష్ట్రంలో ఎక్కడా ఒక్క బెల్టుషాపు కూడా లేకుండా కఠినమైన చర్యలు తీసుకున్నారు. దీనివల్ల నిజానికి ప్రభుత్వ ఆదాయం చాలా తగ్గుతుంది. అయినప్పటికీ ప్రచార సమయంలోగానీ, అంతకు ముందుగానీ తాను చెప్పినట్టు సామాన్య ప్రజలకు మద్యం అందుబాటులో లేకుండా చేసినట్లయితే వారిని తాగుడుకు బానిసలు కాకుండా కాపాడటానికి ప్రయత్నించవచ్చునని ఆయన ప్రభుత్వం సంపూర్ణంగా నమ్మింది. అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి తరచూ చెప్తుండిన మాట మద్యం బాటిల్ ముట్టుకుంటే షాక్ కొట్టే విధంగా ధరలుంటాయని. ఆచరణలోనూ ఆయన అదే చేసి చూపించారు. కేరళ వంటి మరికొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ మద్యం అమ్మకాలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరుగుతాయి.
వీటితోపాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మద్యం దుకాణాల్లో ప్రతి మద్యం బాటిల్ ను విక్రయించే ముందు వినియోగదారుడి ఎదుటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చూపించే పద్ధతిని కూడా ప్రవేశపెట్టింది. ఎందుకంటే ప్రభుత్వం అమ్మే మద్యంలో కల్తీ లేదా అక్రమ మద్యం వస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందనే ఆలోచనతో. బాటిళ్లు స్కాన్ కాకపోతే దాన్ని విక్రయించేవారు కాదు. ఆంధ్రప్రదేశ్ లో మద్యపానప్రియులు ఎవరినడిగినా ఈ విషయం చెబుతారు. స్కాన్ తో ఆ మద్యం సీసా ఏ డిస్టిలరీనుండి, ఏ డిపో నుండి వచ్చిందో ఏ షాపునకు అది వెళ్ళిందో, ఆ షాపులోనే విక్రయించారా లేదా అనే విషయాలు స్పష్టంగా తెలిసిపోతాయి. ఇటువంటి పకడ్బందీ ఏర్పాటు కారణంగా కల్తీ, అక్రమ మద్యాన్ని పట్టుకోవడం చాలా సులువు అయ్యేది.
గత ప్రభుత్వంలో మద్యానికి సంబంధించి ఇదంతా జరుగుతున్న సమయంలో నాణ్యత లేని మద్యం తాగి వేలమంది మృతి చెందారంటూ అప్పటి ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ వారు, ఆయనతో స్నేహం చేసిన ఇతర కొన్ని పార్టీలు పెద్దయెత్తున ప్రచారం చేసాయి. ఇవన్నీ అభూతకల్పనలని తేల్చేస్తూ ప్రస్తుతం చంద్రబాబు నాయుడు పార్టీతో కలిసి కూటమిలో భాగస్వామిగా ఉన్న బిజెపి నేతృత్వంలోని కేంద్ర హోమ్ శాఖ 2022- 2023 నివేదికల్లో అక్రమ మద్యం కేసులు గాని, మృతులు గాని ఆంధ్రప్రదేశ్ నమోదు కాలేదని స్పష్టంగా చెప్పింది. ఇదిలాఉంటే 2024 ఎన్నికల ప్రచారంలో 70 ఏళ్ల వయసు దాటిన సీనియర్ రాజకీయవేత్త చంద్రబాబునాయుడు మద్యం విషయంలో జరిపిన ప్రచారం తీరు అందరినీ నిర్ఘాంతపరచకతప్పదు. ‘రోజంతా కష్టపడి అలసట మరచిపోవడానికి రెండు పెగ్గులు తాగాలనుకుంటారు.
ఆ మద్యం మీకు సరైనది అందడం లేదు. నాణ్యమైన మద్యం సరసమైన ధరలకే అందిస్తాం’ అని ఎన్నికల ప్రచారంలో ప్రతి బహిరంగసభలో చంద్రబాబు నాయుడు ప్రజలను ఉత్సాహపరిచారు.అనధికారిక అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 90 లక్షలమంది మద్యం సేవించే వాళ్ళు ఉండొచ్చని ఒక లెక్క. ప్రచారం తొలి రోజుల్లో చంద్రబాబునాయుడు పదేపదే మద్యం గురించి ఇలా మాట్లాడుతుంటే ఇంత సీనియర్ నాయకుడు ప్రజలను మద్యం తాగడానికి ప్రోత్సహించడం ఎబ్బెట్టుగా ఉన్నదని, మద్యనిషేధాన్ని నిజాయితీగా నమ్మి, దాని కారణంగా వచ్చే విపరిణామాలను కూడా లెక్కచేయకుండా కచ్చితంగా అమలుపరిచిన ఎన్టీ రామారావు తన ఆరాధ్యదైవం అని చెప్పుకుంటూ ఆయన ఆత్మక్షోభించే విధంగా ఇవేం మాటలు అనుకున్న వాళ్ళకు.. ఇది ఆ 90 లక్షల ఓట్లకు వేస్తున్న గాలమని ఆ తర్వాత అర్థమైంది.
