నిలదీస్తేనే నిజాలు, ప్రశ్నిస్తేనే వైవిధ్య భారత్
పదేండ్ల కాలంలో తిరోగమన విధానాలతో యువత అధోగతి
చిలీ, పెరూ వర్శిటీలలో విద్యార్థులతో ఇష్టాగోష్టిలో రాహుల్
శాంటియాగో /న్యూఢిల్లీ : భారతదేశంలో స్వతంత్ర ఆలోచనా విధానాలపై , శాస్త్రీయ దృక్పథం, హేతుబద్ధతపై తీవ్రస్థాయి దాడులు జరుగుతున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శింఒచారు. చిలీ పర్యటనకు వెళ్లిన రాహుల్ అక్కడి యూనివర్శిటీలో విద్యార్థులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. పరోక్షంగా మోడీ ప్రభుత్వ తీరుతెన్నులపై విరుచుకుపడ్డారు. కుల వ్యవస్థ కుళ్లు, విద్యావ్యవస్థ లోపాలతో భారతదేశం ఏనాటికీ ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొని ఉందన్నారు. నది పంవత్సరాల కాలంలో భారతీయ విద్యావ్యవస్థపై , యువత ఆలోచనలపై అప్రకటిత దాడి జరుగుతోందని, అణచివేత పరాకాష్టకు చేరిందని కూడా రాహుల్ వ్యాఖ్యానించారు. భారతీయ విద్యా వ్యవస్థ రక్షణ అత్యవసరం, ఇక్కడ అమృత అనే అమ్మాయి లేవనెత్తిన ప్రశ్నకు తాను శాస్త్రీయంగానే సమాధానం ఇస్తానని రాహుల్ తెలిపారు.
భారత్‌లో విద్యావ్యవస్థను పరిరక్షించాల్సి ఉంది. ఇది తనతో పాటు అందరి బాధ్యత అన్నారు. ఇక్కడి విద్యార్థినిలాగా భారత్‌లోని వారు కూడా ప్రశ్నించే స్వేచ్ఛతో ఉండాలి. వారికి ఈ స్వేచ్ఛ కల్పించేలా చేయాలనేదే తన ఆలోచన అని చెప్పారు. అమృత ఇక్కడ నిలదీసినట్లే భారత్‌లో కూడా ఏ అమ్మాయి అయినా పౌరుడు అయినా పలు అంశాలను ప్రస్తావించే పరిస్థితి ఉండాల్సిందే. ధైర్యంగా ఆలోచించగలగాలి, ఎటువంటి అవరోధాలకు వీలుండరాదని ఆయన చెప్పారు. పెరూ లోని పాంటిఫికల్ క్యాథలిక్ యూనివర్శిటీ ఆఫ్ పెరూలో కూడా రాహుల్ ఇటువంటి స్పందన వెలువరించారు. భారత్‌లో విద్యావ్యవస్థ అక్కడ వైవిధ్యతను ప్రతిఫలించేదిగా ఉండాలి. విద్య అనేది కొందరికే చెందే హక్కు కారాదని తెలిపారు. అప్పుడే స్వేచ్ఛ బలోపేతం అవుతుందన్నారు. భారత్‌కు ఓ ప్రత్యామ్నాయ ఉత్పత్తి వ్యవస్థ అవసరం. ఈ దిశలో అమెరికా లేదా పెరూతో సరైన భాగస్వామ్యం దేశ పురోగతికి పనికి వస్తుందన్నారు.
రాహుల్‌పై బిజెపి ఆగ్రహం
పరాయి దేశానికి వెళ్లి భారత్ పరువు తీసేలా మాట్లాడటం తగునా అని రాహుల్ గాంధీపై బిజెపి విరుచుకుపడింది. ఏ ఇతర దేశం వెళ్లినా ఏదో సంచలనం కోసం భారత్‌పై విద్వేషం వ్యక్తం చేయడం ఈ వ్యక్తికి అలవాటు అయిందని బిజెపి అధికారిక ప్రతినిధి షెహజాద్ పూనావాలా విమర్శించారు. అమెరికాలోని కరోలినాలో ఆ మధ్య రాహుల్ భారత్‌లో కొందరు పెట్టుబడిదార్లకు మేలు చేసేలా మోడీ సర్కారు పనిచేస్తోందని, రాజ్యాంగానికి తూట్లుపొడుస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఇప్పుడు చిలీ యూనివర్శిటీలో విద్యార్థుల ఇష్టాగోష్టిలో రాహుల్ భారత్‌లో కుల వ్యవస్థ, విద్యారంగం గురించి చేసిన వ్యాఖ్యానాలను కాంగ్రెస్ మాజీ నేత అయిన పూనావాలా తప్పుపట్టారు. వేరే దేశంలో మన దేశాన్ని కించపరుస్తున్నారని పూనావాలా స్పందించారు. రాహుల్ దేశ ప్రతిపక్ష నేతనా; విద్వేష ప్రచారాల దూతనా అని బిజెపి మండిపడింది.