క్షేత్ర స్థాయిలో ప్రజాసమస్యలను వినేందుకు ఈ నెల 25 నుంచి 2026 ఫిబ్రవరి 13వ తేదీ వరకు ‘జాగృతి జనం బాట’ పేరుతో జిల్లాల్లో పర్యటించబోతున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. బుధవారం జూబ్లీహిల్స్ లోని జాగృతి కార్యాలయంలో జాగృతి జనం బాట పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కవిత ప్రతి జిల్లాలో రెండు రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుందని, అక్కడి ప్రజలతో మమేకమై వారి సమస్యలు వింటామన్నారు. భౌగోళిక తెలంగాణ సాధించుకున్న మనం సామాజిక తెలంగాణ ఇంకా సాధించుకోలేదని మాట్లాడితే తనను బీఆర్‌ఎస్ నుంచి కుట్రపూరితంగా వెళ్లగొట్టారని ఆరోపించారు. నాడు చెప్పిందే నేడు తాను మళ్లీ చెబుతున్నానని సామాజిక తెలంగాణ సాధించుకోవడానికి తెలంగాణ జాగృతి కట్టుబడి పని చేస్తుందన్నారు. సామాజిక తెలంగాణ అంటే నినాదం కాదని ఇది విధానపరమైన నిర్ణయం అని దీనికోసం జాగృతి పని చేస్తుందన్నారు.
కేసీఆర్ పేరు చెప్పి బతకాలని లేదు : కేసీఆర్ ఫొటో లేకుండానే ఈ యాత్ర నిర్వహించబోతున్నామని కవిత క్లారిటీ ఇచ్చారు. తాను బీఆర్‌ఎస్ సభ్యురాలిని కూడా కాదని అందుకే నైతికంగా కేసీఆర్ ఫొటో లేకుండానే యాత్ర చేయబోతున్నామని, అంత మాత్రాన కేసీఆర్‌ను అవమానించినట్లు కాదన్నారు. కేసీఆర్ అనే చెట్టును దుర్మార్గుల బారి నుంచి కాపాడటానికి తాను చేయని ప్రయత్నం అంటూ లేదన్నారు. ఆ చెట్టు నీడ నాది కానప్పుడూ ఆ చెట్టుపేరు చెప్పి బతకాలనే ఉద్దేశం నాకు లేదన్నారు. తాను తన దారి వెతుక్కుంటున్నానన్నారు. కేసీఆర్ కూతురుగా పుట్టడం జన్మజన్మలకు తాను చేసుకున్న అదృష్టం అని అయితే దారులు వేరవుతున్నప్పుడు తాను ఇంకా వారి పేరు చెప్పుకోవడం నైతికంగా మంచిది కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక సమస్యలు ప్రజలను పట్టిపీడిస్తున్నాయన్నారు. పరిష్కారాలను పక్కన పెట్టి ప్రతిపక్షాలను తిట్టడమే పనిగా ఈ ప్రభుత్వం పెట్టుకుందన్నదని విమర్శించారు. ఎనిమిది మంది ఎంపీలను గెలిపించినా ఒక్క రూపాయి కూడా కేంద్రంలోని బీజేపీ రాష్ట్రానికి ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంలో అనిశ్చితి తెలంగాణ వ్యాప్తంగా ఉందన్నారు.
జిల్లాల వారీగా టూర్ షెడ్యూల్ : నిజామాబాద్ – అక్టోబర్ 25, 26. మహబూబ్నగర్ – అక్టోబర్ 28, 29, కరీంనగర్ – అక్టోబర్ 31, నవంబర్ 1, ఆదిలాబాద్ – నవంబర్ 3, 4, వరంగల్ / హన్మకొండ – నవంబర్ 8, 9, నల్గొండ – నవంబర్ 11, 12, మెదక్ – నవంబర్ 14, 15, ఖమ్మం – నవంబర్ 17, 18, రంగారెడ్డి – నవంబర్ 20, 21, నారాయణపేట – నవంబర్ 23, 24, కామారెడ్డి – నవంబర్ 27, 28, గద్వాల్ – నవంబర్ 30, డిసెంబర్ 1, పెద్దపల్లి – డిసెంబర్ 3, 4, యాదాద్రి భువనగిరి – డిసెంబర్ 6, 7, భూపాలపల్లి – డిసెంబర్ 9, 10, మంచిర్యాల – డిసెంబర్ 12, 13, సిద్దిపేట – డిసెంబర్ 15, 16, భద్రాద్రి కొత్తగూడెం – డిసెంబర్ 18, 19, మెద్చల్ – మల్కాజిగిరి – డిసెంబర్ 21, 22, నాగర్కర్నూల్ – డిసెంబర్ 27, 28, రాజన్న సిరిసిల్ల – జనవరి 3, 4, సూర్యాపేట – జనవరి 6, 7, జనగామ – జనవరి 10, 11, ఆసిఫాబాద్ – జనవరి 17, 18, సంగారెడ్డి – జనవరి 20, 21, వికారాబాద్ – జనవరి 24, 25, ములుగు – జనవరి 27, 28, జగిత్యాల – జనవరి 30, 31, మహబూబాబాద్ – ఫిబ్రవరి 2, 3, నిర్మల్ – ఫిబ్రవరి 5, 6, వనపర్తి – ఫిబ్రవరి 8, 9, హైదరాబాద్ – ఫిబ్రవరి 12, 13.