శ్రీనగర్ : పహల్గాం తరహాలో పాకిస్థాన్ మరోసారి దాడికి ప్రయత్నించవచ్చని వెస్టర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ హెచ్చరించారు. అలాంటి ప్రయత్నాలే కనుక జరిగితే భారత్ నుంచి తీవ్ర ప్రతిస్పందన వస్తుందని అన్నారు. జమ్ముకశ్మీర్‌లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. “ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్థాన్‌కు గట్టి బదులిచ్చాం. కానీ దాయాది ఎప్పటికీ తన బుద్ధి మార్చుకోదు. పహల్గాం తరహాలో మరోదాడికి యత్నించవచ్చు. అందుకే దాని ప్రతి కదలికపై మేం దృష్టి సారించాం. ఈసారి అలాంటి దుశ్చర్యలకు పాల్పడితే, మనం ఇచ్చే సమాధానం మామూలుగా ఉండదు ” అని మనోజ్‌కుమార్ స్పష్టం చేశారు.
ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంకు దగ్గర్లో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతం బైసరన్ లోయలో ఉగ్రవాదులు మారణహోమానికి పాల్పడిన సంగతి తెలిసిందే. సైనిక దుస్తుల్లో వచ్చిన వారు పర్యాటకులను అతి సమీపం నుంచి కాల్చి చంపారు. ఈ సంఘటనలోఓ కశ్మీరీ సహా 26 మంది ప్రాణాలు కోల్పోయారు.