స్టాక్‌హోమ్ : ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి లభించింది. జోయెల్ మోకిర్, ఫిటర్ హౌవీట్, ఫిలిప్ అఘియన్‌లు ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి దక్కించుకున్నారు. ఆవిష్కరణ ఆధారిత ఆర్థిక వృద్ధిపై పరిశోధనకు ముగ్గురికి ఆర్థికశాస్త్ర నోబెల్ పురస్కారం లభించింది. అమెరికా నుంచి ఓయెల్ మోకిర్, ఫ్రాన్స్ నుంచి ఫిలిప్ అఘియోన్, కెనడా నుంచి ఫిటర్ హోవిట్‌లకు 2025 ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని సంయుక్తంగా పొందారు. సాంకేతిక పురోగతి ద్వారా స్థిరమైన వృద్ధికి ముందస్తు అవసరాలను గుర్తించినందుకు జోయెల్ మోకిర్ ఈ అవార్డుకు ఎంపిక కాగా, క్రియేటివ్ డిస్ట్రక్షన్ ద్వారా నిరంతర వృద్ధి సిద్ధాంతానికి గాను మిగిలిన ఇద్దరు ఫిటర్‌హౌవీట్, ఫిలిప్ అఘియన్‌లకు నోబెల్ ప్రకటించారు.
ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు ఆవిష్కరణల ద్వారానే దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుందని నిరూపించారు. ప్రభుత్వాలు పరిశోధన, అభివృద్ధి రంగాల్లో పెట్టుబడులు పెంచితే , ఆవిష్కరణలు వేగంగా జరుగుతాయని వీరి అధ్యయనం చూపించింది. మార్కెట్ పోటీ, మేధో సంపత్తి హక్కులు, విద్యాసంస్థల బలోపేతం, వంటి అంశాలు ఆవిష్కరణలకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తాయని వీరు వివరించారు.
ఓఈసీడీ, ఐఎంఎఫ్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఈ పరిశోధనల ఆధారంగా తమ విధానాలను మలచుకుంటున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది మార్గదర్శకంగా నిలుస్తోంది. ఈ సందర్భంగా నోబెల్ ఫౌండేషన్ కమిటీ మాట్లాడుతూ ఆవిష్కరణల ప్రేరణతో ఆర్థిక వృద్ధిని సాధించగలమన్న సిద్ధాంతాన్ని ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు శాస్త్రీయంగా నిరూపించారు. ఇది ఆర్థిక విధానాల రూపకల్పనలో విప్లవాత్మక మార్పులకు దోహదపడుతుంది. అని వివరించింది. వైద్య విభాగంతో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రకటన నేటితో ముగిసింది.