రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిర్ణయించారు. ఈ నెల చివరివారంలో యాత్ర ప్రారంభించనున్నారు. తెలంగాణలో అన్ని జిల్లాల మీదుగా యాత్ర కొనసాగేలా ప్రణాళిక రూపొందించారు.ప్రతి జిల్లాలో రెండు రోజులపాటు యాత్ర నిర్వహించనున్నారు. కాగా, మాజీ ముఖ్యమంత్రి, స్వయానా తండ్రి అయిన కెసిఆర్ ఫొటో లేకుండా యాత్ర చేయాలని కవిత నిర్ణయించినట్లు తెలిసింది. తెలంగాణ జాగృతి ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు కెసిఆర్ ఫొటో లేకుండా కార్యక్రమాలు నిర్వహించలేదు. మొదటిసారి కెసిఆర్ ఫొటో లేకుండా కల్వకుంట్ల కవిత జనంలోకి వెళ్లనున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ ఫొటోతో రూపొందించిన తెలంగాణ జాగృతి యాత్ర పోస్టర్‌ను కవిత బుధవారం ఆవిష్కరించనున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ మేధావులు, విద్యావంతులతో ఇటీవల కవిత వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.
జాగృతి నేతలకు నియామకపత్రాలు అందజేత
తెలంగాణ జాగృతి యూత్ ఫెడరేషన్ రాష్ట్ర, జిల్లాల నాయకులకు రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సమాజంలో మార్పు అనేది యువత ద్వారానే సాధ్యమవుతుందని అన్నారు. ఏదైనా మార్పు కావాలని భావిస్తే అది సాధించే వరకు యువత వదిలిపెట్టదు అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో, స్వాతంత్ర ఉద్యమంలో యువతదే కీలక పాత్ర అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఒక మంచి సమాజాన్ని నెలకొల్పేందుకు తాము ప్రయత్నిస్తున్నామని, అందులో యువతది కీలక పాత్ర ఉండాలని తాను భావిస్తున్నానని చెప్పారు. కొత్తగా బాధ్యతలు చేపట్టనున్న వారు మంచి పేరు తెచ్చుకునేలా పనిచేయాలని ఆకాంక్షించారు.