చెన్నై: సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తితో భార్య లేచిపోయిందనే కారణంతో భర్త తన ముగ్గురు పిల్లలను గొంతు కోసి చంపాడు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం తంజావూరు జిల్లా మదుక్కూర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గోపాలసముద్రం ప్రాంతంలో వినోద్ కుమార్(38) ఫొటో గ్రాఫర్, డ్రైవర్‌గా సేవలందిస్తున్నాడు. నిత్య అనే యువతిని 15 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. సోషల్ మీడియాలో మన్నార్‌కుడికి చెందిన వ్యక్తితో నిత్యకు పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారడంతో అక్రమ సంబంధానికి దారితీసింది. దీంతో సదరు వ్యక్తితో నిత్య పారిపోయింది. వినోద్ కుమార్ తన భార్య తిరిగి రావాలని పలుమార్లు కోరాడు. ఆమె నిరాకరించడంతో మనస్థాపానికి గురయ్యాడు. శుక్రవారం ఉదయం పిల్లలకు స్వీట్లు తెచ్చాడు. పిల్లలు స్వీట్లు తింటుండగా గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.