ప్రపంచాన్ని మార్చే శక్తి విద్యలో ఉంది. భారతదేశాన్ని 21వ శతాబ్దపు విజ్ఞానశక్తిగా మారుస్తానని కలలు కనిన మహానుభావుడు డా. అబ్దుల్ కలాం. డాక్టర్. ఎపిజె అబ్దుల్ కలాం ఒక ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త రాష్ట్రపతి. ఇస్రో, డిఆర్‌డిఒ సంస్థల్లో ముఖ్యమైన పదవుల్లో పనిచేశారు. భారతదేశానికి స్వదేశీ మిసైళ్ళ తయారీలో మార్గదర్శకుడు కావడంతో ‘మిసైల్ మాన్ ఆఫ్ ఇండియా’ అని పిలిచేవారు. 2002 నుండి 2007 వరకు 11వ రాష్ట్రపతిగా సేవలందించారు. ఆయన ప్రజలతో మమేకమై పని చేసినందున ‘పీపుల్స్ ప్రెసిడెంట్’ అనే పేరు పొందారు. భారతరత్న (1997) భారతదేశ అత్యున్నత పౌరపురస్కారం, అలాగే పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి ఇతర పురస్కారాలు కూడా అందుకున్నారు. భారతదేశ 11వ రాష్ట్రపతి, ప్రఖ్యాత అంతరిక్ష శాస్త్రవేత్త, అంకితభావంతో కూడిన విద్యావేత్త డా. ఎపిజె అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకుని భారతదేశంలో ప్రతి సంవత్సరం అక్టోబర్ 15న అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవాన్ని జరుపుకోవడం గర్వకారణం.
ఈ సందర్భంలో ఒక ముఖ్యమైన అంశంపై మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. డిగ్రీ పట్టాలు సరే.. ప్రతిభ, నైపుణ్యాలు ఏవి? బిఎ, బిఎస్‌సి, బిటెక్, ఎంసిఎ ఇవన్నీ విద్యార్హతల గుర్తింపులు మాత్రమే. వాటిని సంపాదించడం ఒక గొప్ప విషయం.కానీ సమాజంలో ఉద్యోగ అవకాశాలు దక్కాలంటే, ఆ పనిని చేయగల నైపుణ్యం ఉండాలి. ఉద్యోగాలు డిగ్రీని కాదు, పనితీరును చూస్తాయి. ఈ సందర్భంగా మనం ఒక సత్యాన్ని అర్థం చేసుకోవాలి. డిగ్రీ పట్టాలు జీవిత విజయం కోసం ఒక మెట్టు మాత్రమే. కానీ నిజమైన ఎదుగుదల కోసం ప్రతిభ, నైపుణ్యాలు అవసరం.డిగ్రీ అంటే ఏమిటి? డిగ్రీ ఒక విద్యార్థి విద్యా ప్రయాణానికి గుర్తింపు. కానీ ఉద్యోగాలు, పరిశ్రమలు, సమాజం కోరుకునేది అభ్యాసంలో నేర్చుకున్న పాఠాల కంటే కూడా వాటిని ఆచరణలో పెట్టే సామర్థ్యం. అంటే, ప్రతిభ, నైపుణ్యాలు. ప్రాక్టికల్ నాలెడ్జ్. విద్యా ప్రమాణం కన్నా పనితీరు ముఖ్యం. ప్రతిభ అంటే ఏమిటి? ప్రతిభ అంటే పుస్తకాల్లో చదివిన విషయాన్ని గుర్తుపెట్టుకోవడం కాదు. ప్రతిభ అంటే ఆలోచించగలగటం, సృజనాత్మకంగా వ్యవహరించడం, కొత్త దారులు వెతకడం, నేర్చుకున్నది జీవితంలో ఉపయోగించగలగడం. ఇటీవల విడుదలైన ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2025 ప్రకారం మన పట్టభద్రుల్లో 51% మంది మాత్రమే ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు కలిగి ఉన్నారు. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే 8.25% మంది మాత్రమే చదువుకున్న విషయాలకు సంబంధించిన ఉద్యోగాలు చేస్తున్నారు. మిగతా వారంతా విద్యార్హతలతో సంబంధంలేని పనుల్లో స్థిరపడుతున్నారు. కంఫర్ట్ జోన్ చూసుకుంటూ కడుపులోని చల్లకదలకుండా ఉద్యోగాలను నెట్టుకొద్దామనేవారికి ఈనాటి పోటీ ప్రపంచం లో నిలబడలేరు.
