హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. నయనతార ఈ చిత్రంలో హీరోయిన్‌గా ‘శశిరేఖ’ అనే పాత్రలో నటిస్తోంది. కొద్ది రోజుల క్రితం దసరా కానుకగా ఈ సినిమా నుంచి ‘మీసాల పిల్ల’ అనే పాట ప్రోమోను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ ప్రోమోకు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఫుల్ సాంగ్ విడుదలకు మాత్రం చిత్ర యూనిట్ కాస్త ఆలస్యం చేసింది.
అయితే ఈ ఆలస్యాన్ని కూడా ప్రమోషన్ కింద వాడేసుకున్నాడు దర్శకుడు అనిల్. ‘సంక్రాంతి వస్తున్నాం’ సినిమాలోని బుల్లిరాజుతో ఈ పాట ఎప్పుడు వస్తుందా అంటూ ఓ ఫన్నీ వీడియోని విడుదల చేశారు. నిజానికి ‘మీసాల పిల్ల’ ఫుల్ సాంగ్ సోమవారమే విడుదల చేస్తామని తొలుత చెప్పారు. కానీ, అనుకోని కారణాల వల్ల వాయిదా వేశారు. కాగా, ఈ పాటని మంగళవారం విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇక ఈ పాటని ఉదిత్ నారాయణ్, శ్వేత మోహన్ అలపించగా.. భీమ్స్ సంగీతం అందించారు. భాస్కరభట్ల ఈ పాటకు లిరిక్స్ రాశారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.