షేక్‌పేట్ తహసీల్దారు కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ
నామినేషన్లకు 21వ తేదీ తుది గడువు
నవంబర్ 11న ఉపఎన్నిక పోలింగ్.. నవంబర్ 14న కౌంటింగ్
మన తెలంగాణ/సిటీ బ్యూరో: జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించిన ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేయనున్నది. నేటి నుండి అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల అధికారులు స్వీకరించనున్నారు. ఈ నెల 21వ తేదీ సా.3 గం.ల వరకు నామినేషన్లకు తుది గడువుగా నిర్ణయించారు. 22న నామినేషన్ల పరిశీలన (స్కృటినీ), ఈ నెల 24 వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగనుంది.
ఉపఎన్నిక పోలింగ్ నవంబర్ 11న జరుగనుంది. నవంబర్ 14వ తేదీన కౌంటింగ్ చేపట్టనున్నారు. షేక్‌పేట్ తహసీల్దారు కార్యాలయాన్ని నామినేషన్లను స్వీకరించేందుకు ఎన్నికల కార్యాలయంగా ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 3,98,982 ఉన్నారు. వీరిలో పురుషులు 2,07,367. స్త్రీలు 1,91,590, ఇతరులు 25 మంది ఓటర్లున్నారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక నామినేషన్ దాఖలు సమయంలో ఆర్‌ఓ లేదా ఏఆర్‌ఓ కార్యాలయానికి 100 మీటర్ల పరిధిలో గరిష్టంగా 3 వాహనాలు కన్నా మించి వాహనాలను అనుమతించరు. నామినేషన్ సమర్పించే సమయంలో గరిష్టంగా 5 (అభ్యర్థి సహా)మంది వ్యక్తులనుమాత్రమే అనుమతిస్తారు. ఒకే ప్రవేశ మార్గం ద్వారానే వెళ్ళాల్సి ఉంది. భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించిన నామినేషన్ మార్గదర్శకాలను జిల్లా ఎన్నికల అధికారులు జారీచేశారు.
ఆన్‌లైన్ ద్వారా..
గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థులు ఇది నియోజకవర్గానికి చెందిన ఓటరైనఒక్కరిని ప్రతిపాదకుడిగా తీసుకోవచ్చునని తెలిపారు.- స్వతంత్ర/గుర్తింపులేని పార్టీ అభ్యర్థులు నామినేషన్‌లో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన పదిమంది ఓటర్లను ప్రతిపాదకులుగా తీసుకోవాలి.- ఇతర నియోజకవర్గ అభ్యర్థులు.. సంబంధిత ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుండి ఓటర్ల వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఈఎన్‌సిఓఆర్‌ఈ పోర్టల్ ద్వారా డిజిటల్ నామినేషన్‌ను అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://encore.eci.gov.in ద్వారా నామినేషన్ ఫారం ఆన్లైన్‌లో నింపవచ్చునని అధికారులు తెలిపారు. క్యూఆర్ కోడ్‌తో కూడిన ప్రింటెడ్ హార్డ్ కాపీ తప్పనిసరిగా సమర్పించాలి.
ఎన్నికల వ్యయ పర్యవేక్షకుడిగా సంజీవ్ కుమార్
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసిఐ) ఐఆర్‌ఎస్ అధికారి సంజీవ్‌కుమార్ లా ల్‌ను ఎన్నికల వ్యయ పర్యవేక్షకుడిగా నియమించింది.ఎన్నికల వ్యయ పర్యవేక్షకులు ఎన్నికల ఖ ర్చుల పర్యవేక్షణలో భాగంగా అన్ని కార్యకలాపాలను సమీక్షించడంతో పాటు, ఎన్నికల వ్యయం పై కట్టుదిట్టమైన పర్యవేక్షణను కొనసాగిస్తారు.