రాయ్‌పూర్/న్యూఢిల్లీ: మావోయిస్టుల మరో అగ్రనేత తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆ శన్న లొంగిపోయారు. చత్తీస్‌గఢ్‌లో గురువారం ఆయన , వేర్వేరు చోట్ల మొత్తం 170 మంది నక్సలైట్లు లొంగిపోయారు. కేంద్రం పద్మవ్యూహం, అ మిత్ షా చక్రబంధంలో చిక్కిన అజ్ఞాత మావోయి స్టు పార్టీకి ఇది మరింత ఎదురుదెబ్బ అయింది. చత్తీస్‌గఢ్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణువేవ్ సాయ్ సమక్షంలో ఈ నక్సల్స్ బృందం జగదల్పూరులో పోలీసుల ముందు ఆయుధాలతో పాటు సరెండ ర్ అయింది. అయితే ఇక్కడ ఆయనతో పాటు ఎందరు నక్సల్స్ లొంగిపోయారనేది అధికారికం గా వివరించలేదు. కానీ ఆయనతో పాటు మావోయిస్టు పార్టీకి చెందిన పది మంది పలు స్థాయిల అగ్రనేతలు సరెండర్ అయినట్లు ఆ తరువాత ఓ జాబితా వెలువరించారు. ఆశన్నను పట్టుకుంటే రూ కోటి పారితోషికం అని అప్పట్లో పోలీసులు ప్రకటించారు. ఇప్పుడు ఆయనతో పాటు లొంగిపోయిన వారిలో రాణిత (ఎస్‌జడ్‌సిఎం, మాడ్ డివిసి కార్యదర్శి,),
భాస్కర్ (డివిసిఎం పి1 32,) నీలా అలియాస్ వందే, దీపక్ పాలో ఇతరులు ఉన్నారని వెల్లడించారు. మల్లోజుల తోడుగా 60 మంది నక్సలైట్లు ఒక్కరోజు క్రితం గడ్చిరోలిలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవెంద్ర ఫడ్నవిస్ ముం దు అస్త్ర సన్యాసం తరువాత జనజీవన స్రవంతిలోకి వస్తామనే ప్రకటన వెలువరించిన మరుసటి రోజే ఆశన్న బృందం లొంగిపోయింది. దీనితో దండకారణ్యంలో నక్సల్స్ ప్రాబల్యం పడిపోయింది. ఇది చివరికి ఉనికికే ముప్పుగా దారితీసింది. మావోయిస్టు పార్టీ అగ్రనేత, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు అయిన తక్కళ్లపల్లి వాసుదేవరావు స్వస్థలం ప్రస్తుత ములుగు జిల్లాలోని వెంటకటాపూర్ మండలంలోని నర్సింగాపూర్. అక్కడి బిక్షపతిరావు, సరోజన దంపతుల పెద్ద కుమారుడు వాసువేవరావు. చిన్ననాటనే విప్లవోద్యమాలకు ఆకర్షితులై, ఆర్‌ఎస్‌యు నాయకత్వం, కాకతీయ విశ్వవిద్యాలయంలో వామపక్ష భావజాల ప్రచారంలో చురుకుగా ఉంటూ వచ్చిన ఆయన తరువాత అజ్ఞాతంలోకి వెళ్లాడు.నక్సల్స్ బాటలో ముందుకు సాగి ఆశన్నగా అగ్రస్థాయికి చేరాడు.
సంచలనాల ఘటనల్లో సూత్రధారి
పాత పలు కీలక నక్సల్స్ ఘటనల్లో ఆయన ప్రధాన పాత్ర ఉంది. ఐపిఎస్ ఉమేష్ చంద్ర, మాజీ హోం మంత్రి మాధవరెడ్డి హత్యలలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబునాయుడుపై అలిపిరి వద్ద దాడి యత్నంలో ఆయననే కీలక పాత్ర పోషించాడనే కేసులు ఉన్నాయి. 2024 నవంబర్‌లో ఆశన్న ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడనే ప్రచారం జరిగింది. తరువాత ఇది నిజం కాదని తేలింది. 60 సంవత్సరాలు పైబడ్డ ఆశన్న లొంగుబాటు, ఆయనతో పాటు కేడర్ ఏకంగా 170 మంది సరెండర్ అయిన విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఢిల్లీలో సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. ఆశన్న చాలాకాలంగా పార్టీలో వ్యవహారాలపై అసంతృప్తితో ఉన్నారు. బసవరాజు మరణం తరువాత తనకు అగ్రనాయకత్వం దక్కుతుందని ఆశించారు. అయితే కుదరలేదు. దీనితో అంతర్గతంగా కుమిలిన ఆయన ఇప్పుడు అదును చూసుకుని లొంగిపోయారని వెల్లడైంది.
