మన తెలంగాణ/హైదరాబాద్‌ః గత కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న చేవెళ్ళ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ జర్నలిస్టు కొండా లక్ష్మారెడ్డి సోమవారం ఉదయం 5.30 గంటలకు కన్నుమూశారు. ఆయనకు భార్య సరళ, కుమారుడు విజిత్ రెడ్డి, కుమార్తె ప్రతిమా రెడ్డి ఉన్నారు. లోగడ ఆయన వార్తా సంస్థను స్థాపించినందున ఎన్‌ఎస్‌ఎస్ లక్ష్మారెడ్డిగా గుర్తింపు పొందారు. లకా్ష్మరెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
చేవెళ్ళ ఎమ్మెల్యేగా, ఎన్‌ఎస్‌ఎస్ వార్తా సంస్థ స్థాపకుడిగా, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా, జూబ్లీహిల్స్ జర్నలిస్టు కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షునిగా ఆయన సేవలందించారని ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి కొనియాడారు. లక్ష్మారెడ్డి మృతి పట్ల ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఇంకా అనేక రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి లక్ష్మారెడ్డి నివాసానికి చేరుకుని సంతాపం వ్యక్తం చేశారు.
మహాప్రస్థానంలో అంత్యక్రియలు
లక్ష్మారెడ్డి భౌతికకాయానికి సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. లక్ష్మారెడ్డి సమీప బంధువు చేవెళ్ళ నియోజకవర్గం బిజెపి లోక్‌సభ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మల్కాజిగిరి లోక్‌సభ సభ్యుడు ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ ఎన్. శ్రీనివాస్ రెడ్డి, మన తెలంగాణ దినపత్రిక ఎడిటర్ దేవులపల్లి అమర్ తదితరులు హాజరయ్యారు.