అమరావతి: డ్రైవర్ రాయుడు వీడియోపై టిడిపి ఎంఎల్‌ఎ బొజ్జల సుధీర్ రెడ్డి స్పందించారు. రాయుడు వీడియో ఎఐ, మార్ఫుడ్ వీడియో అని తెలిపారు. రాయుడుతో బలవంతంగా మాట్లాడించి అనంతరం అతడిని చంపి ఉంటారని ఆరోపణలు చేశారు. శ్రీకాళహస్తి అభివృద్ధి కోసం తాను పని చేస్తున్నానని, తనపై బురద జల్లడానికి ఈ వీడియో విడుల చేశారని మండిపడ్డారు. డిపాజిట్లు రాని వారితో తనకు పని ఏంటని ప్రశ్నించారు. ఆమె తనకు రాజకీయ ప్రత్యర్థి కాదు అని, డిపాజిట్ కూడా రాని వినుత గురించి తాను ఎందుకు లక్షలు ఖర్చు చేస్తానని ప్రశ్నించారు. వినుత దంపతులు క్రిమినల్ మెంటాలిటీతో ఉన్నారని, వాళ్ల డ్రైవర్ గురించి తనకు ఎలా తెలుస్తుందని బొజ్జల సుధీర్ రెడ్డి అడిగారు. వినుతకు బెయిల్ వచ్చిన తరువాత వీడియో విడుదల చేయడంలో అనుమానం ఉందన్నారు. కూటమి ప్రభుత్వంలో తన నియోజకవర్గంలో తన కోసం ఆమె ఎప్పుడు పని చేయలేదన్నారు. ఓటు వేయాలని వనిత ఇంట్లోకి తమ కుటుంబ సభ్యులు వెళ్తే రానివ్వలేదన్నారు. రాయుడి వీడియోపై దర్యాప్తు చేయాలని ఎంఎల్‌ఎ సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు. టిడిపి ఎంఎల్ఎ సుధీర్ రెడ్డి బలవంతం చేయడంతో వినుత దంపతులకు సంబంధించిన వీడియోలు తీశానని రాయుడు వీడియోలో వెల్లడించిన విషయం తెలిసిందే. రాయుడు హత్య కేసులో దంపతులు అరెస్టు కావడంతో పాటు ప్రస్తుతం బెయిల్ పై విడుదలయ్యారు.