మన తెలంగాణ/నల్లబెల్లి: రూ.10 వేల అప్పు ఒకరి ప్రాణం పోడానికి కారణమైంది. వరంగల్ జిల్లా నల్లబెల్లి పోలీసులు, గ్రామస్థుల కథనం ప్రకారం.. మండలంలోని కొండాపురం గ్రామానికి చెందిన రమేశ్, సురేష్ ఇద్దరు అన్నదమ్ములు. రమేశ్‌కు వివాహమై ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత 8 ఏళ్ల కిందట భార్య చనిపోయింది. అనంతరం గీసుకొండ మండలం, మచ్చాపురం గ్రామానికి చెందిన స్వరూప (35)తో గ్రామంలోనే సహజీవనం చేస్తున్నాడు. నాలుగు నెలల కిందట తమ్ముడు సురేష్ రూ.10 వేలు అప్పుగా రమేశ్‌కు ఇచ్చాడు. ఇచ్చిన అప్పు తీర్చాలని అడిగితే ఇవ్వడం లేదంటూ పెద్ద మనుషుల సమక్షంలో ఇటీవలే పంచాయితీ సైతం పెట్టాడు.
ఈ క్రమంలోనే మద్యం మత్తులో ఇంటికి వచ్చిన సురేష్ తన డబ్బులు ఇవ్వాలంటూ తన అన్నతో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటామాట పెరిగి క్షణికావేశంలో సురేష్ కత్తితో అన్నపై దాడి చేశాడు. పక్కనే ఉన్న స్వరూప ఆపడానికి వెళ్లగా ఆమెపై కూడా దాడికి దిగాడు.ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ స్వరూప మృతి చెందగా.. రమేశ్‌ను మెరుగైన చికిత్స కోసం ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు.