నివాళి: ప్రముఖ కవియిత్రి ఎన్.అరుణ ఇటీవల మరణించారు. స్త్రీలు, బాధిత ప్రజల పక్షం వహించిన తెలుగు, సాహిత్యంలో తనదైన ముద్రను వేసిన అరుణకి ‘మెహఫిల్’ నివాళిని అర్పిస్తున్నది.
అరుణ కవిత్వం ఎగిసిపడే ఉద్వేగ సముద్రం కాదు. యవ్వన ఉద్రేకంతో మిడిసిపడే కవిత్వం కాదు. ఒక పరిణత మనస్కురాలు. జీవన పార్శ్వలన్నీ చవిచూసి, తాత్విక మూలాలను ఒడిసిపట్టి, నిండైన నదీ ప్రవాహంలా సాగిన స్వచ్ఛ పరిణత వాణి. ఇల్లంతా పుస్తకాలతో, సాహిత్య చర్చోపచర్చలతో నిత్యం కొనసాగిన కాలంలో మౌనంగా అన్ని ఉద్వేగాలను, ఉద్దేశాలను పరిశీలించింది. జీవన బాధ్యతలు విజయవంతంగా పూర్తి చేసుకొని నిమ్మళంగా, నిర్మలంగా మౌనం మాట్లాడుతుందని మన ముందుకు వచ్చిన కవయిత్రి ఎన్.అరు ణ. ఇంట్లో మహాకవి ఎన్. గోపి సహచర్యంలో ఉన్నా తనదైన శైలిని దృష్టిని అలవర్చుకొని కవిత్వ రచనకు పూనుకొని అనతి కాలంలోనే విభిన్నమైన కవిత వస్తువుల తో, శైలితో ఏడు కవితా సంపుటాలు ప్రచురించి పాఠకుల మన్ననలు పొందింది.
మౌనమూ మాట్లాడుతుంది, పాటల చెట్టు, గు ప్పెడు గింజలు, (నానీలు) అమ్మ ఒక మనిషి, హృదయమే వదనం, సూది నా జీవన సూత్రం, నిరీక్షనే ఒక గాయం ప్రచురితమైన వచన కవితా సంపుటాలు. అందులో ఎన్.గోపి సృష్టించిన నానీల ప్రభంజనానికి అరుణ కూడా లోనై గుప్పెడు గింజలు నానీలను వెలువరించడం మినహాయిస్తే, మిగతా సంపుటాలు ఆమె ఆలోచనా ధోరణికి, జీవన మూలాల అధ్యయనానికి, తాత్విక భూమికకు అద్దంపట్టేవి. శైలి వస్తు విన్యాసాలు ఆమె తనదైన పద్ధతిలో సృష్టించుకున్నవే. డాక్టర్ వై.రామకృష్ణారావు అన్నట్లు ‘అరుణ కవిత్వంలో సున్నితమైన కసి, అంతర్లీనం గా వేదన, ఒక మెలంకలి, చమత్కారపు మెరమెచ్చుల జోలికి పోనీ సీరియస్ కవిత్వం ఆగుపిస్తుంది. అభివ్యక్తిలో కనిపించే విభిన్నత పాఠకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. ఎంతోమంది కవులు కవితావిర్భావాన్ని ప్రసవ వేదన తో పోలుస్తూ ఎన్నెన్నో రచనలు చేశారు కానీ అరుణ ఇచ్చిన దృశ్యరూపం కవిత్వంలో భిన్నమైనది కొత్తది కూడా.
‘ద స్మైల్’ కవితలో అందరి ఆడపిల్లల్లాగా పుట్టింటిని వదిలి వచ్చిన అనుభవాన్ని అరుణ ఎంత సరళంగా అనువదించారో చూడండి ‘ఈ దారిలోనే అనుకుంటా నా చిరునవ్వులు ఎక్కడో రాలిపోయాయి’ అంటూ మొదలవుతుంది నెమ్మదిగా కవిత ‘కలలు, కన్నీళ్లు, లగేజీ అంతా భద్రంమరి చిరునవ్వులే మిస్సింగ్’ అంటూ కనిపించని వేదనని కళ్ళకు కట్టిస్తారు.
అందరూ కవుల్లాగానే అరుణ కూడా గత అనుభవాలను నెమరువేసుకుంటుంది. అది తనదైన ప్రత్యేకమైన ఆడపిల్ల ఆర్ద్రతతో ఇలా ‘బావిలోంచి ఒక్కొక్క చేద బయట పడేస్తుంటే, దానిలో మా నాన్న చెమట చుక్కలు కలిసి ఉండేవి’ ఈ అనుభూతిలోని స్వచ్ఛత మనల్ని మన గతాన్ని తడిమి చూసేలా చేస్తుంది మరోచోట ఇలానే ‘ఒకప్పుడు పల్లె భుజాలపై పక్షుల కలకలం ఇప్పుడు రైతులు పల్లె విడిచి పోతున్న వలస విహంగాలు’ అంటూ ఒకప్పటి తెలంగాణ కరువు వలసల ప్రభావాన్ని దృశ్శీకరిస్తారు. ‘అస్తిత్వ ప్రభలు’ కవితలో ఈ దేశంలో స్త్రీల ధైన్యానికి అద్దం పట్టే కవితా పంక్తులు ఉన్నాయి. అరుణ కవిత్వంలో నోస్టాలజీకి ఒక ప్రత్యేకత ఉంది.
వస్తు వినియోగం పెరిగిన సామాజిక నేపథ్యం లో అందరి ఇండ్లు వస్తువులతో నిండిపోయా యి. ఆదృశ్యాన్ని ఇలా ‘ఇంట్లో ఇల్లు కనిపించడం లేదు దేహంలో ఆత్మలాగా’ అంటుంది. చిన్నచిన్న మాటలతో మనల్ని లోలోపలికి తొంగి చూసుకొనేలా చేస్తుంది. ఎన్.అరుణ కవిత్వం ‘మడతలు శరీరానికే గానీ మనసుకు కాదని, వార్ధక్యం వయసుకే గాని అనుబంధాల కు కాదని ఇన్నాళ్లకు తెలిసిందంటూ’ ఆలస్యం గా కవితా రంగంలో ప్రవేశించిన ఎన్.అరుణ అచ్చమైన తాత్విక, వస్తు, వైవిద్యభరితమైన కవిత్వాన్ని సృష్టించింది. కొంతకాలం అనారోగ్యం తో ఉండి రాయవలసినంత కవిత్వం రాయకుండానే మన మధ్య నుండి మరో లోకానికి వెళ్లిపోయింది. వారు లేకున్నా వారి కవితా కాంతి భావితరాలకు దిక్సూచిలా నిలుస్తుందని ప్రగాఢంగా నమ్ముతున్నాను.
– కోట్ల వెంకటేశ్వరరెడ్డి