మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా వానాకాలం లో సాగైన మక్కలను గురువారం నుంచి కొనుగోలు చేసేందు కు సర్కారు సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలతో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా 202సెంటర్లలో మక్కలు కొనుగోలు చేయనున్నారు. ఈ సీజన్లో మొక్కజొన్న పంట మార్కెట్‌కు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ను నోడల్ ఏజెన్సీగా నియమించి మక్కల కొనుగోళ్ల బాధ్యతలు అప్పగించింది. మార్క్‌ఫెడ్ అధికారులు కొనుగోళ్లపై కసరత్తు పూర్తి చేసి, ప్రణాళికలు సిద్ధం చేశారు. రైతులు తక్కువ ధరకు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకొని నష్టపోకుండా సర్కారు మ ద్దతు ధరలకు మక్కలు కొనుగోలు చేయనుంది. క్వింటాకు రూ.2,400 చొప్పున మద్దతు ధరతో మక్కలు కొనుగోలు చే యనుండగా, సాధారణ ధర క్విటాకు రూ. 1900 నుంచి రూ.2000 ధర మాత్రమే ఉంది.
రాష్ట్రంలో 6.24 లక్షల ఎకరాల్లో సాగు
ఈ వానాకాలంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా 6.24 ల క్షల ఎకరాల్లో 11.55 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలు సాగు చేసి రాష్ట్ర రైతులు రికార్డు సృష్టించారు. వానాకాలం మక్కల సాధారణ సాగు విస్తీర్ణం 5.21లక్షల ఎకరాలు కాగా, నిరు డు ఇదే సమయానికి 5.23 లక్షల ఎకరాల్లో సాగైంది. గతేడాది కంటే అధికంగా మక్కలు సాగైనట్లు వ్యవసాయశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన నివేదికలో పేర్కొంది. మక్కల సాగులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 95,116 ఎకరాలతో ప్రథమ స్థానంలో ఉండగా, ఆ తరువాత రంగారెడ్డి జిల్లాలో 65,262 ఎకరాలు, మహబూబాబాద్ జిల్లాలో 59,734 ఎకరాల్లో సాగైంది. నాగర్ కర్నూల్ జిల్లాలో 53,128 ఎకరాల్లో, నిజామాబాద్ జిల్లాలో 52,093 ఎకరాల్లో, కామారెడ్డి జిల్లాలో 50,736 ఎకరాల్లో సాగైనట్లు అధికారిక నివేదికలో పేర్కొన్నారు. వానాకాలం సీజన్లో 11లక్షల టన్నులు మార్కెట్‌కు రావచ్చని అధికారులు తెలిపారు. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో నిర్వహించే కొనుగోలు సెంటర్లకు 5 నుంచి 6 లక్షల టన్నుల మక్కలు వస్తాయని మార్క్ ఫెడ్ అధికారులు అంచనా వేస్తున్నారు.