మహాభారత్ హిందీ సీరియల్ నటుడు పంకజ్ ధీరజ్ బుధవారం ముంబైలో కన్నుమూశారు. ఈ విఖ్యాత ధారావాహికంలో పంకజ్ ధీరజ్ మహారధి కర్ణుడి పాత్రకు జీవం పోయడం ద్వారా విశేష అభిమానులను పొందారు. 68 సంవత్సరాల ఆయనకు క్యాన్సర్ కబళించివేసింది. ఆయన మృతి వార్తను సినిమా , టీవీ ఆర్టిస్టు అసోసియేషన్ సిన్టా నిర్థారించింది. తమ సంస్థకు పూర్వపు ఛైర్మన్, తరువాత ప్రధాన కార్యదర్శిగా కూడా వ్యవహరించిన ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారని తెలిపి , నివాళులు అర్పించారు. బుధవారం సాయంత్రమే ఆయనకు విలే పార్లే సమీపంలో అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలిపారు.
మహాభారతం సీరియల్‌లో నటించిన పలువురు నటులు , సాంకేతిక నిపుణులు అనేకులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సీరియల్‌లో అర్జున పాత్రధారి అయిన అర్జున్ సామాజిక మాధ్యమం ద్వారా తమ సంతాపం తెలిపారు. ఆయనతో ఈ సీరియల్‌లో నటించినప్పటి అనుభవాలతో కూడిన ఫోటోలను జతచేశారు. ధీరజ్ కుమారుడు , నటుడు అయిన నికితిన్ ధీరజ్ తన తండ్రి ఓ సందర్భంలో పేర్కొన్న మాటలను తుది అంకంగా అందరికి వెల్లడించారు. జీవితంలో ఏది వచ్చినా రానివ్వండి, ఎవరేమి చెప్పినా చెప్పనివ్వండి, ఏది జరిగినా జరగనివ్వండి, అంతా శివార్పణం అనుకుని ముందుకు సాగండి అనే తండ్రి సందేశాన్ని అభిమానులకు అందించారు.