ఆయన ఆశించినట్టే ఇతర అంశాలు కూడా కలిసి వచ్చి అధికారంలోకి రాగానే ప్రచార సమయంలో తాను ప్రజలకు మాట ఇచ్చినట్టుగా సరసమైన ధరలకు నాణ్యమైన మద్యం కాకుండా ప్రభుత్వం అదుపులోనుండే మద్యం విక్రయాలను ఎత్తేశారు. మద్యం అసలైనదా, నకిలీదా అని తెలుసుకునే క్యూఆర్ కోడ్ ఎత్తేశారు. ప్రైవేటు మద్యం దుకాణాలకు తెరలేపారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలోకి వచ్చిన గత ఏడాదిన్నర కాలంలో 11 కోట్ల క్వార్టర్ బాటిళ్ల మద్యం అమ్మకాలు జరిగితే, అందులో 48 కోట్ల క్వార్టర్ బాటిళ్లు దాదాపు 5,280 కోట్ల రూపాయల విలువచేసే మద్యం అనధికారిక ఉత్పత్తి, సరఫరా జరిగిందని కడప లోకసభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి ప్రకటించారు. దానిమీద ప్రభుత్వంనుంచి ఈనాటివరకు ఎటువంటి వివరణ లేదు. మరో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్ చేసినట్టు ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న మద్యం విక్రయాలకు సంబంధించి, వాటిలో కల్తీ జరిగిన విషయంపైన, ఆ కల్తీ మద్యం తాగడం వల్ల మరణాలు కూడా సంభవించాయన్న వార్తలపైన నిజనిర్ధారణకు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసి నిజానిజాలను తేలిస్తే బాగుంటుంది.
పలు జిల్లాల్లో యథేచ్ఛగా కల్తీ మద్యం విక్రయాలు జరుగుతున్నాయని, దీనివల్ల ప్రజారోగ్యానికి నష్టం కలగడమే కాకుండా రాష్ట్ర ఖజానాకు కూడా గండిపడుతున్నదని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలమీద ప్రభుత్వం నిగ్గుతేల్చితే మంచిది. మద్యం కల్తీ జరిగిందా లేదా అనేది నిర్ధారించుకోవడానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీలు లేకుండా క్యూఆర్ కోడ్‌ను ఎత్తివేశారు. గత కొద్దిరోజులుగా దీనిమీద ఇంత రభస జరిగాక ఇప్పుడు ఎక్సైజ్ శాఖ అప్రమత్తమై క్యూఆర్ కోడ్ పద్ధతిని మళ్ళీ ప్రవేశపెట్టినట్టు తెలుస్తున్నది. ఈలోగా జరగాల్సిన నష్టం జరిగేపోయింది. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో మద్యం విక్రయాల విలువ భారీగా తగ్గింది. సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా ఏటా గత సంవత్సరంతో పోలిస్తే ఓ పదిశాతం వరకు ఎక్సైజ్ రాబడి పెరుగుతూ ఉంటుంది. పశ్చిమగోదావరిలో గత ఏడాదికన్నా ఈ ఏడాది విక్రయాల విలువ నాలుగు శాతం తగ్గగా శ్రీకాకుళం, వైయస్సార్ కడప, కృష్ణ, విజయనగరం జిల్లాల్లో విక్రయాల విలువ ఒక శాతం కూడా పెరగలేదు. నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో మూడు శాతం మాత్రమే పెరిగింది. మన్యం, తిరుపతి, బాపట్ల జిల్లాల్లో నాలుగు శాతం మాత్రమే పెరిగినట్టు అందుబాటులో ఉన్న లెక్కలు చెబుతున్నాయి. దీనికి కారణం కల్తీ మద్యం విక్రయాలన్నది స్పష్టం.
ఇటీవల ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో కూడా ఈ కల్తీ మద్యం మీద చర్చ జరగడం, నివారణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఎక్సైజ్ శాఖ సూచించడం ఆంధ్రప్రదేశ్ లో మద్యానికి సంబంధించిన ఆందోళనకర పరిస్థితులకు అద్దం పడుతున్నది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి బెయిల్ విషయంలో విచారణ సందర్భంగా ఎసిబి ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పులో పే ర్కొన్నట్టు రాజకీయ నేతల మీద కేసులు ఉండటంలో ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే రాజకీయాల్లో ఎల్లవేళలా ప్రత్యర్థి అనేవారు ఉంటారు. అయితే ప్రత్యర్థులు మాట్లాడే మాటలను, చేసే విమర్శలను, తమ దృష్టికి తీసుకువచ్చే అంశాలను ప్రజాక్షేమం దృష్టిలో పెట్టుకొని పట్టించుకుని అవసరమయిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలది.