కాబూల్ : పాకిస్థాన్ అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో ఇరు దేశాల బలగాల మధ్య మళ్లీ సంఘర్షణలు మొదలయ్యాయి. మంగళవారం రాత్రి రెండు దేశాల సైనికులు ఒకరిపై ఒకరు కాల్పులు జరపడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రెండు వైపులా డజన్ల మంది సైనికులు మృతి చెందినట్టు సమాచారం. అయితే ముందుగా ఎవరు కాల్పులు జరిపారనే విషయమై ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో కాల్పుల విరమణపై మాట్లాడటం కోసం అఫ్గన్ వెళ్లేందుకు పాకిస్థాన్ మంత్రులు ప్రయత్నించారు. కానీ అఫ్గాన్ వారిని అడ్డుకుంది. దాంతో పాకిస్థాన్ మధ్యవర్తిత్వం కోసం ఖతార్, సౌదీ అరేబియాలను సంప్రదించింది. తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ బుధవారం ఉదయం పాకిస్థానే తాజాగా కాందహార్ ప్రావిన్స్‌లో స్పిన్‌బోల్డక్ జిల్లాలో దాడులకు పాల్పడిందని,15 మంది పౌరులు మృతి చెందారని, వందమందికి పైగా గాయపడ్డారని పేర్కొన్నారు. అదే ప్రాంతంలోని ఆస్పత్రి వర్గాలు గాయపడిన వారిలో 80 మంది మహిళలు, చిన్నపిల్లలు ఉన్నారని వెల్లడించాయి.
అఫ్గాన్ దళాలు ప్రతీకార దాడులకు పాల్పడ్డాయని, భారీ సంఖ్యలో పాక్‌సైనికులు హతమయ్యారని పాకిస్థాన్ ఆయుధాలను, ట్యాంకులను స్వాధీనం చేసుకోవడమైందని తాలిబన్ పేర్కొంది. మంగళవారం రాత్రి ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే అఫ్గాన్ సైన్యం దాడులకు పాల్పడిందని పాక్ అధికారులు ఆరోపించారు. అఫ్గాన్ దాడులకు తాము ప్రతిదాడులు చేశామని, దాని ట్యాంకులను , సైనిక పోస్ట్‌లను దెబ్బతీశామని స్థానిక మీడియాతో పాక్ భద్రతాధికారులు పేర్కొన్నారు. తాలిబన్లు వాయువ్య, నైరుతి ప్రాంతాల్లో సరిహద్దు పోస్టులను కూల్చివేశారని ఆరోపించారు. దాదాపు 30 మంది అఫ్గాన్ సైనికులు హతమయ్యారన్నారు. స్పిన్‌బోల్‌డాక్‌లో మరో 20 మంది చనిపోయారన్నారు. కాందహార్‌లో పాక్ జెట్ విమానాలు దాడులకు పాల్పడుతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. అఫ్గాన్‌లో ఖోస్ట్ ప్రావిన్స్ లోని డిప్యూటీ పోలీస్ ప్రతినిధి తాహిర్‌అహ్రర్ కూడా ఈ ఘర్షణలను ధ్రువీకరించారు.
చమన్ జిల్లాలో తాలిబన్ల దాడులకు నలుగురు పౌరులు గాయపడ్డారని పాక్ ఆరోపించింది. పాక్ ప్రభుత్వం మీడియా ప్రకారం , ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే అఫ్గాన్ దళాలు, తెహ్రీక్ ఇతాలిబన్ పాకిస్థాన్ సంయుక్తంగా తమ భూభాగం లోని పోస్టులపై కాల్పులు జరిపారని పేర్కొంది. దీనికి పాక్ దళాలు బలంగా స్పందించాయని, టీటీపీకి చెందిన విశాలమైన శిక్షణ కేంద్రాన్ని ధ్వంసం చేశామని పాక్ భద్రతాధికారులు తెలిపారు. ఈ ఘర్షణలతో సరిహద్దుల్లో వేలాది మంది నిర్వాసితులయ్యారు.
మధ్యవర్తిత్వానికి సిద్ధం: జేయూఐఎఫ్ చీఫ్
పాక్ అఫ్గాన్ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఘర్షణలపై ‘జమైత్ ఉలేమా ఈఇస్లాం ఫ్లజ్ పార్టీ చీఫ్ మౌలానా ఫజ్లుర్ రెహమాన్ స్పందించారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు మధ్యవర్తిత్వం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. గతంలో పాక్‌అఫ్గాన్‌ల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో తాను కీలకపాత్ర పోషించానన్నారు. ఇప్పుడు కూడా తాను అది చేయగలనని పేర్కొన్నారు. దీనికి సంబంధించి అఫ్గాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నానని, ఈ సమస్యను పరిష్కరించుకోవాలని వారు కూడా భావిస్తున్నారని వెల్లడించారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.