ఎన్‌సిఆర్‌బి నివేదిక ఓ ఏడాది ఆలస్యంగా వెలు గులోకి రావడం, డేటా, సేకరణ, సర్వేలు, జనాభా లెక్కలలో వెనుకబాటుతనాన్ని ప్రతిబింబిస్తోంది. ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి సకాలంలో డేటా చాలా ముఖ్యం. ఈ ప్రాంత భద్రతా వాతావరణం అస్థిరంగా ఉంది. తిరుగుబాటు జ్ఞాపకాలు, జాతిపరమైన లోపాలు, మాదకద్రవ్యాల వ్యాపారం, రవాణా వివరాలు నిరంతరం మారుతూ ఉంటాయి. తాజా లెక్కలు తెలిస్తే, అసలు నిజం తెలుస్తుంది. ఈ ప్రాంతంలో పోలీసు సిబ్బంది కొరత, శిక్షణ లేకపోవడం పెద్దలోపం. 2023లో మణిపూర్‌లో వైఫల్యాలు రాజకీయ, మతపరమైన ఒత్తిడిలో చట్టం అమలు ఎంత దారుణంగా విఫలమవుతుందో తేటతెల్లం చేస్తుంది.
ఈ మధ్య విడుదలైన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) నివేదిక 2023 మన దేశంలో అంతర్గత భద్రత, సామాజిక ప్రభావాలను తేటతెల్లం చేస్తోంది. గణాంకాలను పరిశీలించేటప్పుడు కాస్తజాగ్రత్త తప్పదు. రాష్ట్రాలలో విభిన్నమైన పరిస్థితుల నేపథ్యంలో రిజిస్టర్ అయ్యే కేసులు, రిపోర్ట్ అయ్యే కేసులలో తేడా ఉంటుంది. విస్తృత జాతీయ ధోరణులు విధానపరంగా తక్షణం తీసుకోవల్సిన జాగ్రత్తలను సూచిస్తున్నాయి.సైబర్ నేరాల పెరుగుదల, షెడ్యూల్డ్ తెగలవారిపై తీవ్రంగా పేరిగిన నేరాలు, మహిళలు, చిన్నపిల్లలపై నేరాల ప్రభావం ఈ నివేదికలో సుస్పష్టమయ్యాయి. ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి ఈ నేరాలు భిన్నంగా ఉన్నాయి. జాతిపరమైన హింసాకాండ, డిజిటల్ విస్తరణతో పెరిగిన సైబర్ నేరాలు, నేరాలను అరికట్టడంలో సంస్థాగత బలహీనతలు ఈ ప్రాంతాన్ని సాంప్రదాయ, కొత్తనేరాల కేంద్రాలుగామార్చాయి. మణిపూర్‌లో జాతుల పరమైన హింస, అసోంలో పెరుగుతున్న సైబర్ మోసాలు, అనేక రాష్ట్రాలలో మహిళలు, పిల్లలపై పెరుగుతున్న నేరాలు మొత్తంమీద ఈ సమాజాలను, పాలనా యంత్రాంగాలను తీవ్ర వత్తిడికి గురిచేస్తున్నాయి.
2023లో భారతదేశం అంతటా షెడ్యూల్డ్ తెగల (ఎస్‌టిలు)పై నేరాలు 28.8 శాతం పెరిగాయని ఎన్‌సిఆర్‌బి నివేదిక స్పష్టం చేసింది. ఇదేదో ప్రమాదవశాత్తూ పెరిగినది కాదు. ఇది ఓ ప్రాంతంలో తిరుగుబాటుకు అద్దం పడుతోంది. ముఖ్యంగా మణిపూర్‌లో ఎస్‌టిలపై నమోదైన నేరాలు 2022లో ఒకటి ఉంటే, 2023 లో 3,399 నేరాలకు పెరిగాయి. ఈ అసాధారణ పెరుగుదలకు కారణం 2023 మే నుంచి మణిపూర్ రాష్ట్రాన్ని అతలాకుతలంచేసి జాతిపరమైన హింసగా చెప్పవచ్చు. మణిపూర్ సంక్షోభం వేలాదిమందిని నిరాశ్రయులను చేసింది. గిరిజన గృహాలు, సంస్థలు విధ్వంసానికి దారితీసింది. శాంతిభద్రతలు దారుణంగా క్షీణించాయి. పాలకుల అసమర్థతను బహిర్గతం చేసింది. మణిపూర్‌లో హింసను తరచుగా జాతి ఘర్షణగా చిత్రీకరించినా అక్కడ హత్యలు, దాడులు గృహ దహనాలు, లైంగిక నేరాలు, ఆస్తుల దోపిడీ వంటి దారుణమైన నేరాలు జరిగాయి. గిరిజన జనాభాను తీవ్రంగా ఇబ్బందుల పాలు చేశాయని ఎన్‌సిఆర్‌బి డేటా స్పష్టం చేస్తోంది. ఈ గణాంకాలు అక్కడి ప్రజల బాధలకు కొలమానాలు, అసమర్థ పాలకుల పనితీరుకు నిదర్శనాలు.
మణిపూర్‌తో పాటు మధ్యప్రదేశ్ , రాజస్థాన్‌లోనూ గిరిజనులపై అధికంగా నేరాలు జరిగినట్లు నమోదైంది. అయితే మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లోని గిరిజనులపై జరిగిన దాడులకు, ఈశాన్యప్రాంతంలో దాడులకు తేడా ఉంది. ఈశాన్య రాష్ట్రాలలో గిరిజనులు మెజారిటీ సంఖ్యలో ఉన్నారు.అందువల్ల ఇక్కడి గిరిజనులపై నేరాలు స్వల్ప సంఘటనలు కావు, బహుళ జాతులలో తీవ్ర ఉద్రిక్తతలకు సంకేతం. రాజకీయాలను, వనరులకు సంబంధించిన ఘర్షణలను తీవ్రతరం చేస్తాయి. అసోం, మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో గిరిజనుల గుర్తింపు రాజకీయాలు, భూమి పరులపాలు చేయడం, వలసల వంటి ప్రశ్నలతో ముడిపడి ఉంది. అందువల్ల ఎన్‌సిఆర్‌బి డేటాను శాంతిభద్రతల సమస్యలుగా కాక, పాలనాపరమైన, విధానపరమైన నిర్లక్ష్యానికి సంకేతంగా చూడాలి. స్పష్టమైన రక్షణాపరమైన యంత్రాంగం లేకపోవడం, సామాజికపరమైన హింసపై నెమ్మదిగా స్పందించడం వల్ల గిరిజనుల ఉనికికి ముప్పు ఏర్పడింది. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి.ఎన్‌సిఆర్‌బి డేటా ప్రకారం 2023 లో దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు 31.2 శాతం పెరిగిపోయాయి. దేశంలో డిజిటల్ పోలీసింగ్ మౌలిక సదుపాయాల కొరత ఇందుకు ప్రధాన కారణం. సైబర్ నేరాల స్థాయిని ఈ డేటా పూర్తిగా ప్రతిబింబించడం లేదు. ఈశాన్య భారతంలో ఈ మధ్య విపరీతంగా విస్తరించిన ఇంటర్‌నెట్ వ్యాప్తి, సైబర్ నేరాలను అరికట్టే చట్టపరమైన సంస్థలకు పెను సవాల్‌గా మారాయి. డిజిటల్ ఇండియా ప్రచారం, స్మార్ట్ ఫోన్లు, డిజిటల్ చెల్లింపు వ్యవస్థల విస్తరణ కొత్త సమస్యలను సృష్టించింది. అసోం, మేఘాలయ, నాగాలాండ్‌లలో ఆర్థిక మోసాలు, ఫిషింగ్ మోసాలు, ఆన్‌లైన్ ఉద్యోగాల రాకెట్లు, సోషల్ మీడియా దుర్వినియోగంవల్ల లైంగికపరమైన నేరాలు పెరిగిపోయాయని పోలీసు నివేదికలు చెబుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాలలో సైబర్ నేరాలు అరికట్టడంలో శిక్షణ పొందిన సిబ్బంది, ఫోరెన్సిక్ ల్యాబ్‌ల కొరత తీవ్రంగా ఉంది. సైబర్ నేరాలు సర్వవ్యాప్తి అవుతున్నాయని ఎన్‌సిఆర్‌బి హెచ్చరిక ఇక్కడ గుర్తు చేసుకోవాలి. సాధారణ నేరాలపై దృష్టి పెట్టే పోలీసు వ్యవస్థలు, ఆన్‌లైన్ మోసం, వేధింపులు వంటి నేరాల పరిష్కారంలో ఇబ్బందిపడుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల ప్రజలలో సైబర్‌నేరాలపట్ల అవగాహన పెంచేందుకు ప్రచారం, డిజిటల్ అక్షరాస్యత, పాఠశాల స్థాయిలో సైబర్ నేరాల పట్ల భద్రత బోధించే విద్య తక్కువగా ఉన్నాయి. డిజిటల్ విస్తరణ వేగానికి, డిజిటల్‌పరమైన నేరాలను అరికట్టే యంత్రాంగానికి మధ్య పొంతన లేదు. నేరాలను అరికట్టే యంత్రాంగం కన్నా ఎన్నో రెట్ల వేగంతో నేరస్థులు దోపిడీ చేసేస్తున్నారు.
2023లో పిల్లలపై నేరాలు 9.2 శాతం పెరిగాయని, దేశవ్యాప్తంగా 1,77,335 కేసులు నమోదయ్యాయని ఎన్‌సిఆర్‌బి నివేదిక హెచ్చరిస్తోంది. 96 శాతం కేసులలో నేరస్థులు బాధితులకు బాగా పరిచయమున్నవారు. పిల్లలపై అత్యాచారాలు ఎక్కువగా ఇళ్లు, పాఠశాలల పొరుగునే ఉన్న ప్రాంతాలలో జరుగుతున్నాయని చెబుతోంది. ఈశాన్య రాష్ట్రాలలోనూ ఈ నేరాలు ఎక్కువే. చట్టపరంగా నిషేధం ఉన్నా, అసోంలో బాల్యవివాహాలు, పిల్లల లైంగిక వేధింపుల రేటు దేశంలోనే అత్యధికం. లైంగిక నేరాలనుంచి పిల్లల రక్షణ చట్టం (పోస్కో) ముఖ్యంగా టీనేజ్‌లో పరస్పర అంగీకారంతో కూడిన సంబంధాల విషయంలో దుర్వినియోగం చర్చలకు దారితీసింది. ఈ నేరాల విషయంలో పిల్లలకు, పెద్దలకూ కూడా అవగాహన పెంచాల్సిన తక్షణ ఆవశ్యకతను ఎన్‌సిఆర్‌బి స్పష్టం చేసింది. ఇక్కడి సామాజిక కట్టుబాట్ల కారణంగా బాధితులు బయటకు చెప్పుకోలేని పరిస్థితి. మహిళలపై నేరాలు జాతీయ స్థాయిలో 0.4 శాతం అంటే స్వల్పంగా పెరిగాయి. వరకట్నాలకు సంబంధించిన మరణాలు మాత్రం 14.9 శాతం పెరిగాయి. హిందీ మాట్లాడే రాష్ట్రాలతో పోలిస్తే, ఇక్కడ వరకట్నాలు తక్కువే. కానీ, మహిళలపై హింస, గృహ హింస, లైంగిక వేధింపులు, ఆడపిల్లల అక్రమ రవాణా తీవ్రస్థాయిలోనే ఉంది. మానవ అక్రమ రవాణా కేసులు నమోదైన రాష్ట్రాలలో దేశంలోనే అసోం ఒకటి. మహిళలు, మైనర్ల శ్రమదోపిడీ, లైంగిక దోపిడీ కోసం రాష్ట్ర, జాతీయ సరిహద్దులను దాటి మానవ రవాణా చేస్తున్నారు.
