అగ్రదేశ అధినేత డొనాల్డ్ ట్రంప్‌ను పరాభవభారం వేధించింది. గర్వభంగమైనది. శ్వేతసౌధం నివ్వెరబోయింది. నోబెల్ శాంతి బహుమతి అర్హత గల మహిళనే వరించింది. వెనిజులా ఉక్కు మహిళ మరియా కొరినా మచాడో నోబెల్ శాంతి బహుమతి విజేతగా నిలిచింది. అగ్రదేశాధిపతినన్న అహంకారంతోనో, ప్రపంచాధిపత్యం చాటుకోవాలన్న ఆరాటంతోనో, దుగ్ధతోనో అదిరించి, బెదిరించి, విర్రవీగిన ట్రంప్‌ను నార్వేజియన్ నోబెల్ శాంతి కమిటీ నిరాకరించింది. ఎలాంటి ఒత్తిళ్ళకు తలొగ్గకుండా సముచిత నిర్ణయం తీసుకుని నోబెల్ కమిటీ ప్రశంసార్హత సాధించింది. నోబెల్ శాంతి బహుమతులతో అమెరికా ఖ్యాతిని పెంచిన థియోడోర్ రూజ్‌వెల్ట్, వుడ్రో విల్సన్, జిమ్మీ కార్టర్, బరాక్ ఒబామాల సరసన నిలబడాలని ఉవ్విళ్ళూరిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆశలపై నీళ్ళుచల్లి, వెనిజులా ప్రజాస్వామ్య హక్కులపై అలుపెరుగని పోరాటం సాగిస్తున్న ఆ దేశ ప్రతిపక్ష నాయకురాలు, పార్లమెంటు సభ్యురాలు, ప్రజాస్వామ్య ఉద్యమకారిణి మరియా కొరినా మచాడోకు 2025 సంవత్సరానికి నోబెల్ శాంతి పురస్కారం ప్రకటించడం హర్షదాయకం.
వచ్చే డిసెంబర్ 10వ తేదీన నార్వే రాజధాని ఓస్లోలో మరియా కొరినాకు నోబెల్ శాంతి బహుమతి ప్రదానం చేయబోతున్నారు.1.2 మిలియన్ డాలర్ల నోబెల్ శాంతి బహుమతి ప్రపంచంలో ఒక అరుదైన గౌరవం. ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి దక్కకపోవడంతో వైట్ హౌస్ నిరాశతో ఇదొక రాజకీయ ప్రేరిత చర్యగా, శాంతిపై రాజకీయాలు సాధించిన విజయంగా పేర్కొనడం విడ్డూరం. వెనిజులాలో ప్రజాస్వామ్య ప్రభుత్వం కోసం, స్వేచ్ఛగా ఎన్నికలు జరగడం కోసం మారియా కొరినా మచాడో ప్రతిపక్షాలన్నింటినీ ఏకత్రాటి పైకి తెచ్చి ఉద్యమిస్తున్న క్రమంలో ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొన్నారు. ప్రాణాలను సైతం పణంగా పెట్టడానికి వెనుకంజ వేయలేదు. న్యాయమైన హక్కుల కోసం, నియంతృత్వంపై ప్రజాస్వామ్యం విజయం సాధించాలనే ధ్యేయంతో ఉద్యమ నాయకురాలిగా, వెనిజులా సిఇ పార్లమెంటు సభ్యురాలిగా శాంతియుత పోరాటం చేస్తూ, మరియా కొరీనా ప్రజల ప్రశంసలందుకుంటూ, వెనిజులా చరిత్రను తిరగరాయడానికి తీవ్రమైన కృషి చేస్తున్నారు.
వెనిజులా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఆర్థిక అంతరాలు విపరీతంగా పెరిగిపోయాయి. కేవలం కొద్దిమంది చేతుల్లోనే సంపదంతా కేంద్రీకృతమైపోయింది. భారీ సంఖ్యలో ప్రజలు పేదరికం తట్టుకోలేక ఇతర దేశాలకు వలసపోతున్నారు. వెనిజులాలో ఇలాంటి అస్తవ్యస్తమైన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో స్వేచ్ఛగా ఎన్నికలు జరగాలని, పారదర్శకమైన ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడాలని మరియా కొరినా అసమాన ధైర్యసాహసాలతో పోరాడుతున్నారు. ఇన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని నార్వేజియన్ నోబెల్ కమిటీ మరియా కొరినా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి ప్రకటించడం జరిగింది. ప్రపంచంలో ఏడు యుద్ధాలను ఆపగలిగానని, ఇది తనకే సాధ్యమైనదని ట్రంప్ గొప్పగా చెప్పుకున్నారు.
