బీజింగ్ : అమెరికాచైనా మధ్య ఇటీవల వాణిజ్య ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్న సంగతి తెలిసిందే. బీజింగ్‌పై అదనంగా 100 శాతం సుంకాలు విధిస్తున్నట్టు ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో ఇరు దేశాల మధ్య మళ్లీ వాణిజ్య యుద్ధం రాజుకుంది. తాజాగా ఇరుదేశాలు నౌకలపై పరస్పర ప్రత్యేక ఫీజులు ప్రకటించాయి. అమెరికా యాజమాన్యం నిర్వహణలో ఉన్న నౌకలు, యూఎస్ నిర్వహించే లేదా ఆ దేశ జెండాలతో వచ్చే ఓడలపై ప్రత్యేక ఛార్జీలను వసూలు చేస్తున్నట్టు చైనా మంగళవారం ప్రకటించింది. అయితే చైనా నిర్మించిన నౌకలకు ఈ ఫీజుల నుంచి మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. అటు అమెరికా కూడా నేటి నుంచి ఈ ఫీజుల వసూలు ప్రారంభించింది.
చివరివరకూ పోరాడతాం: చైనా
మరోవైపు అమెరికా అదనపు సుంకాలపై చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ స్పందించింది. “ వాణిజ్య యుద్ధం.. టారిఫ్‌ల అంశంపై మా వైఖరి స్థిరంగా ఉంది. మీరు (అమెరికాను ఉద్దేశిస్తూ ) యుద్ధం కోరుకుంటే మేం చివరివరకూ పోరాడతాం. అదే చర్చలు కావాలనుకుంటే మా తలుపులు తెరిచే ఉన్నాయి” అని వాణిజ్య మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. ప్రపంచం లో ఎక్కడా దొరకని అరుదైన ఖనిజాల ఎగుమతిపై ఇటీవల చైనా నియంత్రణలు విధించింది.
ఇకపై విదేశీ కంపెనీలు వాటిని దిగుమతి చేసుకోవాలంటే ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇది ట్రంప్‌నకు కోపం తెప్పించింది. దీంతో బీజింగ్‌పై 100 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు. అవి నవంబరు 1 నుంచి గానీ, అంతకు ముందు నుంచి గానీ అమల్లోకి వస్తాయని తెలిపారు. దీంతోపాటు చైనాకు అమెరికా సంస్థలు ఎగుమతి చేసే కీలక సాఫ్ట్‌వేర్‌ల పైనా నియంత్రణ విధిస్తామని వెల్లడించారు.