మలయాళీ బ్యూటీ సంయుక్త మీనన్ టాలీవుడ్‌లో దాదాపు అర డజను సినిమాలతో బిజీ బిజీగా ఉంది. ఈ భామ 2023లో డెవిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత ఏడాది లవ్ మీ సినిమాలో నటించినప్పటికీ అది ప్రత్యేక పాత్రలో మాత్రమే. అంటే దాదాపు రెండేళ్లుగా సంయుక్త మీనన్ నటించిన సినిమాలు రాలేదని చెప్పాలి. ఆ గ్యాప్‌ను బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సంయుక్త మీనన్ భర్తీ చేసే విధంగా వరుసగా సినిమాలకు కమిట్ అయింది. ప్రస్తుతం ఈమె చేతిలో అఖండ 2, స్వయంభూ సినిమాలు ఉన్నాయి. ఇవి కాకుండా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న సినిమాను కూడా సంయుక్త చేస్తోంది.
అయితే సంయుక్త మీనన్ తెలుగులో కొత్తగా యోగి దర్శకత్వంలో ఒక సినిమాకు ఓకే చెప్పింది. చాలా ఏళ్ల క్రితం వెంకటేష్ హీరోగా వచ్చిన చింతకాయల రవి సినిమాకు దర్శకత్వం వహించిన యోగి మళ్లీ ఇన్నాళ్లకు ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా సంయుక్త మీనన్ నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అయిందని, దాదాపుగా సగం షూటింగ్ పూర్తి అయిందని తెలిసింది. కానీ ఇప్పటి వరకు మేకర్స్ నుంచి అధికారికంగా ప్రకటన రాలేదు.
తాజాగా ఈ సినిమాకు బ్లాక్ గోల్డ్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. టైటిల్‌కి తగ్గట్లుగా ఈ సినిమా కథాంశం ఉంటుందట. ఈ సినిమాలో సంయుక్త మీనన్ చాలా విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలిసింది. ఆమె ఇప్పటి వరకు పోషించిన పాత్రలతో పోల్చితే ఈ సినిమాలోని పాత్ర చాలా విభిన్నంగా, వైవిధ్యభరితంగా ఉంటుందని అంటున్నారు. పైగా సంయుక్త మీనన్ గతంలో ఎప్పుడూ లేని విధంగా చాలా బలమైన పాత్రలో కనిపించబోతుందట. బ్లాక్ గోల్డ్ సినిమా వచ్చే ఏడాది వేసవిలో లేదా అంతకంటే ముందే వచ్చే అవకాశాలు ఉన్నాయి.