హైదరాబాద్: అద్దెకు వచ్చిన వారి బాత్రూమ్ లోని బల్బ్ హోల్డర్‌లో యజమాని సీక్రెట్ కెమెరా పెట్టి వీడియో రికార్డు చేసిన సంఘటన హైదరాబాద్ లోని అమీర్ పేట వెంగళ్ రావు నగర్ లో జరిగింది. అద్దెదారులు ఫిర్యాదు మేరకు ఇంటి యజమానితో పాటు ఎలక్ట్రీషియన్‌పై కేసు నమోదు చేసి ఒకరిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జవహర్ నగర్‌లోని అశోక్ యాదవ్‌కు చెందిన ఇంటిని దంపతులు అద్దె తీసుకొని ఉంటున్నారు. భార్యభర్తలు ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తున్నారు. ఈ నెల 4న బాత్రూమ్‌లోని విద్యుత్ బల్బ్ పనిచేయడం లేదని ఇంటి యజమాని అశోక్ యాదవ్‌కు వివాహిత చెప్పింది. అతను ఎలక్ట్రీషియన్ ద్వారా బల్బ్ రిపేర్ చేయించాడు. ఈ నెల 13న బాత్రూమ్‌లోని బల్బ్ హోల్డర్ నుండి స్క్రూ పడిపోవడంతో ఆమె భర్త గమనించి దానిని పరిశీలించాడు. అయితే లోపల లైట్ వేసి చూసినప్పుడు, హోల్డర్ లోపల కెమెరా ఉందని అతడు గుర్తించాడు. కంగుతిని అతడు వెంటనే ఇంటి యజమాని అశోక్ యాదవ్‌కు భర్త చెప్పాడు.
దీంతో ఎలక్ట్రీషియన్ ఈ పని చేసి ఉంటాడని అతన్ని అడగమని యజమానిని దంపతులు కోరారు. కానీ దానికి నిరాకరించడంతో కేసు పెడితే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మీకు హాని చేస్తాడని యజమాని వారిని బెదిరించాడు. దీంతో ఎలక్ట్రీషియన్, ఇంటి యజమానిపై అనుమానం రావడంతో పోలీసులకు దంపతులు ఫిర్యాదు చేశారు. ఇంటి యజమాని అశోక్ యాదవ్‌ను అరెస్టు చేయడంతో పాటు పరారీలో ఉన్న ఎలక్ట్రీషియన్ చింటు కోసం పోలీసులు గాలిస్తున్నారు. వెంగళ్ రావ్‌నగర్‌లో బాత్రూమ్ బల్బ్ హోల్డర్‌లో సీక్రెట్ కెమెరా అమర్చి, వివాహిత స్నానం చేస్తున్న దృశ్యాలను ఇంటి యజమాని రికార్డ్ చేసినట్టు సమాచారం. మా ఆయనకు ఏమైనా అయితే దంపతులను వదిలిపెట్టనని యజమాని భార్య వారిని బెదిరించింది. బాత్రూమ్ లో కెమెరా పెట్టడమే కాకుండా కిరాయికి ఉన్నవారిని యజమాని భార్య బెదిరిస్తుంది.