కాంగ్రెస్ సీనియర్ నాయకుడి పి. చిదంబరం పెద్ద సాహసమే చేసారు. ‘ఆపరేషన్ బ్లూస్టార్’ తప్పు నిర్ణయమని, ఆ కారణంగా అప్పటి ప్రధాని మంత్రి ఇందిరాగాంధి తన ప్రాణాలను కోల్పోయారని అన్నారు. ఆయన ఆ మాటలు పరోక్షంగానో, నర్మగర్భంగానో కాదు, సూటిగానే చెప్పారు. ఆ మాటలు సహజంగానే సంచలనంగా మారాయి. కాంగ్రెస్ పార్టీకి ఆగ్రహం తెప్పించాయి. వారు తనపై విమర్శలు చేసారు. కాని, అంత తీవ్రమైన వ్యాఖ్యలు సాక్షాత్తూ ఇందిరపై చేసినా, తర్వాత మూడు రోజులలోనూ ఈ వ్యాసం రాసే సమయానికి తనపై ఎటువంటి చర్య తీసుకోకపోవటం గమనించదగ్గది. చిదంబరం లోగడ కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర హోంమంత్రిగా కూడా పని చేసిన నాయకుడు. మేధావి గానూ గుర్తింపు ఉన్నది. అందువల్ల ఆయన వ్యాఖ్యలను తేలికగా తీసుకోలేము. ఆయన ఈ నెల 12న, పంజాబ్‌కు పొరుగున గల హిమాచల్‌ప్రదేశ్ పట్టణం కసౌలీలో ఒక సాహిత్య కార్యక్రమంలో పాల్గొంటూ, అమృతసర్‌లోని స్వర్ణ దేవాలయం నుంచి సిక్కు తీవ్రవాదులను బయటకు రప్పించేందుకు, ఆ దేవాలయ ప్రాంగణాన్ని స్వాధీన పరచుకునేందుకు ఇతర మార్గాలు ఉండేవని, అందుకు బదులు సైనిక చర్యను చేపట్టడం తప్పు నిర్ణయమని అన్నారు. సైనిక చర్య జరిగింది 1984 జూన్ మొదటి వారంలో కాగా, అదే సంవత్సరం అక్టోబర్ 31న, ఇందిరాగాంధిని ఆమె అంగరక్షకులు అయిన ఇద్దరు సిక్కు జవాన్లు తన అధికారిక నివాసంలోనే కాల్చి హత్య చేసారు.
సైనిక చర్యకు ముందు కాలంలో, అట్లానే ఇందిరాగాంధి హత్య అనంతర కాలంలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. పంజాబ్ రాష్ట్రం, దేశ రాజధాని ఢిల్లీ మాత్రమే గాక, ముఖ్యంగా ఉత్తర భారతమంతా అల్లకల్లోమైంది. అనేక రాజకీయ పరిణామాలు సంభవించాయి. తదనంతర దాడులలో, అల్లర్లలో వేలాదిమంది పౌరులు, యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఖలిస్థానీ వేర్పాటు ఉద్యమం చాలా కాలం పాటు తీవ్రంగా సాగింది. అదంతా పాకిస్థాన్‌కు గొప్ప అవకాశంగా లభించింది. మొత్తం ప్రపంచంలోని సిక్కులకే గాక, సిక్కు మత గురువులను అమితంగా ఆరాధించే అసంఖ్యాకులైన హిందువులకు కూడా స్వర్ణ దేవాలయంపై సైనిక చర్య, తదనంతర ‘ఆపరేషను’ పెద్ద మానసికి గాయాన్నే చేసాయి. అప్పటి నుంచి 40 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా పంజాబ్ లోనే గాక, పంజాబీలు పెద్ద సంఖ్యలో నివసించే బ్రిటన్, కెనడా వంటి ఇతర దేశాలలోనూ ఆపరేషన్ బ్లూస్టార్ ప్రభావపు ఛాయలు మిగిలి ఉన్నాయంటే, ఆ తీవ్రతను అర్థం చేసుకోవటం కష్టం కాదు. ఇక్కడ గుర్తించవలసింది ఏమంటే, యథాతథంగా సిక్కు తీవ్రవాదంపై, వేర్పాటువాదులపై మాత్రమే చర్య జరిగి ఉంటే, అది ఎంత కఠినమైనది అయినప్పటికీ ఆ తర్వాత ప్రభావాలు, పరిణామాలు ఈ విధంగా ఉండేవి కావు. కాంగ్రెస్ నాయకుడు చిదంబరం ఈ విధంగా మాట్లాడవలసిన పరిస్థితి ఉండేది కాదు. ఇంకా అనుకోవాలంటే, బహుశా ఇందిరాగాంధీపై ఆ దాడి కూడా జరిగేది కాదేమో. దీనంతటికి మూలం స్వర్ణ దేవాలయం వంటి వందల ఏళ్ల అత్యంత పవిత్ర కేంద్రంపై సైనిక దాడిలో, తీవ్రవాదులను కాల్చటం అట్లుంచి ఆ నిర్మాణాలకు సైతం నష్టం కలిగించటంలో ఉంది.
