అమరావతి: ప్రభుత్వ డిపోల నుంచి కాకుండా బయట్నుంచి పెద్ద ఎత్తున సరుకు తెచ్చి విక్రయిస్తున్నారని వైసిపి మాజీ మంత్రి పేర్నినాని తెలిపారు. ఎపి సిఎం చంద్రబాబు నాయుడుపై పేర్నినాని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బార్లలో జరుగుతున్న అవినీతిని బయట పెట్టే దమ్ముందా? అని ప్రశ్నించారు. నెలకు రూ. 5 కోట్లు దండుకుని బార్లలో పెద్ద ఎత్తున స్కాం చేస్తున్నారని విమర్శించారు. నెలకు రూ. 5 కోట్లు లంచాల కింద వసూలు చేస్తున్నారని, ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తోంది? అని నిలదీశారు.
చంద్రబాబుకు దమ్ముంటే బార్లలో తనిఖీలు చేసేందుకు రాగలరా? అని ప్రశ్నించారు. బార్లలో విక్రయించే మద్యం ఎక్కడిదో లెక్క తేల్చేందుకు.. ఎల్లోమీడియా, రాజకీయ పార్టీల సమక్షంలో తాము సిద్ధమని పేర్నినాని సవాల్ విసిరారు. నకిలి మద్యంపై డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదు? అని అన్నారు. 16 నెలలుగా రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో లక్షన్నర బెల్టు షాపులు ఉన్నాయని బెల్టు షాపులు ఉన్నట్లు చంద్రబాబే ఒప్పుకున్నారని, నకిలీ మద్యం కేసులో మిగతా వారిని ఎందుకు అరెస్టు చేయలేదు? అని పేర్నినాని ప్రశ్నించారు.
రేపోమాపో జయచంద్రా రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తేస్తారని, జయచంద్రారెడ్డి, జనార్ధన్, సురేంద్ర ఫోన్లను ఎందుకు సీజ్ చేయలేదని, సంబంధం లేని జోగి రమేష్ ఫోన్లను ఎందుకు సీజ్ చేశారని పేర్నినాని ఆగ్రహం వ్యకం చేశారు.