ఇటీవలే ఆసియాకప్ విజేతగా నిలిచిన భారత్… ఆస్ట్రేలియా గడ్డపై ఆసీస్‌తో తలపడేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ సిరీస్‌లో దాదాపు 7 నెలల గ్యాప్ తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు మళ్లీ బ్యాట్ పట్టనున్నారు. దీంతో ఈ సిరీస్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఈ ఇద్దరు స్టార్లు.. 2027 ప్రపంచకప్ వరకూ జట్టులో కొనసాగాలని అంతా కోరుకుంటున్నారు. ఈ విషయంపై చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తాజాగా స్పందించారు. ప్రపంచకప్‌కి ఇంకా చాలా సమయం ఉందని.. ఇప్పుడే దాని గురించి ఆలోచించేది లేదని ఆయన అన్నారు.
‘‘ప్రస్తుతం భారత్.. ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఈ టీంలో రోహిత్, విరాట్ సభ్యులు. వారిద్దరూ అద్భుత ఆటగాళ్లను చాలాసార్లు చెప్పాను. జట్టుకు ఏది ముఖ్యమో అదే చేస్తాం. వన్డే ప్రపంచకప్‌కి ఇంకా రెండు సంవత్సరాల టైం ఉంది. అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేము. ఇది కేవలం వారిద్దరి విషయంలోనే కాదు.. కుర్రాళ్లకు వర్తిస్తుంది. ఇప్పటికే పరుగుల పరంగానే కాకుండా చాలా ట్రోఫీలు గెలిచిన చరిత్ర వారిద్దరికి ఉంది. ఒక్క సిరీస్‌లో పరుగులు చేయనంత మాత్రాన పక్కన పెట్టేది లేదు. అలా అని భారీగా రన్స్ చేసినా వరల్డ్ కప్ గురించి ఇప్పుడే ఆలోచించేది లేదు. మాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి’’ అని అగార్కర్ అన్నారు.