పాట్నా: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీహార్ లో రాజకీయ పార్టీలు సన్నదమవుతున్నాయి. అలాగే, పార్టీలల్లో చేరికలు కూడా జరుగుతున్నాయి. తాజాగా ప్రముఖ జానపద గాయని మైథిలి ఠాకూర్(25) మంగళవారం భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో చేరింది. మధుబని జిల్లాలోని బెనిపట్టికి చెందిన ఠాకూర్ రాజకీయాల్లోకి రావాలనే తన కోరికను గతంలో వ్యక్తం చేసింది. రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం నుండి పోటీ చేయాలనుకుంటున్నానని తెలిపింది.
మైథిలి ఠాకూర్ ఎవరు?
బీహార్‌లోని మధుబని జిల్లాలో జన్మించిన మైథిలి, ఆమె ఇద్దరు సోదరులతో కలిసి.. వారి తాత మరియు తండ్రి వద్ద జానపద, హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం, హార్మోనియం, తబలాలో శిక్షణ పొందారు. భోజ్‌పురి, హిందీ భాషలలో బీహార్ సాంప్రదాయ జానపద పాటలను మైథిలి పాడింది. బీహార్ జానపద సంగీతానికి ఆమె చేసిన కృషికి గాను 2021లో సంగీత నాటక అకాడమీ నుండి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్‌ను అందుకుంది. తన జానపద గీతాలతో ప్రజాదరణను సొంతం చేసుకున్న మైథిలి ఠాకూర్ ను బీహార్ ఎన్నికల సంఘం ‘స్టేట్ ఐకాన్’గా నియమించింది.
కాగా, దర్భంగా జిల్లాలోని అలీనగర్ నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే మిశ్రీ లాల్ యాదవ్ పార్టీకి అక్టోబర్ 11న రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దళితులు, ఇతర వెనుకబడిన వర్గాలకు పార్టీలో సరైన గుర్తింపు లభించడం లేదని ఆరోపిస్తూ.. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్‌కు తన రాజీనామాను సమర్పిస్తున్నట్లు తెలిపారు. దీంతో అలీనగర్ నుంచి మైథిలి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంది. 243 మంది సభ్యులు గల బీహార్ శాసనసభకు రెండు దశల్లో పోలింగ్ జరుగుతుంది. మొదటి దశ నవంబర్ 6న, రెండవ దశ పోలింగ్ నవంబర్ 11న జరుగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు.