మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ -గూగుల్‌తో భారతదేశంలోనే అతిపెద్ద డిజిటల్ ఒప్పందం డిజిటల్ క్యాంపస్ ఆన్ గూగుల్ క్లౌడ్ ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ బుధవారం డిజిటల్ క్యాంపస్ ఆన్ గూగుల్ క్లౌడ్‌ను లాంఛనంగా ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్, ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా డిజిటల్ క్యాంపస్ ఆన్ గూగుల్ క్లౌడ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని హైదరాబాద్ లోని క్యాంపస్‌లో నిర్వహిస్తుంది. ఇది భారతదేశంలోనే అతి పెద్ద డిజిటల్ భాగస్వామ్యంగా నిలవనుంది. దీని ద్వారా 50,000 మంది విద్యార్థులకు రాబోయే రోజుల్లో ్ సాంకేతిక నైపుణ్యాలు, ఏఐ ఆధారిత విద్యా పద్ధతులు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సర్టిఫికేషన్‌లు అందించబడతాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గూగుల్ సంస్థ నుండి వైభవ్ కుమార్ శ్రీవాస్తవ (ఇండియా హెడ్ – ఎడ్యుకేషన్ అండ్ ఎడ్‌టెక్స్), సిద్ధార్థ్ దల్వాడి (దక్షిణ భారత హెడ్ – ఎడ్యుకేషన్ అండ్ ఎడ్‌టెక్స్), మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ వేడుకలో 50,000 మంది విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొని గూగుల్ లోగోతో ఉన్న 50,000 బెలూన్లు ఆకాశంలోకి ఎగురవేశారు.
మల్లారెడ్డి యూనివర్సిటీ, మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠం, మల్లారెడ్డి డీమ్ డ్ టు బీ యూనివర్సిటీ లతో కూడిన మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ భారతదేశంలోనే అతి పెద్ద డిజిటల్ భాగస్వామ్య ప్రాజెక్టుగా నిలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ విద్యా ప్రపంచం, డిజిటల్ ఇండస్ట్రీ మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడమే కాకుండా, విద్యార్థులు ప్రపంచ టెక్నాలజీ మార్పులకు సన్నద్ధంగా ఉండేలా చేస్తుంది. ఈ సందర్భంగా మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చైర్మన్ డాక్టర్ భద్రా రెడ్డి మాట్లాడుతూ గూగుల్‌తో ఈ భాగస్వామ్యం కేవలం సాంకేతికతను అనుసంధానించడం మాత్రమే కాదని, ఇది మొత్తంగా విద్యా వ్యవస్థను మార్చగలిగే ఒక విప్లవాత్మక అడుగు అన్నారు. ప్రతి మల్లారెడ్డి విద్యార్థిని ప్రపంచ స్థాయి ఉద్యోగ అవకాశాలకు సిద్ధం చేయడం పై దృష్టి కేంద్రీకరించామని, విద్యా ప్రావీణ్యాన్ని డిజిటల్ ఆవిష్కరణతో మేళవించడం ద్వారా ‘గూగుల్ క్లౌడ్‌పై డిజిటల్ క్యాంపస్’ తమ విద్యార్థులను భవిష్యత్ ఉద్యోగ రంగానికి అవసరమైన నైపుణ్యాలతో సాధికారులను చేస్తుందన్నారు.మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠం హైదరాబాద్ వైస్ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న ప్రీతి రెడ్డి మాట్లాడుతూ ఉన్నత విద్యా రంగంలో ఈ మార్పు దిశలో ముందంజలో నిలవడం మా గర్వకారణంగా ఉంది. గూగుల్ సాంకేతికతను మా విద్యా బలంతో కలిపి, డిజిటల్ లెర్నింగ్‌కి కొత్త నిర్వచనాన్ని అందించాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. ఇంజినీరింగ్ నుండి హెల్త్‌కేర్ వరకు ప్రతి విద్యార్థి ఈ ప్లాట్‌ఫాం ద్వారా ప్రయోజనం పొందేలా చర్యలు తీసుకుంటున్నామని, ఆవిష్కరణ, సమగ్రత, ప్రతిభను ప్రోత్సహించే తమ లక్ష్యానికి ఈ భాగస్వామ్యం పూర్తిగా అనుకూలంగా ఉందని తెలిపారు.