టెక్నాలజీ వేగంగా మారుతున్నది. విద్యార్థులు మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా నూతన నైపుణ్యాలను నేర్చుకోవాల్సిందే, లేనట్లయితే ఉద్యోగ మార్కెట్‌లో వెనుకబడిపోతారు. ప్రస్తుతం దేశంలో ఉద్యోగ సమస్య ఒక తీవ్రమైన సమస్యగా మారింది. కొందరు యువకులు కేవలం విద్యా పట్టాలు పొందడం ద్వారా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ మార్కెట్‌లో నైపుణ్యాల లేకపోవడం వల్ల అవకాశాలు తగ్గిపోతున్నాయి. దేశంలో పౌరాభివృద్ధి, పరిశ్రమల వృద్ధి పరిమితంగా ఉండటంతో ఉద్యోగాలు సరిపోకపోవడం. యువతకు కావలసిన నైపుణ్యాలు నేర్పించే కార్యాచరణలు తక్కువగా ఉంటాయి.విజయానికి అవసరమైన నైపుణ్యాలు ఏమిటంటే అవి సాంకేతిక నైపుణ్యాలు (Technical Skills): కంప్యూటర్ పరిజ్ఞానం, డిజిటల్ టూల్స్ ఉపయోగం, డేటా అనాలిసిస్, ప్రోగ్రామింగ్, డిజైన్, మృదు నైపుణ్యాలు (Soft Skills): కమ్యూనికేషన్ (మాట్లాడటం, వినటం) సమయ పాలన, టీమ్ వర్క్, లీడర్ షిప్ స్కిల్స్, సృజనాత్మకత, సమస్య పరిష్కరణ: కొత్త ఆలోచనలు, సమస్యలకు తక్షణ పరిష్కారాలు వెతకగలగటం. అభ్యాస సామర్థ్యం (Adaptability): మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా నేర్చుకోవటం. ఆత్మవిశ్వాసం, స్వీయ నియంత్రణ: శ్రమ, క్రమశిక్షణతో ముందుకెళ్లే ధైర్యం. డా. కలాం నోట మాటలు ‘Learning gives creativity, Creativity leadsto thinking, Thinking provides know ledge, Knowledge makes you great’ అని కలాం చెప్పారు. వారు స్పష్టంగా చెప్పారు విద్య అంటే మార్కులు మాత్రమే కాదు, అది ఒక వ్యక్తిని విలువైనవాడిగా మార్చే మార్గం. ఫ్యాషన్‌తో చదివినప్పుడే ఏ కోర్స్ అయినా వంటపడుతుంది. మన కాళ్ళపై మనం నిలబడడానికి అది తోడ్పడుతుంది, ప్యాకేజీ పైనే దృష్టి పెట్టి కోర్సులో చేరేవారు మనస్ఫూర్తిగా చదవలేరు, మనసుపెట్టి ఉద్యోగాలు చేయలేరు.
ఈ రోజుల్లో అన్నింటికీ డబ్బే మూలమైపోయింది. ఫలితంగా చదువు కెరియర్‌లో కూడా ఆసక్తి ఉన్న రంగాలను వదిలేసి డబ్బు బాగా వస్తుందనుకున్న రంగాల్ని ఎంచుకుంటున్నారు. అకాడమిక్ చదువులతో సంబంధం లేకుండా నిపుణత సృజనాత్మకతలపై దృష్టి పెట్టే వ్యక్తులు ఆత్మవిశ్వాసంతో ముందుకు దూసుకు వెళతారు, అవకాశాల్ని అందిపుచ్చుకుంటారు. నైపుణ్యమున్న వ్యక్తులు అనతి కాలములోనే ఎంచుకున్న రంగాల్లో తమదైన ముద్రను వేయగలుగుతారు. ఈ అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవాన్ని నేటి యువత అబ్దుల్ కలాం స్ఫూర్తిని, అతని రచనల ప్రేరణ ద్వారా ఆత్మపరిశీలన చేసుకున్నట్లయితే నేను పొందిన డిగ్రీ నా ప్రతిభకు నిదర్శనమా? నేను సమాజానికి ఏమైనా ఇవ్వగలనా? నాకు ఉన్న నైపుణ్యాలు నన్ను జీవితంలో విజయవంతుడిని చేస్తాయా? కలాం మాకు ఇచ్చిన మార్గదర్శనం ఒక గొప్ప ఆస్తి. ఆయన బాటలో నడిచే ప్రతి విద్యార్థి, పటిష్టమైన వ్యక్తిగా ఎదగడం ఖాయం. నేడు మన భారతదేశానికి కావాల్సింది ప్రతిభ, నైపుణ్యాలతో, సృజనాత్మకత, చురుకుదనం కనబరిచే యువతరం.
కోమల్ల ఇంద్రసేనారెడ్డి
98493 75829