ఈజిప్టు- ఇథియోపియా, థాయ్‌లాండ్- కంబోడియా, భారత్- పాక్, ఇజ్రాయెల్ ఇరాన్, ఇజ్రాయిల్- పాలస్తీనా, రువాండా- కాంగో, అజర్ బైజాన్- ఆర్మీనియా తదితర యుద్ధాలను తానే ఆపానంటూ, త్వరలో రష్యా- ఉక్రెయిన్ మధ్య కూడా యుద్ధం ఆగుతుందని ప్రకటిస్తూ, నోబెల్ శాంతి బహుమతి ప్రకటించడానికి ముందు ఇజ్రాయెల్, హమాస్‌ల శాంతి ఒప్పందం కుదిర్చి నోబెల్ కమిటీ దృష్టిలో పడడానికి ట్రంప్ విశ్వప్రయత్నం చేసారు. తుదకు ట్రంప్ ప్రయత్నాలన్నీ విఫలమైనాయి. నోబెల్ శాంతి బహుమతి చేజారిపోయింది. భారత్ వంటి దేశాలను టారిఫ్‌ల మోతతో, వీసాల భారంతో పీల్చిపిప్పి చేస్తూ తాను ఏడు యుద్ధాలను ఆపానని విర్రవీగుతూ, అహంతో రెచ్చిపోతూ, తనకే నోబెల్ శాంతి బహుమతి రావాలని వాంఛించిన ట్రంప్ చివరకు నోబెల్ శాంతి బహుమతి సాధనలో విఫలం కావడం ఒక గుణపాఠం. బెదిరించి నోబెల్ శాంతి బహుమతి సంపాదించాలనుకోవడం మూర్ఖత్వం.
ట్రంప్‌లో శాంతి కాముకత్వం ఏకోశాన కనబడదు. రాజనీతిజ్ఞత మచ్చుకైనా కానరాదు. గాజాను విహార కేంద్రం గా మార్చాలని ప్రయత్నించడం, ఉక్రెయిన్‌లో రేర్‌ఎర్త్ మినరల్స్ కాజేయడానికి ఒప్పందం కుదుర్చుకోవడం, అమాయకుల రుధిరంతో మారణహోమం చేస్తున్న పాక్‌తో అంటకాగడం శాంతికి సంకేతమా? రష్యా నుండి చమురు కొనుగోలు చేయవద్దని భారత్‌ను బెదిరించడం, ప్రతీకార సుంకాలు విధించడం రాజనీతిజ్ఞుడి లక్షణమా? గ్రీన్‌లాండ్‌ను వశపరచుకోవడానికి యత్నించడం, పనామా కాలువ తనదేనంటూ హుంకరించడం, కెనడాను అమెరికాలో విలీనం చేయాలని కోరడం ప్రపంచ శాంతికి సూచనా? విఘాతమా? ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తున్న పాక్, ఇజ్రాయెల్ వంటి దేశాలు నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్‌ను సమర్థించడం విడ్డూరం. నోబెల్ శాంతి బహుమతి తతంగం ముగిసింది.
కాబట్టి ఇప్పుడు ట్రంప్ ధోరణి ఎలా ఉంటుందో వేచిచూడాలి. అప్ఘనిస్తాన్- పాక్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. అప్ఘనిస్తాన్ జోలికొస్తే పాక్‌తో పాటు అమెరికాకు కూడా బుద్ధి చెపుతామంటూ అప్ఘన్ హెచ్చరిక జారీ చేసింది. బెలూచిస్తాన్, సింధ్, అజాద్ కశ్మీర్ లు పాక్ నుండి విడిపోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ వైఖరి పాక్‌కు అనుకూలంగా ఉంటుందా? లేదా భారత్‌పై కోపంతో పాక్ పక్షాన నిలబడి యుద్ధాగ్నికి ఆజ్యం పోస్తుందా? అనే ప్రశ్నలకు త్వరలోనే సమాధానం దొరుకుతుంది. ఇకనైనా ట్రంప్ తన ధోరణి మార్చుకోవాలి. ప్రపంచ శాంతికి చిత్తశుద్ధితో పని చేసి వచ్చే ఏడాది నోబెబ్ శాంతి బహుమతి కోసం ప్రయత్నించడం సర్వోత్తమం.
– సుంకవల్లి సత్తిరాజు
-9704903463