సీనియర్ స్టార్ అక్కినేని నాగార్జున ఇంట ఇటీవల కాలంలో రెండు పెళ్లిళ్లు జరిగాయి. నాగార్జున ఇద్దరు కుమారులు నాగచైతన్య, అఖిల్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. 2024లో హీరోయిన్ శోభిత దూళిపాళను చైతన్య వివాహం చేసుకోగా… ఈ ఏడాదే ముంబైకి చెందిన వ్యాపారవేత్త జైనబ్ రివ్జీను అఖిల్ పెళ్లాడారు. దీంతో కొత్త కోడళ్ల రాకతో అక్కినేని వారి ఇల్లు కళకళలాడుతోంది. ఈ నేపథ్యంలో కోడళ్లతో తన అనుబంధం గురించి నాగార్జున సతీమణి అమల మాట్లాడుతూ తమ ఇంటికి కోడళ్లు శోభిత, జైనబ్ రావడంతో తనకు గర్ల్ సర్కిల్ ఏర్పడిందని అన్నారు. వాళ్లు ఎప్పుడూ ఆనందంగా కనిపిస్తారని, వాళ్ల వల్లే జీవితం సరికొత్తగా మారిందని చెప్పారు. కోడళ్లతో ఉన్నప్పుడు భలే సరదాగా ఉంటుందని, ఇక వాళ్ల వ్యక్తిగత విషయాల్లో తాను తలదూర్చనని తెలిపారు. అలాగే ఇంట్లో వాళ్లకు ఎంతో స్వేచ్ఛ ఉంటుందని, కోడళ్లు తాను చెప్పినట్టే ఉండాలన్న పట్టింపులేమీ తనకు లేవని అమల చెప్పారు. వాళ్లు తమ తమ రంగాల్లో రాణిస్తూ బిజీగా ఉండడం వల్ల తనకు ప్రత్యేకంగా సమయం కేటాయించాలని కోరుకోనని తెలిపారు.