టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ తనని తాను నిరూపించుకోవడానికి కెరీర్ మొదటి నుంచి కృషి చేస్తున్నాడు. ఇప్పటికే ఎన్నో అవకాశాలు వచ్చినా.. అతని కెరీర్ మాత్రం ఇంకా సెట్ కాలేదు అనే చెప్పుకోవాలి. ఐపిఎల్‌లో అడపదడప మ్యాచ్‌లు ఆడిన అర్జున్ దేశవాళి క్రికెట్‌లో మాత్రం సత్తా చాటాడు. కానీ, గత ఏడాదిగా అతడు మైదానంకి దూరమయ్యాడు. అయితే తాజాగా అర్జున్‌ని ఓ సువర్ణావకాశం వరించింది. రంజీ ట్రోఫీ 2025-26కి గాను గోవా జట్టులో అతడికి చోటు దక్కింది. దీంతో గత ఏడాది డిసెంబర్ తర్వాత అర్జున్ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఐపిఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టులో అర్జున్ భాగమైనప్పటికీ.. అతడికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. అర్జున్ ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ను చివరిగా అరుణాచల్ ప్రదేశ్‌తో ఆడాడు.
2025-26 సీజన్‌లో గోవా ఎలైట్ గ్రూప్‌లో భాగంగా ఉంది. అక్టోబర్ 15న తమ తొలి మ్యాచ్‌లో చండీగఢ్‌తో తలపడుతోంది. ఆ తర్వాత మ్యాచ్‌లలో కర్ణాటక, పంజాబ్, మధ్యప్రదేశ్, సౌరాష్ట్ర, మహారాష్ట్ర, కేరళతో గోవా ఆడనుంది. ఈ టోర్నీలో గోవా క్రికెట్ జట్టుకు దీప్రాజ్ గావోంకర్ నాయకత్వం వహిస్తున్నాడు. కొత్త సీజన్‌కి ముందు ఢిల్లీ నుంచి గోవాకి మకాం మార్చిన స్టార్ ఆల్ రౌండర్ లలిత్ యాదవ్‌కు కూడా ఈ జట్టులో చోటు దక్కింది.