హైదరాబాద్: బిసి రిజర్వేషన్లు అమలు కావని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలోనే చెప్పారని బిజెపి ఎంపి ఈటెల రాజేందర్ తెలిపారు. అన్నీ తెలిసి కూడా బిసిలను సిఎం రేవంత్ మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. 42% రిజర్వేషన్ల కోసం జూబ్లీ బస్ స్టేషన్ వద్ద ఎంపి ఈటెల రాజేందర్, బిజెపి శ్రేణులతో కలిసి తెలంగాణ బంద్ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఈటెల మీడియాతో మాట్లాడారు. బిసిలు 52 శాతం ఉంటే 42 శాతమని కాకి లెక్కలు చెబుతున్నారని బిజెపి ఎంపి ఈటెల రాజేందర్ విమర్శలు గుప్పించారు. తాను చెప్పేది అబద్ధమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. తాను మాట్లాడిన మాటలపై ఎక్కడైన చర్చకు సిద్ధంగా ఉన్నామని, బిసిలు యాచించే స్థాయిలో కాదు శాసించే స్థాయిలో ఉన్నారన్నారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నంత కాలం ఆ కుటుంబాలకే అధికారం ఉంటుందని ఈటెల ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయినా ఒక్క బిసి సిఎం కాలేకపోయారని, బిజెపి నిజాయితీ ఎవరూ శంకించలేదని, స్థానిక సంస్థల్లోనే కాదు చట్టసభల్లోనూ రిజర్వేషన్లు వచ్చే వరకు పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు. తమిళనాడు రాష్ట్రం ఒక్కటే నిజాయితీగా రిజర్వేషన్లు అమలు చేసిందని, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ బిసి కమిషన్ వేసినా నిజాయితీ లేకపోవడంతో అమలు కాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బిసి పేరుతో కమిషన్లు వేసినా నిజాయితీ లేకపోవడంతో అమలు కావడంలేదన్నారు.