రాష్ట్రంలో మాఫియా డాన్లు మంత్రులు అయ్యారని బిఆర్‌ఎస్ సీనియర్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కమీషన్ పంపకాల్లో తేడా రావటం వల్లనే మంత్రుల మధ్య కొట్లాటలు జరుగుతున్నాయని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో గురువారం బిఆర్‌ఎస్ నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ, సామాన్యుడికో న్యాయం మంత్రులకు ఓ న్యాయమా..? అని ప్రశ్నించారు. తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎసిబి ఆఫీస్ నుంచి తెలంగాణ భవన్ నడుచుకుంటూ వస్తే పోలీసులు కేసు పెట్టారని, తమ పార్టీ నేత క్రిశాంక్ సోషల్ మీడియాలో పోస్టు పెడితే పది కేసులు పెట్టారని మండిపడ్డారు. మంత్రికి సంబందించిన మనిషిపై కనీసం ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయలేదని ఆరోపించారు. డెక్కన్ సిమెంట్ వారిని బెదిరించిన సిఎం సన్నిహితుడు రోహిన్ రెడ్డి,కొండా సురేఖ ఒఎస్‌డి సుమంత్‌పై పోలీసులు ఎందుకు కేసులు నమోదు చేయలేదని ప్రశ్నించారు. పోలీసులు కొండా సురేఖ నివాసం వద్ద ప్రేక్షకులుగా మారిపోవడం దారుణం అని పేర్కొన్నారు. ఉత్తమ్,రేవంత్ రెడ్డి కాల్ డేటా తీస్తే అన్ని నిజాలు బయట పడుతాయని అన్నారు.సచివాలయంలో ప్రభుత్వ పరంగా జరగాల్సిన వ్యవహారాలు ప్రైవేట్ గెస్ట్ హౌజుల్లో జరుగుతున్నాయని ఆరోపించారు. రోహిన్ రెడ్డి,సుమంత్ గన్‌లు పెట్టి ఎలా బెదిరిస్తారు..? అని నిలదీశారు.
వారి దగ్గరకు తుపాకులు ఎలా వచ్చాయని అడిగారు. కొండా సురేఖ కూతురు మాటల్లో ప్రభుత్వ పెద్దల చీకటి దందాలు బయటపడ్డాయని వెల్లడించారు.కమిషన్ల కోసం మంత్రులు బాహాటంగా కొట్లాడుకుంటున్నారని విమర్శించారు. అడ్లూరి లక్ష్మణ్,వివేక్,పొన్నం ప్రభాకర్,సీతక్క,పొంగులేటిలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని అన్నారు. మాఫియా డాన్‌ల చేతికి రాష్ట్రం వెళ్లిందా..? అని ప్రశ్నించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బెదిరింపులతో ఆత్మహత్య యత్నానికి ఒడిగట్టిన బానోతు రవి ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు కట్టలేదని ఆరోపించారు. తెలంగాణ భవన్ ముందట ఇంటెలిజెన్స్ పెట్టె బదులు రోహిణ్ రెడ్డి,ఫహీమ్ ఖురేషి,తిరుపతి రెడ్డి గెస్ట్ హౌజ్‌ల దగ్గర నిఘా పెట్టొచ్చుకదా..? అని అడిగారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఒక్క భూ యాజమాని సుఖంగా లేరని, ఆర్‌ఆర్ టాక్స్ భాదితులు ఎక్కువయ్యారని ఆరోపించారు. గురుకులాల్లో మరణ మృదంగం కొనసాగుతున్నా ఈ ప్రభుత్వానికి పట్టింపు లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గన్ కల్చర్, మాఫియా పాలన పోవాలంటే రేవంత్ ప్రభుత్వాన్ని గవర్నర్ బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్‌లో బిఆర్‌ఎస్ గెలవకపోతే మాఫియా పాలన పెరిగిపోతుందని అన్నారు. కేబినెట్ సమావేశంలో మంత్రులు మూకుమ్మడిగా రాజీనామా చేసి తమకు పాలన చేతకావడం లేదని తప్పుకోవాదని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే మాఫియా కేబినెట్ సంస్కృతి మొదలైందని ఆరోపించారు.