హైదరాబాద్: బిసి రిజర్వేషన్ల విషయంలో ఇదే చిత్తశుద్ధితో కేంద్రం వరకు వెళ్దామని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లను అన్ని పార్టీలు అంగీకరించాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం బిసి ఐకాస నిర్వహించిన ధర్నాలో మహేశ్‌కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిసి సంఘాల బంద్‌కు అన్ని వర్గాల నుంచి మద్ధతు లభిస్తుందని అన్నారు. ఈ బంద్‌కు ఇతర పార్టీల మద్ధతును స్వాగతిస్తున్నామని తెలిపారు. బిసి రిజర్వేషన్లను తమిళనాడులో అడ్డుకోనప్పుడు తెలంగాణలో అడ్డుకోవడం న్యాయమా? అని ప్రశ్నించారు. బిసి రిజర్వేషన్ల అంశం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉందని ప్రజలకు తెలుసని అన్నారు. కేంద్రం తలుచుకుంటే ఒక్కరోజులో చట్టరూపం దాల్చుతుందని పేర్కొన్నారు. సంపూర్ణ బంద్ వల్ల ప్రధానికి కనువిప్పు కలుగుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా బిసి రిజర్వేషన్ల అంశాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.