సిద్దిపేట జిల్లా, ములుగు తహసీల్దార్ కార్యాలయం వద్ద గల రాజీవ్ రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజీవ్ రహదారి డివైడర్‌పై గడ్డి కటింగ్ చేస్తున్న ఇద్దరు కార్మికులను ఆర్‌టిసి గరుడ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో ములుగు మండలం, కమలాబాద్‌కి చెందిన బోయిని సాయిలు (65), మర్కుక్ మండలం, పాములపర్తికి చెందిన లెంకల రాజమల్లు (55) అనే ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు. కార్మికులను ఢీకొన్న బస్ గోదావరిఖని డిపోకు చెందినదిగా తెలిసింది. హైదరాబాద్ వైపు నుంచి గోదావరిఖనికి బస్సు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. డ్రైవర్ అతివేగంగా బస్ ను నడపడం ఈ ప్రమాదానికి కారణంగా తెలిసింది. ఘటనా స్థలానికి చురుకున్న పోలీసులు మృతదేహాలను గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపడతున్నారు.