కొలంబో: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా శుక్రవారం జరిగే మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంకతో సౌతాఫ్రికా తలపడనుంది. వరుస విజయాలతో జోరుమీదున్న దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సెమీస్ అవకాశాలను మరింత మెరుగు పరుచుకోవాలనే పట్టుదలతో ఉంది. లంకతో పోల్చితే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సౌతాఫ్రికా చాలా బలంగా ఉంది.
ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి జోరుమీదుంది. శ్రీలంకపై కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే లక్షంతో పోరుకు సిద్ధమైంది. కెప్టెన్ లౌరా వాల్‌వర్డ్, సూనె లూస్, మరిజానె కాప్, ట్రియన, డి క్లార్క్ వంటి మ్యాచ్ విన్నర్‌లు జట్టులో ఉన్నారు. ఈ సీజన్‌లో సౌతాఫ్రికా ఇప్పటికే న్యూజిలాండ్, భారత్ వంటి బలమైన జట్లను చిత్తుగా ఓడించింది.
అంతేగాక బంగ్లాదేశ్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో కూడా జయకేతనం ఎగుర వేసింది. మూడు మ్యాచుల్లో వరుస విజయాలు సాధించడంతో సఫారీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఇక శ్రీలంక ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడి ఒక్క విజయం కూడా సాధించలేదు. రెండు మ్యాచుల్లో ఓటమి పాలు కాగా, మరో రెండు పోటీలు వర్షం వల్ల అర్ధాంతరంగా రద్దయ్యాయి.