టీం ఇండియా మరికొన్ని రోజుల్లో ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ సిరీస్‌కి ఓ ప్రత్యేకత ఉంది. దేశ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫేవరెట్ క్రికెర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఈ వన్డే సిరీస్‌తో మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వీరిద్దరు మళ్లీ మైదానంలో అడుగుపెట్టలేదు. అక్టోబర్ 19న పెర్త్ వేదికగా తొలి వన్డే జరుగనుంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ ఫామ్ గురించి అంతటా చర్చ జరుగుతోంది. అయితే మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కోహ్లీ ఫామ్ గురించి ఆందోళణ చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు.
‘‘ప్రస్తుత క్రికెటర్లలో ఫిట్‌నెస్ విషయంలో కోహ్లీనే నెంబర్.1. ఆ విషయంలో అతడు మిస్టర్ పర్‌ఫెక్ట్. అతడి ఆట చూసేందుకు ఎదురుచూస్తున్నా. విరాట్ మరింత కాలం వన్డేల్లో కొనసాగాలని కోరుతున్నా. ఆస్ట్రేలియా కోహ్లీకి ఇష్టమైన ప్రదేశం. అక్కడ కొన్ని టన్నుల కొద్దీ పరుగులు రాబట్టాడు. మరోసారి రాణిస్తాడు. మూడు మ్యాచుల్లో కనీసం రెండు సెంచరీలు చేస్తాడని ఆశిస్తున్నా. రోహిత్ కూడా మంచి ప్రదర్శన చేసి జట్టు విజయానికి తోడ్పడాలని ఆశిస్తున్నా’’ అని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లీ 29 వన్డేలు ఆడి.. 51.03 సగటుతో 1,327 పరుగులు చేశాడు. అందులో ఐదు సెంచరీలు, 6 అర్థ శతకాలు ఉన్నాయి.