ఇటీవల సామాజిక న్యాయంపైన తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరుగుతున్నది. ఇప్పుడు ఇది బిసి రిజర్వేషన్లతో ముడిపడిన అంశంగా మారింది. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్‌లో స్పష్టం చేసింది. దీని కనుగుణంగా 42% విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లును అసెంబ్లీలో తీర్మానించి గవర్నర్ ఆమోదానికి పంపారు. ఇది రాష్ట్రపతి దగ్గర పెండింగ్‌లో ఉండడంతో ప్రత్యేకంగా జిఒ తీసుకువచ్చారు. ఈ జిఒను ఇటీవల కొందరు కోర్టులో సవాల్ చేశారు. 42 శాతం బిసి రిజర్వేషన్ జిఒపై హైకోర్టు స్టే విధించింది. మరోవైపు సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ అంశం కాంగ్రెస్ పార్టీకి సవాల్‌గా నిలువగా, మిగతా రాజకీయ పార్టీలు సైతం మొసలికన్నీరు కారుస్తున్నాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లు అయినప్పటికీ బిసిలు ఇంకా తమకు దక్కాల్సిన న్యాయం కోసం పోరాడాల్సిన పరిస్థితి ఉందని బిసి సంఘాలు ఆరోపిస్తున్నాయి. రాజ్యాంగం కల్పించిన హక్కులు సంపూర్ణంగా దక్కడం లేదని, బిసిల జనాభాకు అనుగుణంగా వారికి రిజర్వేషన్లు లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది.
దీంతో అగ్రకులాలు అదనపు హక్కుల పొందుతుండగా, బిసిలు హక్కులు కోల్పోతున్నారు. ఇంకా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయ వివక్ష అనుభవిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో డా. బిఆర్ అంబేద్కర్ సోషల్ సైన్స్ యూనివర్శిటీ వారు 2023లో చేసిన ఒక అంతర్గత సర్వే ఒబిసిల కుల వివక్ష ఏ స్థాయిలో ఉన్నదో స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల గ్రామీణ కుటుంబాలను సర్వే చేశారు. ఇందులో 5.578 ఒబిసిల కుటుంబాలు (దాదాపు 56%)ఇండ్లవద్ద నుంచి అగ్రకులాలు వెళ్తుంటే మంచంలో నుంచి లేచి నిలబడుతున్నారని పేర్కొన్నది. 3,763 కుటుంబాలతో కలిసి భోజనం చేసేందుకు ఇతర కులాల వాళ్లు అంగీకరించరని వివరించింది. కులాన్ని కారణంగా చూపుతూ 3,238 మంది ఒబిసిల ఇంటికి పూజలు చేసేందుకు పూజారులురాకుండా అస్పృశ్యత పాటిస్తున్నారని వివరించింది.
సమాన అవకాశాలు, సామాజిక న్యాయం, రాజకీయ సాధికారతే దీనికి పరిష్కారం. ఈ క్రమంలో కులగణన, రిజర్వేషన్ల పెంపు వంటి అంశాలు చర్చకు వస్తున్నాయి. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే 75 వసంతాలు పూర్తయినప్పటికీ అటు దేశంలో ఇటు రాష్ట్రంలో ప్రతి పార్టీకి కూడా వెనకబడిన వర్గాలకు సమాన అవకాశాలు కల్పినలో చిత్తశుద్ధి లేదు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రజల్లో అలజడి సృష్టిస్తున్నారు. ఇప్పుడు బిసి రిజర్వేషన్ అంశం కూడా దీనికి నిదర్శనమే. కోర్టులు బిసి రిజర్వేషన్‌పై ఆంక్షలు విధించడంతో తెలంగాణలో అక్టోబర్ 18న బిసి రిజర్వేషన్ సాధనకు బిసి సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్యర్యంలో బంద్ ప్రకటించారు. దీనికి మూడు ప్రధాన రాజకీయ పార్టీలైన బిజెపి, బిఆర్‌ఎస్, కాంగ్రెస్ బంద్‌కు మద్దతు పలికాయి. బిసిలకు రిజర్వేషన్ విషయంలో పార్టీల బంద్ ఎవరిపైన? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
బిసి ఐకాస బంద్‌కు బిఆర్‌ఎస్ పూర్తిగా మద్దతు ప్రకటించింది. ఆ పార్టీ బిసి రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధి లేదని ఆరోపిస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కూడా రాష్ట్రంలో బిసి రిజర్వేషన్ల సాధనకై బంద్‌కు మద్దతిచ్చింది. బిసి ఐకాస కలిసి పని చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఈ అంశంలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని బిజెపి విమర్శిస్తోంది. ఇక చివరగా కాంగ్రెస్ పార్టీ కూడా ఈ బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించినది.ఈ సందర్భంగా కాంగ్రెస్ బిసి రిజర్వేషన్లు బిజెపి బిఆర్‌ఎస్ మధ్య ఉన్న లోపాయికారి ఒప్పందం వల్ల్లే నిలిచిపోయిందని ఆరోపించింది. మొత్తంగా కాంగ్రెస్, బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీలు పరస్పర విమర్శలతో బిసిల హక్కుల పేరుతో రాజకీయ ఆరోపణల యుద్ధరంగంగా మారింది. అసలు బిసి రిజర్వేషన్‌కు చట్టపరమైన పరిష్కారం చూపకుండానే బంద్‌కు మద్దతు ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటి? పొలిటికల్ మైలేజ్ కోసం రాజకీయ పార్టీల ప్రయాణం సాగుతుందని అనిపిస్తుంది.
