బీహార్‌లోని అధికార, విపక్ష పార్టీలు శాసనసభ ఎన్నికల కోసం సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే బహిరంగ సభలు, ఎన్నికల ర్యాలీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఈశాన్య బీహార్‌లోని కీలక ప్రాంతమైన సీమాంచల్‌పై అన్ని పార్టీలు, కూటములు దృష్టి సారించాయి. ఈ ప్రాంతం లో ఉన్న 24 సీట్లలో మెజారిటీ స్థానాల్లో గెలిచేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే ఈసారి సీమాంచల్ ప్రాంతంలో ఏయే పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది? ఏ పార్టీ అధిక సీట్లలో పాగా వేస్తుంది? కూటముల విజయ అవకాలేంటి? చూద్దాం. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. నవంబర్ 11న బీహార్ అసెంబ్లీ పోలింగ్ రెండవ దశతోపాటు ఈ ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు సిఇసి జ్ఞానేష్ కుమార్ తెలిపారు. ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, రాజస్థాన్, జార్ఖండ్, తెలంగాణ, పంజాబ్, మిజోరం, ఒడిశా రాష్ట్రాల్లో ఖాళీ అయిన 8 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 11న ఉప ఎన్నికలు జరుగనున్నాయి.
జమ్మూకశ్మీర్ సిఎం ఒమర్ అబ్దుల్లా రెండో స్థానంలో పోటీ చేసి గెలిచిన తర్వాత రాజీనామా చేసిన బుద్గామ్, ఎంఎల్‌ఎ దేవేందర్ సింగ్ రాణా మరణంతో ఖాళీ అయిన నగ్రోటా స్థానాలకు బై ఎలక్షన్స్ జరుగనున్నాయి. మరోవైపు రాజస్థాన్‌లోని అంటా ఎంఎల్‌ఎ కన్వర్‌లాల్ మీనా దోషిగా తేలి అనర్హత వేటుపటడంతో ఆ స్థానం ఖాళీ అయింది. జార్ఖండ్‌లోని ఘట్సిలా నియోజకవర్గం ఎంఎల్‌ఎ రాందాస్ సోరెన్, తెలంగాణలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎంఎల్‌ఎ మాగంటి గోపినాథ్, పంజాబ్‌లోని తర్న్ తరణ్ ఎంఎల్‌ఎ కశ్మీర్ సింగ్ సోహల్, మిజోరాంలోని డంపా నియోజకవర్గం ఎంఎల్‌ఎ లాల్రింట్లుంగా సైలా, ఒడిశాలోని నువాపాడ ఎంఎల్‌ఎ రాజేంద్ర ధోలాకియా మరణించిన నేపథ్యంలో ఆయా స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో ఈ 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల కోసం ఇసి షెడ్యూల్ జారీ చేసింది. సీమాంచల్ ప్రాంతంలో 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఎన్‌డిఎ అధిక సీట్లను గెలుచుకుంది. 12 స్థానాల్లో కాషాయ కూటమి జయకేతనం ఎగురవేసింది.
కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ ఏడు సీట్లకు పరిమితమైంది. అసదుద్దీన్ నేతృత్వంలో ఎఐఎంఐఎం అనుహ్యంగా ఐదు స్థానాల్లో పాగా వేసింది. గత ఎన్నికల్లో సీమాంచల్లో త్రిముఖ పోరు నెలకొంది. ఈసారి జరగబోయే ఎన్నికల్లోనూ ఎక్కువ సీట్లను కొల్లగొట్టాలని ఎన్‌డిఎ, మహాఘట్ బంధన్, ఎఐఎంఐఎం వ్యూహాలు రచిస్తున్నాయి.అందుకోసం సన్నద్ధమవుతున్నాయి. అలాగే బీహార్ రాజకీయాల్లోకి కొత్తగా ప్రవేశించిన ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో జన్ సురాజ్ పార్టీ కూడా సీమాంచల్లో మెరుగైన సీట్లను సాధించేందుకు ప్రణాళికలో వేస్తోంది. ఈ క్రమంలో సీమాంచల్ ప్రాంతంలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో చతుర్ముఖ పోటీ నెలకొంది. 2023 కుల ఆధారిత సర్వే ప్రకారం బీహార్ మొత్తం జనాభా 13.07 కోట్లు. అందులో ముస్లింలు 17.7% ఉన్నారు. సీమాంచల్ జిల్లాల్లో ముస్లిం జనాభా కాస్త ఎక్కువే.
పూర్నియాలో 40%, అరారియాలో 43%, కతిహార్‌లో 45%, కిషన్ గంజ్‌లో 68% మంది ముస్లింలు ఉన్నారు. యాదవులు, ఇబిసిలు కూడా ఈ ప్రాంతంలో గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. సీమాంచల్ జిల్లాలు రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే అత్యంత పేదల జిల్లాల్లో ఒకటిగా ఉన్నాయి. 2019- 21లో నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం, ఈ నాలుగు జిల్లాల్లోని జనాభాలో 44- 52 శాతం మంది పేదరికంతో బాధపడుతున్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ అధికార పార్టీ ఓడిపోతే కేంద్రంలో బిజెపికి పెద్ద దెబ్బే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏకంగా కేంద్ర ప్రభుత్వమే కూలిపోయే పరిస్థితి ఏర్పడవచ్చని అంటున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్‌కు పరీక్షే. కొంచెం అటూ ఇటూ అయితే ప్రధాని పదవి నుంచి మోడీ పక్కకే. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు గెలవడం జెడియు కంటే కేంద్రంలో బిజెపికి చాలా ముఖ్యం. 243 నియోజకవర్గాలు ఉన్న బీహార్ రాష్ట్రంలో రాజకీయాలు దేశ రాజకీయాలను ప్రభావితం చేయనున్నాయి. కేంద్రంలో బిజెపి నిలబడాలంటే మెయిన్ పిల్లర్ బీహార్‌లో నితీశ్ కుమార్ (జెడియు). 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లో జెడియు 12 సీట్లు గెలిచింది.
ఎన్‌డిఎ కూటమిలో బీహార్ నుంచి జెడియు నితీశ్ కుమార్, జనశక్తి పార్టీ చిరాగ్ పాశ్వాన్‌లు భాగం. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ కుమార్ జెడియు పార్టీకి బిజెపితో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటుకు కావలసిన సీట్లు రాకపోతే నితీశ్ కుమార్ కూటమి వీడే అవకాశం ఉంది. గతంలో ముఖ్యమంత్రి పదవి కోసం నితీశ్ కుమార్ కూటమినే మార్చేశారు. ప్రాంతీయ పార్టీలు లేదా ఇండియా కూటమితో కలిసే ఛాన్స్ కూడా ఉంది. అలా జరిగితే కేంద్రంలో ఎంపిల మద్దతు కూడా బిజెపి నుంచి కాంగ్రెస్ సారథ్యంలోని షిఫ్ట్ అవుతుంది. బీహార్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం నితీశ్ కుమార్ కంటే బిజెపి పార్టీకే చాలా ముఖ్యం. బిజెపి ఎంఎల్‌ఎ అభ్యర్థులు ఎక్కువ మంది గెలిచినా ముఖ్యమంత్రిగా మాత్రం నితీశ్ కుమారే అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025లో ఎన్‌డిఎ కూటమి సత్తా చాటుకుంటే నితీశ్ కుమార్ కూటమి మారే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో చిరాగ్ పాశ్వాన్, నితీశ్ కుమార్ పార్టీలు కలిసి పని చేసినా అసెంబ్లీ ఎన్నికలు వచ్చే సరికి వారి మధ్య సయోధ్య కుదరడం లేదు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ అన్ని స్థానాల్లో తమ అభ్యర్థులను పోటీకి నిలబెడతామని ప్రకటించింది. 11మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితా ఇప్పటికే విడుదల చేసింది. అయితే బీహార్‌లో పాతుకుపోయిన కుల రాజకీయాలు, స్థానిక పార్టీల బలమైన ఓటు బ్యాంకుల ముందు ఆప్ నిలబడుతుందా? అనవసరంగా సమయాన్ని వృథా చేస్తోందని పలువురు వాదిస్తున్నారు. కానీ ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. ఆయన ప్రతి కదలిక బహుముఖ ప్రజ్ఞతో కూడుకున్నది. జులైలో కేజ్రీవాల్ తన పార్టీ బీహార్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని, ఇండియా బ్లాక్‌తో పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగానే ఆయన వ్యూహాత్మక ప్రణాళికతో బరిలోకి దిగుతున్నారు. ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ, పంజాబ్‌లలో తమ ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు.
అదే ఊపులో దేశానికి కొత్త రాజకీయ భవిష్యత్తును తీసుకువస్తానని హామీ ఇచ్చారు. కానీ అనూహ్యంగా గత ఎన్నికల్లో ఢిల్లీలో ఓటమి పాలయ్యారు. పంజాబ్‌లో మాత్రం ఆయన ప్రజాదరణ చెక్కుచెదరకుండా ఉంది. గోవా, గుజరాత్‌లలో కూడా పార్టీ నెమ్మదిగా ఊపందుకుంది. అయితే ఇప్పుడు బీహార్‌లోనూ రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. ఈ ఎన్నికలను తేలికగా తీసుకోమని, తమ సత్తా చాటుతామని కేజ్రీవాల్ ప్రకటించడం బీహార్ రాజకీయాలను హీటెక్కించింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఆప్ సంస్థాగతంగా బలహీనంగా ఉంది. కానీ పాట్నా, ముజఫర్‌పూర్, బెగుసరాయ్ వంటి ప్రాంతాల్లో ఆప్ 2-4% ఓట్లను సాధించే అవకాశం ఉందని పలు సర్వేలు అంచనా వేస్తున్నాయి.
– ఇస్కా రాజేష్ బాబు
93973 99298