తెలంగాణలో అక్రమమార్గంలో రవాణా అవుతున్న కల్తీ మద్యాన్ని అరికట్టడంలో ఎక్సైజ్ శాఖ సత్ఫలితాలు సాధించేనా… తెలంగాణ ఖజానాకు ఆదాయం తెచ్చిపెట్టే రెవెన్యూ వనరుల్లో అబ్కారి శాఖ చెప్పుకోదగ్గ రెవెన్యూ సమకూర్చుతూ పెద్దన్న జిఎస్‌టి రెవెన్యూకు తోడుగా ఉందనే చెప్పుకోవచ్చు. గత పది సంవత్సరాలుగా ఎక్సైజ్ ఆదాయం 400 శాతం పెరిగిందని సాక్షాత్తు ఆ శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. రెవెన్యూ అంచనాల ప్రకారం ఎక్సైజ్ ఆదాయం 2025- 26 సంవత్సరానికి గాను రూ. 54,193 కోట్లుగా నిర్ధారించి ఆ దిశగా ప్రభుత్వం, ఆ శాఖ యంత్రాంగం వడివడిగా అడుగులు వేస్తోంది. అయితే అనుకున్నట్లుగా కాకుండ ఆగస్టు 2025 నాటికి మొత్తం అనుకున్న టార్గెట్‌కు 28.09 శాతం మాత్రమే సాధించినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. ఎక్సైజ్ చట్టం 1968 ప్రొహిబిషన్ చట్టం 1995 ప్రకారం ప్రభుత్వం రెవెన్యూ కంటే ప్రజల్లో మద్యం వల్ల కలిగే దుష్ప్రభావాలపై, నాటుసారా వల్ల కలిగే ఆరోగ్య సమస్యపై, వాటి ప్రభావం నుంచి తాగుడుకు బానిసైనవారికి డిఆడిక్షన్ సెంటర్లపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించేందుకు సమీక్ష సమావేశంలో అబ్కారి మంత్రి తెలిపారు. అబ్కారి భవన్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో కల్తీ మద్యంపై ఉక్కుపాదం మోపాలని, ఎట్టి పరిస్థితుల్లోను కల్తీ మద్యం గ్రామాల్లో ప్రవేశించకుండ కట్టుదిట్టం చేయాలని సూచించారు.
ఎక్సైజ్ కమిషనర్ చేకూరి హరికిరణ్, ప్రిన్సిపల్ సెక్రెటరీ రిజివీ, ఇతర ఉన్నతాధికారులతో రివ్యూ చేస్తూ అసలు మద్యాన్ని మరిపించేలా ఊడలా పాకుతున్న కల్తీ మద్యం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉక్కుపాదంతో అణచివేయాలని గట్టిగ కోరారు. ఇదే కాకుండా ఎక్సైజ్ డ్యూటీ చెల్లించని ఎన్‌డిపిఎల్ మద్యం రాష్ట్ర సరిహద్దు జిల్లాల నుంచి విచ్చలవిడిగా పారుతుండడం తెలంగాణ ఖజానాను కలవరపరుస్తోంది. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను బలోపేతం చేస్తూ, అవసరమైతే అబ్కారి ఉద్యోగులకు రివాల్వర్‌లూ అందచేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఖాళీ మద్యం సీసాల్లో ఖరీదైనా బ్రాండ్లుగా మరిపిస్తూ, నకిలీ మద్యాన్ని అంటగట్టే ముఠాలు బార్లకు, మద్యం దుకాణాలకు, బెల్ట్ షాపులకు సరఫరా చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్ ముఠాలు హైదరాబాద్‌లో స్థావరాలు ఏర్పాటు చేసుకొని, ఇతర రాష్ట్రాల మద్యంతోపాటు కల్తీ మద్యాన్ని కూడా సరఫరా చేస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని గణనీయంగా దోచుకుంటున్నాయి. నకిలీ మద్యం ముఠాల ఆగడాలను కట్టడి చేయడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం గణనీయంగా కృషి చేస్తోందని చెప్పవచ్చు. ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి, సింథటిక్ డ్రగ్స్ సరఫరాను కట్టడి చేయడంతోపాటు వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.
