నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడ ప్రభుత్వ స్కూల్‌కు ‘కోమటి రెడ్డి ప్రతీక్’ పేరు పెట్టినట్టు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. సుమారు రూ.8 కోట్లతో నూతన స్కూల్ భవన నిర్మాణం చేసినట్టు ఆయన పేర్కొన్నారు. మంగళవారం మంత్రి కోమటిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ ప్రైమరీ అండ్ హైస్కూల్ స్థానంలో కార్పొరేట్‌కు దీటుగా అధునాతన సౌకర్యాలతో ఈ భవనాన్ని నిర్మించినట్టు మంత్రి తెలిపారు. అన్ని సౌకర్యాలతో కూడిన పక్కా భవనంలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే తన ప్రథమ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. నల్లగొండ లో పేదల విద్య, వైద్యానికి ప్రథమ ప్రాధాన్యతనిస్తున్నామని ఆయన అన్నారు. రాబోయే మూడేళ్లలో దశల వారీగా నియోజకవర్గంలోని అన్ని అంగన్‌వాడీలు, ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు అధునాతన సౌకర్యాలతో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మంత్రి పేర్కొన్నారు. స్కూల్ కు ‘కోమటి రెడ్డి ప్రతీక్‘ ప్రభుత్వ పాఠశాలగా నామకరణం చేయడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి కోమటి రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా పాఠశాలను ప్రారంభిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు.