బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారని టిపిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. ఈ మేరకు ఆయన గురువారం జూబ్లీహిల్స్ పరిధిలోని రహ్మత్‌నగర్‌లో బూత్‌స్థాయి సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. బిఆర్‌ఎస్ శకం ముగిసిందని, జూబ్లీహిల్స్ సీటు కాంగ్రెస్ ఖాతాలో పడటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయం మేరకే ఉప ఎన్నిక అభ్యర్థిగా నవీన్ యాదవ్ ఎంపిక జరిగిందన్నారు. కెటిఆర్ పదేళ్ల విధ్వంస పాలనను ప్రజలు మర్చిపోలేదన్నారు. బస్సుల్లో ఉచిత ప్రయాణం ఎప్పుడైనా ఊహించారా..? 40 లక్షల రేషన్ కార్డులు ఇచ్చి సన్న బియ్యం ఇస్తారని అనుకున్నారా..? అని ఆయన ప్రశ్నించారు. ప్రజల కష్ట కాలంలో తోడుగా ఉండే నాయకుడు కావాలని నవీన్ యాదవ్‌ను అభ్యర్థిగా ప్రకటించారని పిసిసి అధ్యక్షుడు పేర్కొన్నారు.
రాష్ట్రంలో బిఆర్‌ఎస్ పని అయిపోయిందని, ప్రజలకు కావాల్సింది సెంటిమెంట్ కాదని, అభివృద్ధి అని టిపిసిసి చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. డ్రగ్స్ కల్చర్ తీసుకొచ్చింది కెటిఆర్ కాదా? అని పిసిసి అధ్యక్షుడు ప్రశ్నించారు. యువత చెడు వ్యస నాలకు బారిన పడిన విషయం కెటిఆర్ మరిచిపోలేదని ఆయన ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ మాటకు కట్టుబడి ఉండే పార్టీ అని, జూబ్లీహిల్స్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే నవీన్‌యాదవ్ గెలవాల్సిన అవశ్యకత ఉందన్నారు. జూబ్లీహిల్స్ సీటు గెలవడం ఖాయమని, ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిసిసి అధ్యక్షుడు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్ర మంలో ఏఐసిసి ఇంచార్జీ మీనాక్షి నటరాజన్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, ఎంపి అనిల్ కుమార్ యాదవ్, కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, మాజీ ఎంపి అజారుద్దీన్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.