చిరాగ్ ఎల్‌జిపికి 29 చోట్ల అవకాశం
మాంజీ, కుశావా పార్టీలకు ఆరేసి సీట్లు
ఎక్కువ సీట్ల కోసం చిరాగ్ బేరసారాలు
న్యూఢిల్లీ / పాట్నా : బీహార్‌లో ఎన్‌డిఎ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సన్నద్ధం అయింది. ఈ దిశలో అత్యంత కీలకమైన సీట్ల సర్దుబాటు ఖరారు అయింది.ఈ మేరకు బిజెపి, జెడియులు చెరిసగం అంటే 101 స్థానాలలో పోటీకి దిగుతాయి. కాగా ఎన్‌డిఎలో అంతర్భాగమైన కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు చెందిన లోక్‌జనశక్తి పార్టీ (ఎల్‌జెపి) 29 స్థానాలలో బరిలోకి దిగుతుంది. ఈ క్రమంలో తమ కూటమి భాగస్వామ్యపక్షాలలో పూర్తి స్థాయిలో సీట్ల ఖరారు జరిగిందని కేంద్ర మంత్రి, బీహార్ ఎన్నికలకు బిజెపి ఇన్‌చార్జి ధర్మేంద్ర ప్రధాన్ ఆదివారం విలేకరులకు చెప్పారు. ఇప్పుడు కుదిరిన అవగావహన మేరకు కూటమిలోని ఇతర చిన్నపార్టీలు కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంజీ నాయకత్వపు హిందూస్థానీ అవామీ మోర్చా( హామ్) ఆరు స్థానాల్లో, ఉపేంద్ర కుశావా సారధ్యపు రాష్ట్రీయ లోక్ మోర్చా ఆరు స్థానాల్లో పోటీకి వీలు కల్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి ఇతర సీనియర్ నేతలతో కూడిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ కూడా సీట్ల సర్దుబాట్ల ప్రక్రియ ముగిసిందనే విషయాన్ని తెలిపింది.
సామరస్య, సృహద్భావపూరిత వాతావరణంలో అన్ని పార్టీలూ సీట్ల పంపిణీకి అంగీకారం తెలిపాయి. ఎన్‌డిఎ నాయకులు, కార్యకర్తలు ఈ సర్దుబాట్ల ప్రక్రియ పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మరోసారి బీహార్ ఎన్‌డిఎ సర్కారు పరిధిలోకి వచ్చేందుకు రంగం సిద్ధం అయిందని కేంద్ర ఎన్నికల కమిటీ తెలిపింది. సీట్ల విషయంలో ఈసారి బిజెపికి చిరాగ్ పాశ్వాన్ పార్టీ, మాంజీ, కుషావాలు ఒకటి రెండు రోజులు చుక్కలు చూపారు. ఎక్కువ సంఖ్యలో సీట్లు కోసం పట్టుపట్టారు. క్రమేపీ బిజెపి సీనియర్ నేతలు, కేంద్ర మంత్రులు పలువురు వారిని రాజీ మార్గానికి తీసుకువచ్చినట్లు వెల్లడైంది. బీహార్‌లో ఎన్‌డిఎకు, ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాఘట్‌బంధన్‌కు మధ్య పోటీ నెలకొని ఉంది.
కేంద్ర మంత్రి పాశ్వాన్ తమ పార్టీకి పది అంతకు మించి ఇవ్వాల్సిందే అని, లేకపోతే తమ పార్టీ ప్రాబల్యం సన్నగిల్లుతుందని వాదించినట్లు తెలిసింది. బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నవంబర్ 6, 11 తేదీలలో రెండు దశల్లో ఇక్కడ పోలింగ్ జరుగుతుంది. 14న ఓట్ల లెక్కింపు , ఫలితాల వెల్లడి జరుగుతుంది. చాలా రోజుల ముందునుంచే బీహార్‌ను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం పలు పథకాలు ప్రవేశపెట్టడం, అనేక రైల్వే లైన్ల వరాలు ప్రకటించడంతో ఈసారి ఎన్‌డిఎ తిరిగి ప్రజల వద్దకు వీటి ఆసరాతో ముందుకు వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్‌కు చెందిన జెడియు 115 స్థానాల్లో , బిజెపి 110 స్థానాల్లో పోటీ చేశాయి. కాగా అప్పుడు చిరాన్ పాశ్వాన్‌కు చెందిన ఎల్‌జెపి ఎన్‌డిఎతో సంబంధం లేకుండా విడిగా బరిలోకి దిగింది. ఇక ప్రతిపక్ష మహాఘట్ బంధన్ సీట్ల సర్దుబాట్ల చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఆర్జేడీ 130కి మించి సీట్లకు పట్టుతో ఉంది. కాంగ్రెస్‌కు 50 సీట్లు అంటోంది. ఈ విషయం తేలాల్సి ఉంది.