వాస్తవానికి ఇదంతా అప్పటి ఆలోచనాపరులు ముందుగా ఊహించలేనటువంటి దేమీ కాదు. స్వర్ణ దేవాలయ చరిత్ర, పవిత్రత మాత్రమే గాక, మొఘలుల ఆక్రమణ కాలం నుంచి స్థానికుల మహా వీరోచిత ప్రతిఘటనా యుద్ధాలు, సిక్కు మతం పుట్టుక, ఆ మతస్థుల నిబద్ధతలు, గురువుల పట్ల సంపూర్ణ విధేయతల చరిత్ర తెలిసిన వారందరూ ఊహించగలదే. బయట అత్యధికులకు తెలియనిది ఏమంటే, సిక్కు మత ఆవిర్భావానికి ముందు ఆ సరిహద్దు ప్రాంతాలన్నింటా ఉండిన హిందూ కుటుంబాలు, సిక్కు గురువుల పిలుపు మేరకు ఒక్కో కుటుంబం నుంచి ఒక్కో యువకుడిని ఆ మతంలోకి స్వచ్ఛందంగా, సంతోషంగా చేర్చారు. ఆ విధంగా ఎన్నెన్నో కుటుంబాలు హిందూ, సిక్కు మతాలతో కూడిన మిశ్రమ మత కుటుంబాలు అయాయి. బ్లూస్టార్ అనంతరం, ఖలిస్థానీ ఉద్యమం ఇంకా ఉధృతంగా సాగుతుండిన కాంలోనే, ఒక జర్నలిస్టుగా అక్కడి గ్రామాలలో పర్యటించిన నేను, వారి ఇళ్లలో గోడలపై గల కుటుంబపు ఫోటోలలో వారి కుటుంబ సభ్యులు హిందువులు, సిక్కులు కూడా ఉండిన చిత్రాలను చూసి ఆశ్చర్యపోయాను. ఆ విషయమై ప్రశ్నించిన నాకు వారిచ్చిన వివరణను బట్టి, అటువంటి మిశ్రమ మత కుటుంబ సంప్రదాయం గురించి ప్రత్యక్షంగా గమనించాను. ఇటువంటి స్థితి ప్రపంచ మతాలలో మరెక్కడైనా ఉందేమో తెలియదు.