ఆశన్న సరెండర్‌పై సస్పెన్స్
ఒక్కరోజు క్రితమే ఆశన్న ఇతర సభ్యులు గురువారం సరెండర్ అవుతారని ప్రచారం జరిగింది. అయితే మధ్యాహ్నం వరకూ కూడా ఆయన ఎక్కడ సరెండర్ అయ్యారనేది మీడియాకు స్పష్టత రాలేదు. అయితే ఆ తరువాత సాయంత్రం కేంద్ర హోం మంత్రి అమిత్ షా సామాజిక మాధ్యమం ద్వారా ప్రకటన వెలువరించడం, ఆశన్న సరెండర్ అయ్యారని చెప్పడం, నక్సలైట్లు జనజీవన స్రపంతిలోకి మిగిలిన మర్యాద మార్గంగా వచ్చి చేరాలని లేకపోతే భద్రతా బలగాలే ఇతరత్రా చేయాల్సిన చర్యకు దిగుతాయని పేర్కొనడం, ఇదే సమయంలో ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్, ఉన్నతాధికారుల ఎదుట ఆశన్న ఆయనతో పాటు పలువురు నక్సల్స్ లొంగిపోయినట్లు వార్తలు, ఫోటోలు వెలువడటం జరిగింది. చాలారోజుల ముందుగానే ఆశన్న తన బృందంతో స్థానికంగా పోలీసు రక్షణలో ఉండి ఉంటారని, సరెండర్ విషయాన్ని ఇప్పుడు అధికారికంగా ప్రకటించారని ఇప్పటి పరిణామాలతో స్పష్టం అయింది. కాగా శుక్రవారం మధ్యప్రదేశ్ లేదా చత్తీస్‌గఢ్ వేదికలుగా మరో నక్సల్స్ నేత భారీగా దళాలతో పాటు భద్రతాబలగాల ముందు లొంగిపోతారనే వార్తలు నిర్థారణ కాలేదు.
లొంగిపొండి.. లేదా అణచివేత తప్పదు
నక్సల్స్‌కు కేంద్ర మంత్రి అమిత్‌షా హెచ్చరిక
న్యూఢిల్లీ : ఒకప్పుడు వామపక్ష తీవ్రవాద స్థావరాలుగా ఉన్న ఛత్తీస్‌గఢ్ లోని అబుజ్‌మడ్, ఉత్తర బస్తర్ అనే రెండు డివిజన్లు ఇప్పుడు నక్సల్స్ నుంచి విముక్తి పొందాయని, మోడీ ప్రభుత్వ విధానం స్పష్టంగా ఉందని, ఎవరైతే నక్సలైట్లు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారో వారిని స్వాగతిస్తామని, ఇంకా తుపాకీతో ఉద్యమం కొనసాగించాలనుకునే వారు భద్రతా దళాల ఆగ్రహానికి గురికాక తప్పదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. నక్సలిజం మార్గంలో ఇంకా ఉన్నవారు ఆయుధాలను విడిచిపెట్టి జనస్రవంతి లోకి రావాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నానని సూచించారు. 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని సమూలంగా నిర్మూలించేందుకు తాము కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. బుధవారం ఛత్తీస్‌గఢ్‌లో 27 మంది మహారాష్ట్రలో మరో 61 మంది లొంగిపోయి జనస్రవంతి లోకి వచ్చారని,మరునాడు గురువారం ఛత్తీస్‌గఢ్‌లో 170 మంది తమ ఆయుధాలను విడిచిపెట్టి లొంగిపోయారని వెల్లడించారు.
దీంతో రెండు రోజుల వ్యవధిలో 258 మంది లొంగిపోవడం నక్సలిజంపై పోరులో పెద్ద విజయంగా అభివర్ణించారు. భారత రాజ్యాంగంపై తమ విశ్వాసాన్ని ప్రకటిస్తూ హింసను త్యజించాలనే వీరి నిర్ణయాన్ని అభినందిస్తున్నట్టు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం లోని కేంద్ర ప్రభుత్వం వామపక్ష తీవ్ర వాదాన్ని అంతం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాల ఫలితాలను ఇది ప్రతిబింబిస్తుందన్నారు. ఒకప్పుడు తీవ్రవాద స్థావరాలుగా ఉండే అబుజ్‌మడ్, ఉత్తరబస్తర్ డివిజన్లు నేడు నక్సల్స్ నుంచి విముక్తి పొందాయని వెల్లడించడం అమితానందం కలిగిస్తోందన్నారు. ఇప్పుడు దక్షిణ బస్తర్‌లో నక్సలిజం జాడ ఉందని, దీన్ని భద్రతా దళాలు త్వరలో తుడిచిపెడతాయని పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత 2024 జనవరి నుంచి ఇప్పటివరకు 2100 మంది నక్సల్స్ లొంగిపోయారని, 1785 మంది అరెస్టయ్యారని, 477 మందిని నిర్మూలించడమైందని అమిత్‌షా వివరించారు.