లండన్‌లో కుమారుడికి రోడ్డు ప్రమాదం జరిగిందని వృద్ధురాలిని బెదిరించి రూ.35.23లక్షలు సైబర్ నేరస్థులు దోచుకున్నారు. ఈ సంఘటన హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…హైదరాబాద్‌కు చెందిన వృద్ధురాలు(61)కి వాట్సాప్ కాల్ వచ్చింది. బాధిత మహిళ కుమారుడు లండన్‌లో ఉంటున్నాడు. ఫోన్ చేసిన వ్యక్తి తాను డాక్టర్ స్టీవ్ రోడ్రీగుజ్ మాట్లాడుతున్నానని చెప్పాడు. సౌత్ మాంచెస్టర్ జనరల్ ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్నానని చెప్పాడు. మహిళ కుమారుడికి రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పాడు. తలకు తీవ్రగాయాలయ్యాయని, లగేజీ మిస్సయ్యిందని తెలిపాడు.
ఆస్పత్రిలో అధికారికంగా చేర్చలేదని, అనదికారికంగా చేర్చామని చికిత్స కోసం వెంటనే డబ్బులు పంపించాలని చెప్పాడు. సైబర్ నేరస్థుడు చెప్పిన మాటలు నమ్మిన బాధితురాలు ఆగస్టు 8వ తేదీ నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు పలు మార్లు రూ.35,23,070 ట్రాన్ఫ్‌ర్ చేసింది. మళ్లీ డబ్బులు అడుగుతుండడంతో తన కుమారుడు చికిత్స పొందుతున్న ఫొటో చూపించాలని కోరింది. దానికి నిరాకరించిన సైబర్ నేరస్థులు బాధితురాలితో వాట్సాప్‌లో చేసిన ఛాటింగ్‌ను డిలీట్ చేశాడు . దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు హైదరాబాద్ సైబర్ నేరస్థులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.