విషయం ఏమంటే, చిదంబరం వివరించకపోవచ్చు గాని, ఆయన అసాధారణమైన వ్యాఖ్యలతో సంబంధం గల ఇటువంటి నేపథ్య విశేషాలు ఇంకా అనేకం ఉన్నాయి. వాటిలో కొన్నింటిని నా పర్యటన సమయంలో గ్రామాలు, చిన్న పట్టణాల సామాన్య ప్రజల నుంచి విన్నాను. చూసాను. ఆ విషయాలు ఎంతగా తెలియగలిగితే, ఆపరేషన్ బ్లూస్టార్ తప్పిదం మనకు అంతగా అర్థమవుతుంది. స్వర్ణ దేవాలయాన్ని ప్రభుత్వం స్వాధీన పరచుకునేందుకు సైనిక చర్యకు భిన్నంగా ఇతర పద్ధతులు ఉండెనని చిదంబరం ఒక మాట అన్నారు. ఆ పద్ధతులు ఏమిటో ఆయన వివరించలేదు. కాని ఆ విషయమై, ఆపరేషన్ అనంతరం కాలంలో జాతీయ స్థాయిలోకొన్ని చర్చలు జరిగాయి. యుద్ధ సమయాలలో కోటలను నెలల తరబడి దిగ్బంధించి అన్ని సరఫరాలను నిలిపి వేసిన పద్ధతులు, లోపలి మనుషులు స్పృహ కోల్పోయేట్లు రసాయనిక వాయువులను వదలటం వంటివి వాటిలో కొన్ని. కాని, ఎందువల్లనైతేనేమి ఇందిరాగాంధి ప్రత్యక్ష సైనిక చర్య పద్ధతిని ఎంచుకుని పెద్ద తప్పునే చేసారు. నేను అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని కర్ఫూ మధ్య లోపలకు ప్రవేశించి చూసినపుడు, యథాతథంగా దేవాలయానికి జరిగిని నష్టం లేదు గాని, ఆ చుట్టూ గల ఇతర నిర్మానాలన్నీ దెబ్బ తినటాన్ని గమనించాను. సైనిక చర్య గురించి అక్కడి గురుద్వారా ప్రబంధక్ కమిటీ సభ్యులు, ఇతరత్రా కనిపించిన కొద్ది మంది యువకులు, లంగర్‌లో భక్తులకు ఆహారం అందజేసే సిబ్బంది, తమ గొంతును పెంచకుండా, బరువైన మొహాలతో, చిన్నచిన్న మాటలుగా చెప్పినవి విన్నాను.
చిదంబరం అన్న ‘పెద్ద తప్పు’ ఎంతటి పెద్ద తప్పో అర్థం చేసుకోవటం ఎంతమాత్రం కష్టం కాదు. బ్లూస్టార్‌కు ముందు వెనుకల పరిణామాలను దృష్టిలోకి తీసుకున్నపుడు ఇది ఇంకా బాగా అర్థమవుతుంది. అవి పలుమార్లు చర్చకు వచ్చినవే. అయినా, సందర్భం ఏర్పడింది గనుక రెండు మాటలు క్లుప్తంగా చెప్పుకోవటం అవసరం. పంజాబ్ రాజకీయాలు మొదటి నుంచి అకాలీదళ్, కాంగ్రెస్‌ల చుట్టూ తిరుగుతుండేవి. అకాలీదళ్‌ను దెబ్బతీసేందుకు ఇందిరాగాంధీ, అప్పటి రాష్ట్రపతి జైల్‌సింగ్ సలహా ప్రకారం సిక్కులను చీల్చేందుకు సంత్ జర్నేల్ సింగ్ భిండ్రావాలేను ప్రోత్సహించి రాజకీయాలలోకి తెచ్చారు. అదే వ్యక్తి క్రమంగా సిక్కుల హక్కులు, పంజాబ్ హక్కుల పేర మిలిటెంట్‌గా మారి ఏకు మేకయ్యాడు. ఖలిస్థానీ వేర్పాటు ఉద్యమాన్ని మొదలుపెట్టాడు. ఇక తర్వాతి పరిణామాలు తెలిసినవే. బ్లూస్టార్ తప్పుకన్న ముందు కాలంలోనే ఇందిరాగాంధీ చేసిన ఒరిజినల్ తప్పు అది. ఇక బ్లూస్టార్ తర్వాత చేసిన తప్పు ఆపరేషన్ ఉడ్‌రోజ్. దీని గురించి బయటి దేశం విన్నది తక్కువ. దాని వల్ల కలిగిన హాని చాలా ఎక్కువ. అది నా పర్యటనలో విస్తారంగా విన్నవిషయం. ఈ కొత్త ఆపరేషన్ కింద భద్రతా బలగాలు పెద్ద ఎత్తున గ్రామాలను చుట్టుముట్టి యువకులను నిర్బంధించటం, హింసించటం సాగించాయి. తీవ్రవాదం అన్నది లేకుండా చేయాలన్నది ఉద్దేశం. కాని అందుకు విరుద్ధంగా జరిగింది. యువకులు భయపడి పాకిస్థాన్‌కు పారిపోవటం, అక్కడ కొద్ది రోజుల శిక్షణతో ఆయుధాలు, డబ్బుతీసుకుని రావటం, హింసా చర్యలకు పాల్పడటం మొదలైంది. ఇది పెద్ద ఎత్తున జరిగింది. సరిహద్దు జిల్లా లైన పఠాన్‌కోట్, గురుదాస్‌పూర్, అమృత్‌సర్, తరణ్ తారణ్, ఫిరోజ్‌పూర్‌లలోని పలు ప్రాంతాలలో పట్టు సంపాదించి వాటిని విముక్త ప్రాంతాలుగా ప్రకటించారు. అక్కడ కొన్ని చోట్లకు స్వయంగా వెళ్లిన నేను, భద్రతా బలగాల కదలికలు, నియంత్రణ ఎంత పరిమితంగా ఉండిందో గమనించాను.