చిత్తశుద్ధి కనబడడం లేదు. రిజర్వేషన్ విషయంలో భారత రాజ్యాంగంలో ఆంక్షలు విధించలేదు. కోర్టుల ద్వారా 50% పరిమితిని విధించారు. ప్రజలచే ఎన్నుకోబడిన పాలకులు తలుచుకుంటే ఈ పరిమితిని తొలగించలేమా? అసలు అడ్డుకునేది ఎవరు? న్యాయ స్థానాలా? న్యాయ బద్ధత లేని విధానాలా? ఆలోచన చేయాలి. 1980 సంవత్సరంలో మండల్ కమిషన్ ఒబిసిలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేసింది. వీటి అమలుకై ఢిల్లీ బోట్స్ క్లబ్ ముందు 48 రోజుల పాటు ధర్నా చేశాడు. కాన్షీరాం బిసి రిజర్వేషన్ ఉద్యమం దేశంలో విప్లవానికి కారణమైనది. విప్లవం అంటే రేషన్ కార్డు, పెన్షన్ కోసం వంటి సంక్షేమ పథకాల కోసం ఉద్యమాలు, ధర్నాలు చేయడం కాదు.
వేల సంవత్సరాల నుంచి దోపిడీ చేస్తున్న అగ్రకులాలు మాకు న్యాయం కావాలని రోడ్లపైకి రావడమే విప్లవం. ఇదీ భారతదేశ చరిత్రలో రెండు సందర్భాల్లో జరిగింది. మొదటిది రాజ్యాంగం అమలైన తరువాత, అగ్రకులాలు అదనపు హక్కులు కోల్పోతున్నామని ఎన్‌డి తివారి నాయకత్వంలో వేల సంఖ్యలో రోడ్లపైకి వచ్చి రాజ్యాంగాన్ని కాల్చి ధర్నా చేశారు. రెండోది 1990లో మండల్ కమిషన్‌కు వ్యతిరేకంగా రోడ్లపైన ధర్నా చేస్తూ న్యాయాన్ని అభ్యర్థించారు. ఇలాంటి అనివార్యతను సృష్టించిన అధినాయకుడు కాన్షీరాం. ఇప్పుడు మనం కూడా ఆ సందర్భాలు సృష్టించి బిసి రిజర్వేషన్ల సాధనలో విప్లవం సృష్టించాలి. ఆ దిశగా ప్రయత్నాలు జరగాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో ఉమ్మడి ఎపి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య, రిటైర్డ్ ఐఎఎస్ చిరంజీవులు, బాలరాజుగౌడ్, బిసి, ఎస్‌సి, ఎస్‌టి జెఎసి రాష్ట్ర కన్వీనర్ విశారదన్ మహారాజు నాయకత్వంలో బిసి రిజర్వేషన్ల సాధన సమితి ఏర్పాటు అయ్యింది. ఈ సమితి బిసి కేటగిరీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని, తమిళనాడు తరహాలో వాటిని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నది. ఇది బిసి రిజర్వేషన్లకు శాస్త్రీయ పరిష్కారంగా నిలుస్తున్నాయి. ఈ రిజర్వేషన్లను విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అమలు చేయాలని పటిష్టమైన ఉద్యమం చేపడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని ఇతర బిసి సంఘాలు వీరికి తోడైతే బిసిలకు సామాజిక న్యాయం దక్కుతుంది.
సంపతి రమేష్ మహారాజ్
79895 79428