యువ హీరోలలో సిద్ధూ జొన్నలగడ్డకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కెరీర్ ఆరంభంలో చేసిన కొన్ని చిత్రాలకు అంత ఆదరణ లభించకపోయినా.. ‘డిజె టిల్లు’ సినిమాతో తన సత్తా నిరూపించుకున్నాడు సిద్ధూ. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని ‘టిల్లు స్క్వేర్’ అనే సినిమాతో పలకరించాడు. ఈ సినిమా అంతంత మాత్రంగా ఆడింది. అయితే ప్రస్తుతం సిద్ధూ చేస్తున్న చిత్రం ‘తెలుసు కదా’. రొమాంటిక్ కామెడి జానర్‌లో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాతో ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజా కోనా దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా అప్‌డేట్స్ అన్ని ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యం ఈ సినిమా నుంచి వచ్చిన ‘మల్లిక గంధ’ అనే పాట సూపర్ హిట్ అయింది. సోమవారం ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇద్దరు ప్రేయసుల నడుమ చిక్కుకుపోయిన ప్రియుడి కథ ఇది అని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ సినిమాలో రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టిలు హీరోయిన్లుగా నటిస్తుండగా.. వైవా హర్ష కీలక పాత్ర పోషిస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. దీపావళి కానుకగా ఈ సినిమా అక్టోబర్ 17వ తేదీన విడుదల కానుంది.