చివరకు పరిస్థితిని అదుపు చేసేందుకు చాలా కాలం పట్టింది. ఇది బ్లూస్టార్‌కు ముందు, తర్వాతల పరిస్థితులు కాగా, ఇందిరాగాంధి హత్య అనంతరం ముఖ్యంగా ఢిల్లీతోపాటు పలు హిందీ రాష్ట్రాలలో జరిగిన సిక్కు వ్యతిరేక హింసాకాండ తెలిసిందే. అపుడు ఢిల్లీలో నివసిస్తుండిన నేను అటువంటి ఘటనలు అనేకం గమనించాను. ఆ విధంగా, చిదంబరం అన్న ‘పెద్దతప్పు’కు ముందు వెనుకలు చాలానే ఉన్నాయి. ఇవేవీ రహస్యం కాదు. చర్చలు జరగనివీ కాదు. చిదంబరం ఎందువల్ల ఇపుడీ ప్రస్తావన చేసారో తెలియదుగాని, అందుకు ఆయనను ఆక్షేపించిన వారికి కూడా అవి తెలిసిన విషయాలే. అందుకే కావచ్చు వారు విషయాన్ని అంతకన్న ముందుకు తీసుకుపోవటం లేదు. ఏ పార్టీ అయినా, ప్రభుత్వమైనా, జాతి అయినా, దేశమైనా ఇటువంటి అనుభవాల నుంచి పాఠాలు గ్రహించటం వల్ల భవిష్యత్తుకు ఉపయోగం ఉంటుంది. కాని దురదృష్టవశాత్తు ఇందిరాగాంధి వెంటనే ప్రధాన మంత్రి స్థానంలోకి వచ్చిన ఆమె కుమారుడు రాజీవ్‌గాంధీ ఏ పాఠాలూ నేర్వలేదు. ఆ వెనుక జరిగిన ఎన్నికలలో, ఒక మహావృక్షం కూలితే భూమి కంపించటం సహజమంటూ సిక్కు వ్యతిరేక హింసాకాండను బాహాటంగా సమర్థించారు. పత్రికల అడ్వర్టయిజ్‌మెంట్లు అంతే సమర్థనా పూర్వకంగా ఇచ్చారు. ఇవి కూడా నేను స్వయంగా విన్నవి, చూసినవి. ఈ ధోరణికి కొనసాగింపా అన్నట్లు, శ్రీలంక వివాదంలో పెద్ద మనిషి మధ్యవర్తి త్వానికి పరిమితం కావటానికి బదులు ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ (ఐపికెఎఫ్) పేరిట సైన్యాన్ని పంపగా, ఆ దళాలు ప్రత్యక్ష చర్యలలో పాల్గొన్నాయి. అది చివరకు రాజీవ్‌కు ప్రాణాంతకమైంది. ఇటువంటి తప్పులు ఇంకా ఉన్నాయి గాని ఆ చర్చకు ఇది సందర్భం కాదు.
టంకశాల అశోక్