నల్లబెల్లం తయారీ, అమ్మకంపై నిషేధించాలని, పట్టుకున్న నల్లబెల్లాన్ని సేంద్రియా ఎరువుల కోసం రైతులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం ముదావహం. అంతేకాకుండా నిషేధిత డ్రగ్స్ తయారీపై గట్టి నిఘా ఉంచి నాచారం, చర్లపల్లి వంటి పారిశ్రమికవాడల్లోనూ ఎప్పటికప్పుడు కనిపెట్టి ఉండాలని, అధికారులను అప్రమత్తంగా ఉంచాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలనుంచి ముఖ్యంగా కర్ణాటక, మహారాష్ట్రనుంచి రెక్టిఫయిడ్ స్పిరిట్‌ను అక్రమ రవాణా కాకుండా నియంత్రించాలని, నిఘా విభాగం పటిష్టం చేయాలని నిశ్చయించింది. అంతే కాకుండా ఎన్‌డిపిఎల్ మద్యం అక్రమంగా గోవా, హర్యానా, గుర్గాన్, కోల్ కత్తా, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఇక్కడికి తరలించకుండా చెక్ పోస్టులను పటిష్టపరిచారు. స్టేట్ టాస్క్‌ఫోర్స్, డిస్ట్రిక్ట్ టాస్క్‌ఫోర్స్ స్పెషల్ డ్రైవ్ ద్వారా ఎన్‌డిపిఎల్‌ను కంట్రోల్ చేస్తున్నాయి. కానీ ఆదిలాబాద్ జిల్లాలో ప్రముఖంగా వడ్డెర బస్తీ, సుందరయ్య నగర్, ఖురషీద్ నగర్‌లో దేశిదారు అక్రమంగా తరలించే వారిని అబ్కారి అధికారులు అరెస్ట్ చేస్తున్నా ఆగడాలు ఆగడం లేదు.
మహారాష్ట్ర నుంచి వచ్చే దేశిదారు పలు రుచుల్లో లభిస్తుండటంతో స్థానికులు అలవాటుపడి బానిసలుగా మారి దానికే అలవాటుపడ్డారు. ఈ దేశిదారు రాష్ట్ర ఆదాయానికి గణనీయంగా గండికొడు తుంది. ఇటీవలి దసరా ఉత్సవాలను ఆసరా చేసుకుని దేశిదారు అక్రమంగా తెలంగాణ జిల్లాల్లోకి ప్రవహిస్తున్నా అబ్కారి అధికారులు అడ్డుకట్టవేయలేక పోతున్నారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న తూ తూ మంత్రంగా విధులు కొనసాగిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులోని పెంగంగా పరీవాహక ప్రాంతాల గ్రామాల నుంచి దేశిదారు ఏరులై పారుతున్నది. ముఖ్యంగా భీంపూర్ మండలంలోని కరంజి, జైనథ్ మండలంలోని ఆనందపూర్, పెండల్వడ, కౌటా, పిప్పల్‌వాడ, సాంగిడి గ్రామాల వారు పెంగంగా నుంచి దేశిదారును అక్రమంగా తరలిస్తున్నారు. రాత్రివేళ నది దాటిస్తూ ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవహించి ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న దేశిదారును అబ్కారి అధికారులు అప్రమత్తంగా ఉండి అరికట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆరెంజ్, మ్యాంగో, సోంఫ్ ఫ్లేవర్లతో లభించే దేశిదారుకు తెలంగాణ ప్రజలు బానిసలై ధనప్రాణాలు కోల్పోకముందే అబ్కారి అధికారులు మేల్కొవలసిన అవసరం ఎంతైనా ఉంది.
మహ్మద్ సాబీర్
98492 31002
(ఆదిలాబాద్
జిల్లా ప్రతినిధి)