ఎన్‌సిఆర్‌బి నివేదిక ఓ ఏడాది ఆలస్యంగా వెలుగులోకి రావడం, డేటా, సేకరణ, సర్వేలు, జనాభా లెక్కలలో వెనుకబాటుతనాన్ని ప్రతిబింబిస్తోంది. ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి సకాలంలో డేటా చాలా ముఖ్యం. ఈ ప్రాంత భద్రతా వాతావరణం అస్థిరంగా ఉంది. తిరుగుబాటు జ్ఞాపకాలు, జాతిపరమైన లోపాలు, మాదకద్రవ్యాల వ్యాపారం, రవాణా వివరాలు నిరంతరం మారుతూ ఉంటాయి. తాజా లెక్కలు తెలిస్తే, అసలు నిజం తెలుస్తుంది. ఈ ప్రాంతంలో పోలీసు సిబ్బంది కొరత, శిక్షణ లేకపోవడం పెద్దలోపం. 2023లో మణిపూర్‌లో వైఫల్యాలు రాజకీయ, మతపరమైన ఒత్తిడిలో చట్టం అమలు ఎంత దారుణంగా విఫలమవుతుందో తేటతెల్లం చేస్తుంది. కేంద్ర, రాష్ట్ర సంస్థలు ఏజెన్సీల మధ్య సమన్వయం లేకపోవడం వ్యవస్థను మరింత బలహీనపరుస్తోంది. సరిహద్దు నేరాలు ఈశాన్య భారతం, బంగ్లాదేశ్, మయన్మార్ అంతటా నెట్‌వర్క్ కలిగిన నేరస్థులకు కళ్లెం వేసేందుకు పటిష్టమైన నిఘా అవసరం. విదేశీ సర్వర్‌ల ద్వారా సాగే సైబర్ నేరాలను అరికట్టేందుకు, సిఇఆర్‌టి -ఇన్, సిబిఐకు చెందిన సైబర్ యూనిట్ వంటి జాతీయ సంస్థల సహకారం ఎంతైనా అవసరం.
ఈశాన్య రాష్ట్రాల దృక్కోణం నుంచి ఎన్‌సిఆర్‌బి 2023 నివేదికను పరిశీలిస్తే మూడు సందేశాలు అందుతాయి. 1. పాలనాపరమైన వైఫల్యం దుర్బలత్వాన్ని పెంచుతుంది. జాతి ఘర్షణలను రాజకీయంగా, పాలనాపరంగా పరిష్కరించకపోతే, నేరపూరిత విపత్తులుగా మారతాయని మణిపూర్ హింస స్పష్టం చేస్తుంది. ముందుగానే ఘర్షణలను పరిష్కరించడం, సమాజ పరంగా సంభాషణలు జరపడం, తటస్థ పోలీసింగ్‌తో కూడిన యంత్రాంగం నిర్మాణం అవసరం. 2. డిజిటల్ నేరాలకు కళ్లెం వేసేందుకు డిజిటల్ పాలనా యంత్రాంగం అవసరం. సాధారణ పోలీసులు వాటిని అరికట్టలేరు. ఈశాన్య రాష్ట్రాలలో సైబర్ ల్యాబ్‌లు, డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమాలు, సైబర్ అవగాహనకోసం ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యాలలో పెట్టుబడి పెట్టాలి. స్కూళ్లు, కాలేజీల్లో పాఠ్యాంశాల్లో డిజిటల్ విజ్ఞానం చేర్చి, విద్యార్థులలో సైబర్ నేరాల వైపు పోకుండా అవగాహన పెంచాలి. 3. పేద, బలహీన వర్గాలను రక్షించేందుకు చట్టపరమైన సంస్కరణలతోపాటు, సామాజిక సంస్కరణలు కూడా అవసరం. పోస్కో, వరకట్న నిషేధ చట్టం వంటి వాటిని సున్నితంగా అమలు చేయాలి. ఎన్‌సిఆర్‌బి 2023 డేటా కేవలం లెక్కలు అని కొట్టి పారేయకూడదు. అది అభివృద్ధి చెందుతున్న సమాజం ఆందోళనలకు అద్దం. ప్రభుత్వాలు, చట్టం అమలు చేసే సంస్థలు, పౌరసమాజం ముందున్న సవాల్ ఏమిటంటే, ఈ లెక్కలను పరిమితి చేసి, భద్రత, న్యాయబద్ధమైన విధానాన్ని అనుసరించడం. ఎన్‌సిఆర్‌బి నివేదిక నేరాల గురించి కన్నా పాలనా సంక్షోభం గురించి ఎక్కువ చర్చించింది. ఈశాన్య భారతంలో ఉన్నంత పాలనా పరమైన సంక్షోభం భారతదేశంలో ఎక్కడా కన్పించదు. ఈ సంక్షోభాన్ని, సమస్యను తక్షణం పరిష్కరించడం ఎంతైనా అవసరం.
గీతార్థ పాఠక్