భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు
మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ముద్దాయిన ధాన్యపు రాశులు
దెబ్బతిన్న పత్తి.. పలుచోట్ల నేలకొరిగిన వరిపైళ్లు
మణుగూర్‌లో సింగరేణి ఉపరితల గనుల్లోకి చేరిన వరదనీరు.. బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
పొంగిపొర్లిన వాగులు, వంకలు
యాదాద్రి నక్కలగూడెంలో 5వేల కోళ్ల మృత్యువాత
మరో మూడురోజులు వర్షాలు
మన తెలంగాణ/హైదరాబాద్ : నైరుతి రుతుపవనాల నిష్క్రమణ నేపథ్యంలో ఏర్పడుతున్న స్వల్ప అలప్పీడనాలతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం రాష్ట్రంలో భద్రాద్రి కోత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మణుగూరు సురక్ష బస్టాండ్ ఏరియా చెరువును తలపించేలా మారింది. సింగరేణి గనికి సంబంధించిన వరద నీరు రోడ్లపైకి రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
కోడిపుంజుల వాగు ఉదృతంగా ప్రవహించడంతో పరివాహక ప్రాంతాల్లోకి నీరు చేరడంతో నివాసితులు భయభ్రాంతులకు గురై ఆగ్రహంతో కోడిపుంజుల వాగుపై ఆందోళన నిర్వహించారు. మణుగూరు మండలంలో 108 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో మండలంలోని పలు గ్రామాలకు తాత్కాలికంగా రాకపోకలు నిలిచిపోయాయి. సింగరేణి ఉపరితల గనిలోకి వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. కరక గూడెం మండలంలో భయంకరమైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.అనంతరం కాంప్లెక్స్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే ఉపాధ్యాయులకు పద్మాపురం ఒర్రె వద్ద భారీగా వరద నీరు ప్రవహిస్తుండడంతో విధులకు హాజరు కాలేక సోమవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు. రేగళ్ల గ్రామంలోని ఓ రైతుకు చెందిన సుమారు మూడు ఎకరాల వరి పంట భయంకరమైన వీదురు గాలులతో కూడిన భారీ వర్షానికి నేల పాలయింది.
ఖమ్మం జిల్లాల్లో ఏన్కూర్‌లో కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలో పత్తి నేలరాలిపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మూడు గంటల పాటు ఎడతెరిపి లేకుండా పలు ప్రాంతాల్లో వాన దంచి కొట్టింది. భారీ వర్షానికి వలిగొండ, ఆత్మకూరు మండలాల్లో వరద నీరు డ్రైనేజీలో జామ్ కాడంతో వరద నీరు ఇండ్లలోకి చేరుకుంది. దీంతో ఇంట్లో ఉన్న నిత్యావసరాలు, బట్టలు తడిసి పోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వలిగొండలో సుమారు రెండు వేల క్వింటాళ్ల ధాన్యం వరద నీటిలో కొట్టుకుపోయింది. మార్కెట్ యార్డులలో, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవడంతో రైతులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు.
ఆత్మకూరు మండంలోని లింగరాజుపల్లి, కూరెళ్ళ గ్రామాలలో కల్లాల్లో ఆరోబోసిన, కుప్పల్లో ఉన్న ధాన్యం తడిచిపోయింది. కూరెళ్ళ గ్రామంలోని వాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు వెళ్లేందుకు రాకపోకలు నిలిచిపోయాయి. లింగరాజుపల్లి గ్రామంలో 9 మంది రైతులకు సంబంధించిన వరి ధాన్యం వరద నీటితో కొట్టుకు పోయింది. అకాల వర్షంతో ధాన్యం తడిసిపోగా, పలుచోట్ల కొట్టుకుపోయింది. మోత్కూర్ మండలంలోని పలు గ్రామాల్లో కురిసిన భారీ వర్షానికి రైతులు ఆరబెట్టుకున్న ధాన్యం తడిసిపోయి నీటిలో కొట్టుకుపోయింది.
మున్సిపల్ పరిధిలోని ఇందిరానగర్ పాఠశాల ఆవరణలో వర్షపు నీరు నిలిచి విద్యార్థులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పాలడుగు, మోత్కూర్, బుజిలాపురంలో చెరువులు అలుగుపోస్తున్నాయి. గుండాల మండల పరిధిలోని పెద్దపడిశాల గ్రామంలో తోట సత్తమ్మ అనే మహిళ ఇల్లు కూలిపోయింది. నల్గొండ జిల్లా నాంపల్లిలో భారీ వర్షానికి పులుసు వాగు భారీ వరద ప్రవాహంతో ప్రవహిస్తూ పసునూరు పెద్ద చెరువు చిన్న చెరువులోకి ప్రవహిస్తుంది. దీంతో నాంపల్లి కొండమల్లేపల్లి మధ్య ముష్టిపల్లి గ్రామం వద్ద చెరువు కింద ప్రధాన ఆర్ అండ్ బి రోడ్డు పై బ్రిడ్జి పై నుండి భారీ వరద నీరు ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరంగల్ జిల్లా చెన్నారావు పేటలో మొక్కజొన్న తడిపోయింది.
మూడు రోజులు వర్ష సూచన
రాష్ట్రంలో మూడు రోజుల పాటు పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.